Junior NTR Amit Shah Meeting: ఓరి నాయనో.. జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్‌షా భేటీ వెనుక..

ABN , First Publish Date - 2022-08-21T21:47:21+05:30 IST

ఆయన బీజేపీ (BJP) అధిష్టానంలో నెంబర్.2 స్థానంలో ఉన్న నేత. మరొకరు టాలీవుడ్‌లో (Tollywood) స్టార్ హీరో. ఈ ఇద్దరూ భేటీ అవుతున్నారన్న వార్త ప్రస్తుతం అటు సినీ వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా..

Junior NTR Amit Shah Meeting: ఓరి నాయనో.. జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్‌షా భేటీ వెనుక..

హైదరాబాద్: ఆయన బీజేపీ (BJP) అధిష్టానంలో నెంబర్.2 స్థానంలో ఉన్న నేత. మరొకరు టాలీవుడ్‌లో (Tollywood) స్టార్ హీరో. ఈ ఇద్దరూ భేటీ అవుతున్నారన్న వార్త ప్రస్తుతం అటు సినీ వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రస్తావన ఎవరి గురించో ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. నేడు అమిత్ షాను (Amit Shah) జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) కలవనున్నారన్న వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మునుగోడు (Munugode) సభ తర్వాత అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ (Junior NTR Amit Shah Meeting) కానున్నట్లు సమాచారం. నోవాటెల్ హోటల్లో అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కానున్నారు. ఇటీవలే RRR సినిమా చూసిన అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ నటన మెచ్చి ఆహ్వానించినట్లు తెలిసింది. బీజేపీ వర్గాలు ఇలా చెబుతున్నప్పటికీ ఈ భేటీలో రాజకీయ అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశం లేకపోలేదని ప్రచారం జరుగుతోంది. కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. టీడీపీ (TDP) పక్షానే ఉన్నప్పటికీ పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ ఎన్టీఆర్ భాగస్వామి కాలేదు. రాజకీయాలకు వీలైనంత దూరం జరిగి సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్‌లో (Tollywood) తనకంటూ ఒక స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్‌ను (Jr ntr) కేవలం సినిమాలో బాగా నటించాడని ప్రశంసించేందుకే పిలిచి ఉంటారని భావించలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ RRR సినిమా అంత నచ్చి ఉంటే రామ్‌చరణ్‌ను (Ram Charan) కూడా పిలిచి ఉండొచ్చు కదా అనే అభిప్రాయం కూడా సోషల్ మీడియా (Social Media) సాక్షిగా వ్యక్తమవుతోంది. సమావేశం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది.



బీజేపీకి సినిమా గ్లామర్ తోడైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేదని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే చిరంజీవితో బీజేపీ అగ్రనేతలు పలుమార్లు చర్చలు జరిపారు. జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్‌షా భేటీ ద్వారా బీజేపీ ఏం ఆశిస్తోంది..? ఎన్టీఆర్‌ను తురుపు ముక్కగా వాడుకోవాలని బీజేపీ భావిస్తోందా..? జూనియర్ ఎన్టీఆర్‌తో సమావేశం కావడం ద్వారా టీఆర్‌ఎస్, వైసీపీ వ్యతిరేకులను ఆకర్షించే ప్రయత్నమా..? వేడెక్కిన తెలంగాణ రాజకీయాల్లో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే జూనియర్‌ను అమిత్‌షా రమ్మన్నారా..? జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ తర్వాత అమిత్‌షా ఏం చర్చించారో ఆ వివరాలను బీజేపీ బయటపెడుతుందా..? జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షా భేటీ నేపథ్యంలో వ్యక్తమవుతున్న ప్రశ్నలివి. అయితే.. టీడీపీకి అండగా నిలిచే నందమూరి అభిమానులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీని అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. అందుకు కారణం లేకపోలేదు. గతంలో చాలా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్‌పై రాజకీయంగా రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే.. కొడాలి నాని వైసీపీలో చేరిన సందర్భంలో తనపై జరిగిన దుష్ప్రచారాన్ని జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్‌‌మీట్ పెట్టి మరీ ఖండించిన విషయాన్ని, ఆ సందర్భంలో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను అభిమానులు గుర్తుచేసుకున్నారు. తన కట్టె కాలేంత వరకూ, తనలో ప్రాణం ఉన్నంత వరకూ, తెలుగు జాతి బ్రతికున్నంత వరకూ, తెలుగుదేశం పార్టీ బ్రతికున్నంత వరకూ టీడీపీతోనే ఉంటానని జూనియర్ చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ కార్యకర్తలు మననం చేసుకుంటున్నారు. అందువల్ల.. అమిత్‌షా భేటీ అయినంత మాత్రాన తమ హీరో బీజేపీలో చేరేంత పరిస్థితి ఏమాత్రం ఉండదని జూనియర్ అభిమానులు కుండబద్ధలు కొట్టి మరీ చెబుతున్నారు.




అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయనున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ రెండు పార్టీలతో జనసేన కూడా జత కట్టే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ ఊహాగానాల నేపథ్యంలో.. జూనియర్‌ ఎన్టీఆర్‌తో అమిత్‌షా భేటీ కొంత ప్రాధాన్యం సంతరించుకున్న మాట వాస్తవం. అమిత్‌షా‌తో జూనియర్ ఎన్టీఆర్‌ సమావేశం అవ్వడం వల్ల ఇప్పటికిప్పుడు తమకు రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం కలగకపోయినప్పటికీ, రానున్న రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్‌‌ను ఏపీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తోందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాదిలో బలపడేందుకు బీజేపీ తెర వెనుక వ్యూహ రచన చేస్తోంది. అందులో భాగంగానే.. తమిళనాడులో రజనీకాంత్‌ను కూడా తమవాడిగా మార్చుకునేందుకు బీజేపీ ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆయనకు గవర్నర్ పోస్ట్ ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. ఇలా.. దక్షిణాదిలోని ప్రతి రాష్ట్రంలో కరిష్మా కలిగిన ప్రముఖులను పార్టీలో చేర్చుకుని తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ఎత్తుగడలో భాగంగా బీజేపీ ముందుకెళుతోంది.




కేజీఎఫ్2 (KGF2) సినిమాతో దేశవ్యాప్తంగా ఎక్కడ లేని క్రేజ్ తెచ్చుకున్న నటుడు యష్‌ను (Yash) కూడా రాజకీయంగా వినియోగించుకోవాలని బీజేపీ (BJP) భావిస్తున్నట్లు సమాచారం. గతంలో యష్ ఒక సందర్భంలో మైసూరు (Mysore), మాండ్యా (Mandya) జిల్లాల్లో పోటీ చేసిన కొందరు బీజేపీ, జేడీఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం కూడా చేశాడు. అయితే.. ఆ సందర్భంలో యష్ ఒక విషయం మాత్రం స్పష్టం చేశాడు. తాను ఏ రాజకీయ పార్టీకి మద్దతు తెలపడం లేదని, తాను మంచివాళ్లని నమ్మిన అభ్యర్థుల తరపున మాత్రమే ప్రచారం చేశానని యష్ చెప్పాడు. అలాంటి యష్‌ను తమ వైపు తిప్పుకోవడం, రాజకీయంగా ఎన్నికల ప్రచారానికి అతనిని వినియోగించుకోవడం బీజేపీకి పెద్ద పనేమీ కాకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటకను (Karnataka) మినహాయిస్తే మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో (South States) కూడా బలపడాలని భావిస్తున్న బీజేపీ.. పాలిటిక్స్‌కు కాస్తంత సినీ గ్లామర్‌ను కూడా జత చేసి తద్వారా పొలిటికల్ మైలేజ్ పొందాలని భావిస్తోంది. ఆ వ్యూహంలో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్‌తో (Jr ntr) కూడా అమిత్ షా (Amit Shah) భేటీ కానున్నారనేది రాజకీయ విశ్లేషకుల మాట. తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు అంత బలంగా లేని బీజేపీ ప్రస్తుతం తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు (TRS) సవాల్ విసిరేంతలా బలపడింది. ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులను పార్టీలో చేర్చుకుంటూ అధికారమే లక్ష్యంగా తెలంగాణలో ముందుకెళుతోంది.




ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఒంటరిగా బరిలోకి దిగి అధికారంలోకి వచ్చే పరిస్థితులు బీజేపీకి (BJP) ప్రస్తుతానికైతే లేవు. పైగా.. ఏపీ రాజకీయాల్లో (AP Politics) సామాజిక వర్గాలు కీలక పాత్ర పోషిస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ క్రమంలోనే.. చిరంజీవిని (Chiranjeevi) అక్కున చేర్చుకోవడం ద్వారా కాపులకు దగ్గర కావచ్చని బీజేపీ (BJP) భావిస్తోందని సమాచారం. కృష్ణం రాజు ఎలాగూ బీజేపీలోనే ఉండటంతో ప్రభాస్‌ను (Prabhas) ఎన్నికల ప్రచారానికి వినియోగించుకోవాలని కూడా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. తద్వారా ఆ సామాజిక వర్గ ఓటు బ్యాంకు కూడా తమకు అనుకూలంగా మారుతుందనేది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. తాజాగా.. జూనియర్ ఎన్టీఆర్‌తో (Jr ntr) భేటీ వెనుక కూడా బీజేపీ రాజకీయ ప్రయోజనాలు ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూసుకుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాజకీయానికి తోడు సినీ గ్లామర్‌‌తో ముందుకెళ్లాలని ఫిక్స్ అయినట్లు మాత్రం పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.


సాంబశివారెడ్డి పేరం

Updated Date - 2022-08-21T21:47:21+05:30 IST