చెరిపేసుకుంటున్నారు.. ‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి..!

ABN , First Publish Date - 2021-11-13T19:14:40+05:30 IST

‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి..!

చెరిపేసుకుంటున్నారు.. ‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి..!

  • పెరిగిన వైట్‌నర్‌ వినియోగం
  • ఈజీగా... చౌకగా... దొరకడమే కారణం
  • ప్రత్యామ్నాయాలకు బానిసలవుతున్న యువత

హైదరాబాద్‌ సిటీ : గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు డ్రగ్స్‌ను కూడా కట్టడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు మత్తుబాబుల దృష్టి వైట్‌నర్‌పై పడింది. పోలీసుల వరుస దాడులతో గంజాయి అందక మత్తు కోసం వైట్‌నర్‌ను పీల్చి.. తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. ఖరీదు తక్కువ కావడం, మార్కెట్‌లో ఈజీగా లభిస్తుండడంతో వైట్నర్‌ కిక్కుకు యువత బానిస అవుతున్నారు. నిర్మానుష్య ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రోడ్ల పక్కన ఆగి ఉన్న పాత వాహనాలను అడ్డాగా మార్చుకుని వైట్‌నర్‌ సేవిస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌, గంజాయితో పాటు పోలీసులకు మరో సవాలుగా మారిన వైట్‌నర్‌ ఎక్కడ, ఎలా దొరుకుతుంది, వైట్‌నర్‌కు ఎలా బానిసలు అవుతున్నారు అనే అంశాలపై ‘ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి’ జరిపిన పరిశీలనలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి.


వైట్‌నర్‌ అంటే..

అక్షరాల్లో తప్పులుంటే వాటిపై వైట్‌నర్‌ అద్దుతారు. దీంతో మళ్లీ దానిపై రాసుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా కీలక పత్రాలు, ఫైళ్లలో మార్పులు, చేర్పులు చేసేందుకు దీన్ని వినియోగిస్తారు. వైట్‌నర్‌ తయారీలో కొన్ని రసాయనాలు వాడతారు. ఆ రసాయనాల్లో ఓ రకమైన మత్తు ఉంటుంది. ఆ మత్తుకోసమే కొందరు వైట్‌నర్‌ను పీలుస్తున్నారు. కొందరు యువకులు, విద్యార్థులు, యాచకులు వీటిని యథేచ్ఛగా వాడుతున్నారు. వైట్‌నర్‌ మత్తులో మునిగి తేలుతున్నారు. 


యథేచ్ఛగా వైట్‌నర్‌ అమ్మకాలు

పోలీసులు వైట్‌నర్‌పై కూడా నిషేధం విధించారు. అయినప్పటికీ కొన్ని షాపుల్లో వీటి విక్రయాలు సాగుతున్నట్లు ‘ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో తేలింది. కేవలం రూ. 25 చెల్లిస్తే వైట్‌నర్‌ పెన్‌లు విక్రయిస్తున్నారు. దాన్ని ఓ ప్లాస్టిక్‌ కవర్లో వేసి పీల్చడం ద్వారా మత్తును పొందుతున్నారు. సాధారణంగా ఆ ఘాటు తట్టుకోవడం కష్టమే. కానీ అలవాటు పడ్డవాళ్లు వ్యసనపరులుగా మారుతున్నారు. ఆ మత్తులో కొందరు నేరాలకు సైతం పాల్పడుతున్నారు.


మత్తులో గొంతు కోసుకొని..

మత్తులో గొంతు కోసుకొని ఓ వ్యక్తి హంగామా సృష్టించాడు. పోలీసులు 108లో ఆస్పత్రికి తరలించినా అత్యవసర చికిత్స తీసుకొని పారిపోయాడు. సైఫాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 8.30 సమయంలో ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఓ వ్యక్తి మత్తులో గొంతు కోసుకున్నాడు. అక్కడి నుంచి మున్సిపల్‌ కార్యాలయం ప్రధాన గేటు వరకు ఉన్న ఫుట్‌పాత్‌పై కేకలు వేసుకుంటూ పరిగెత్తాడు. గొంతు నుంచి తీవ్రంగా రక్తం కారుతుండడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. కొందరు పోలీసులకు విషయాన్ని చేరవేయడంతో 108 సహాయంతో అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. కొద్దిసేపటికే అతడు అక్కడి నుంచి పారిపోయాడు. మత్తులో ఉండడంవల్ల అతడి పేరు, వివరాలు చెప్పలేకపోయాడని పోలీసులు తెలిపారు. ఆచూకీ కోసం వెదుకుతున్నామని, అతడు గంజాయి లేదా వైట్నర్‌ తీసుకొని ఉంటాడని పేర్కొంటున్నారు. కుడి చేయికి వైకల్యం ఉందని తెలిపారు.


ప్రమాదం

బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లు, నిర్జన ప్రదేశాలు వైట్నర్‌ వ్యసనపరుల అడ్డాలుగా మారుతున్నాయి. వైట్నర్‌ను పీల్చడం చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. శరీరాన్ని బలహీనపరుస్తుందని పేర్కొంటున్నారు. కేవలం లిక్విడ్‌ వైట్నర్‌ను మాత్రమే ప్రభుత్వం నిషేధించింది. ఘన రూపంలో దొరుకుతుండటంతో మత్తుబాబులకు వరంగా మారుతోంది. డిమాండ్‌ నేపథ్యంలో వైట్నర్‌ విక్రయించే ముఠాలు సైతం పుట్టుకొస్తున్నాయి.

Updated Date - 2021-11-13T19:14:40+05:30 IST