ఈ ఫ్లాట్స్ చూడగానే కచ్చితంగా కొనేయాలనిపిస్తుంది.. ఒక్కసారి లోపలికెళ్లి చూస్తే షాక్.. ఆంధ్రజ్యోతి పరిశీలనలో సంచలన విషయాలు వెలుగులోకి..

ABN , First Publish Date - 2022-05-17T15:29:12+05:30 IST

ఈ ఫ్లాట్స్ చూడగానే కచ్చితంగా కొనేయాలనిపిస్తుంది.. ఒక్కసారి లోపలికెళ్లి చూస్తే షాక్.. ఆంధ్రజ్యోతి పరిశీలనలో సంచలన విషయాలు వెలుగులోకి..

ఈ ఫ్లాట్స్ చూడగానే కచ్చితంగా కొనేయాలనిపిస్తుంది.. ఒక్కసారి లోపలికెళ్లి చూస్తే షాక్.. ఆంధ్రజ్యోతి పరిశీలనలో సంచలన విషయాలు వెలుగులోకి..

  • ఫ్లాట్‌ కొంటే.. పాట్లేనా..?
  • పదేళ్ల నాటి నిర్మాణాలు
  • పూర్తి కాని ప్లంబింగ్‌ పనులు 
  • వైరింగ్‌, పెయింటింగ్‌ కూడా..
  • అదనంగా రూ.4లక్షల ఖర్చు
  • ఓ ఆర్కిటెక్‌ సంస్థ అంచనా
  • ఆకట్టుకునేలా మోడల్‌ ఫ్లాట్లు
  • బండ్లగూడ ఫ్లాట్స్‌ ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలన

కొనుగోలు దారులు చూసేందుకు కొన్ని ఫ్లాట్లను (Plots) అందంగా తీర్చిదిద్దారు. ఆ ఫ్లాట్లను చూస్తే ఫ్లాట్‌ కావాల్సిందే.. ఓ ఆర్కిటెక్‌ సంస్థ వాటిని అలా తీర్చిదిద్దింది. లోపలికి వెళ్తే అసలు విషయం తెలుస్తుంది. కొన్ని ఫ్లాట్లలో చిన్నచిన్న మరమ్మతులు, అసంపూర్తిగా మిగిలిన పనులు దర్శనమిస్తున్నాయి.


హైదరాబాద్‌ సిటీ : పదేళ్ల క్రితం నిర్మించిన నాగోల్‌-బండ్లగూడలోని ఫ్లాట్లలో కొన్ని పనులు అసంపూర్తిగా ఉన్నాయి. పదేళ్ల క్రితం నిర్మించిన ఫ్లాట్లలో కొన్నింటికి తలుపులు లేవు. చాలా ఫ్లాట్లు పిల్లులకు, పావురాలు, పక్షులకు ఆవాసాలుగా మారాయి. బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లను ఆన్‌లైన్‌ వేదికగా లాటరీ పద్ధతిలో వచ్చే నెలలో విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ (HMDA) చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో బండ్లగూడలోని ఫ్లాట్స్‌ను ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలించింది. ఉమ్మడి రాష్ట్రంలో మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకుని హౌసింగ్‌ బోర్డు (Housing Board) నాగోల్‌ బండ్లగూడ, పోచారం, జవహర్‌నగర్‌, గాజులరామారంలలో అపార్ట్‌మెంట్లను (Apartments) నిర్మించారు. విక్రయానికి పెట్టిన బండ్లగూడలోని రాజీవ్‌ స్వగృహ అపార్ట్‌మెంట్స్‌ ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు నుంచి 5.2 కి.మీ.ల దూరంలో ఉండగా, నాగోల్‌ మెట్రోస్టేషన్‌ (Metro Station) నుంచి 4.3 కి.మీ.ల దూరంలో ఉన్నాయి. అపార్ట్‌మెంట్స్‌ పక్కన నుంచి నాగోల్‌-ఔటర్‌ రింగ్‌ రోడ్డు రేడియల్‌ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు నుంచే విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిని కలుపుతూ రెండు లైన్ల లింకురోడ్డు కూడా ఉంది. అపార్ట్‌మెంట్స్‌ నుంచి ఔటర్‌రింగ్‌ రోడ్డు 13.2 కి.మీ.ల దూరంలో ఉంది.


బయటి నుంచి చూస్తే..

అపార్ట్‌మెంట్లకు ఇటీవల రంగులు (Colours) వేయడంతో బయటి నుంచి చూస్తే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. కానీ, ఆయా అపార్‌మెంట్లలోకి వెళ్లి పరిశీలిస్తే విషయం అవగతమవుతోంది. సెమి ఫినిష్డ్‌ ఫ్లాట్లు మాత్రం ప్లాస్టింగ్‌ గోడలతోనే దర్శనమిస్తున్నాయి. కొన్ని ఫ్లాట్లలో గోడలు కూడా దెబ్బతిని ఉన్నాయి. గోడలకు లప్పం వర్క్‌తోపాటు పెయింటింగ్‌ చేసుకోవాల్సి ఉంది. ప్రతి ఫ్లాట్‌లో లోపలి డోర్లు లేవు. కొన్ని ఫ్లాట్స్‌కు ప్రవేశ ద్వారం గడపలు దెబ్బతిన్నాయి. కొన్ని ఫ్లాట్లకు వైరింగ్‌ లేదు. స్విచ్‌ బోర్డులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఫ్లోరింగ్‌ టైల్స్‌ వినియోగించారు. కిచెన్‌లో కొంతభాగం టైల్స్‌ వాడారు. మరుగుదొడ్లలో కుండీలు లేవు. ఫ్లషర్‌, వాష్‌ బేసిన్‌ లేవు. నల్లాలు బిగించలేదు. ఆయా ఫ్లాట్లను నివాసానికి  సిద్ధం చేసుకోవాలంటే కనీసం రూ.4లక్షలను అదనంగా ఖర్చు చేసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఆర్కిటెక్చర్‌తో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ను సంసిద్ధం చేయిస్తే ఫాల్‌సీలింగ్‌, కప్‌బోర్డ్సు, కర్టెన్స్‌తో కలిపి సుమారు రూ.6లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. అదే త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ అయితే రూ.9లక్షలు ఖర్చవుతుందని ఓ ఆర్కిటెక్ట్‌ సంస్థ అంచనా వేసింది.


ఆకట్టుకుంటున్న మోడల్‌ ఫ్లాట్స్‌..

33 అపార్ట్‌మెంట్లలో 1,501 ఫ్లాట్లను ఆన్‌లైన్‌లో లాటరీ ప్రతిపాదికన విక్రయించడానికి ఇప్పటికే సిద్ధం చేశారు. సెమి ఫినిష్డ్‌కు చదరపు అడుగు ధర రూ.2,750, ఫిని్‌ష్డకు రూ.3వేలు నిర్ణయించారు. పార్కింగ్‌, డెవల్‌పమెంట్‌, వెల్ఫేర్‌ సొసైటీ ఫీజులు అదనంగా ఉన్నాయి. ఫ్లాట్లను చూసేందుకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా కొన్ని మోడల్‌ ఫ్లాట్స్‌ను ఓ ఆర్కిటెక్ట్‌ సంస్థతో సిద్ధం చేశారు. అపార్ట్‌మెంట్లను పరిశీలించేందుకు వచ్చేవారు మోడల్‌ ఫ్లాట్స్‌ చూసి మంత్రముగ్ధులవుతున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన రిజిస్ర్టేషన్‌ సెంటర్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవడం కనిపించింది.


విశాలంగా 33 అపార్ట్‌మెంట్లు..

బండ్లగూడలో  సుమారు 40ఎకరాల్లో సువిశాలంగా 33 అపార్ట్‌మెంట్‌ బ్లాక్‌లను నిర్మించారు. ప్రతి ఫ్లాట్‌కు గాలి, వెలుతురు వచ్చేలా పట్టణ ప్రణాళిక నిబంధనల ప్రకారం చేపట్టారు. ప్రతి అపార్ట్‌మెంట్‌ గ్రౌండ్‌ ప్లస్‌ 9 అంతస్తుల్లో నిర్మించారు. కొన్నింటికి సెల్లార్‌ పార్కింగ్‌ ఇవ్వలేదు. ఫ్లాట్స్‌ మొత్తం ఉత్తరం, దక్షిణ ముఖాలతో ఉన్నాయి. ఫ్లాట్ల మధ్య కారిడార్‌, మెట్ల మార్గం కూడా విశాలంగా ఉంది. ఒక్కో అపార్ట్‌మెంట్‌కు రెండు లిఫ్ట్‌ మార్గాలు, రెండు మెట్ల మార్గాలున్నాయి.

Updated Date - 2022-05-17T15:29:12+05:30 IST