ABN effect‌: Americaలో Durgamma పూజల గోల్‌‌మాల్‌‌పై దేవాదాయ శాఖ స్పందన

ABN , First Publish Date - 2022-07-07T20:49:42+05:30 IST

అమెరికాలో కనక దుర్గమ్మ పూజల గోల్‌‌మాల్‌‌పై ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి కథనాలపై దేవాదాయ శాఖ స్పందించింది.

ABN effect‌: Americaలో Durgamma పూజల గోల్‌‌మాల్‌‌పై దేవాదాయ శాఖ స్పందన

విజయవాడ (Vijayawada): అమెరికా (America)లో కనక దుర్గమ్మ (Kanaka Durga) పూజల గోల్‌ మాల్‌‌పై ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) కథనాలపై దేవాదాయ శాఖ అధికారులు స్పందించారు. అమెరికాలో దుర్గమ్మ పూజల వ్యవహారంలో సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కమీషనర్‌ హరి జవహర్‌ లాల్‌ (Hari Jawahar Lal) ఆదేశించారు. పూజల నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించిన దేవాదాయ శాఖ టెంపుల్స్‌ అడ్వైజర్‌, ఎన్‌ఆర్‌ఐ వింగ్‌ చెన్నూరి సుబ్బారావు (Chennuri Subbarao)ను ప్రభుత్వం వివరణ కోరింది. అమెరికాలో ఏఏ ఆలయాల్లో పూజలు నిర్వహించారు... ఎక్కడెక్కడ ఎంతెంత వసూలు చేశారనే అంశాలపై నెలలోగా వివరాలు సమర్పించాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశించారు.


పూర్తి వివరాలు...

భక్తుల కొంగుబంగారం దుర్గమ్మ పూజల పేరిట అమెరికాలో కొందరు సొమ్ముచేసుకున్నారు. వీరికి దుర్గగుడి దేవస్థానం పెద్దల సహకారం కూడా లభించింది. అమ్మవారి పూజల నిర్వహణ పేరుతో కొందరు ప్రైవేటు వ్యక్తులు అమెరికాలోని 10 ప్రధాన నగరాల్లో పర్యటించి... కోట్లాది రూపాయలు కానుకల రూపంలో సేకరించారు. ఇలా సేకరించిన మొత్తంలో నయాపైసా కూడా దుర్గగుడికి జమ చేయలేదు. ఎవరో ప్రైవేటు వ్యక్తులు చేపట్టిన ఈ పూజల నిర్వహణకు దేవస్థానం అధికారులు తమ వంతు సహాయ సహకారాలు అందించడం గమనార్హం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మకు దేశవిదేశాల్లోనూ భక్తులు ఉన్నారు. అమెరికాలో ఉన్న దుర్గమ్మ భక్తులను పూజల పేరుతో ఆకట్టుకుని సొమ్ము చేసుకునే ఉద్దేశంతో కొందరు ప్రైవేటు వ్యక్తులు దేవాదాయ మంత్రి పేషీలో చక్రం తిప్పారు. పూజల నిర్వహణకు అనుమతి తెచ్చుకున్నారు. దుర్గగుడి అధికారులూ వారికి తమ వంతు సహాయ సహకారాలు అందించారు. నలుగురు అర్చకులను దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఈవో) పంపారు. అమెరికా వెళ్లిన వారిలో ఉప ప్రధాన అర్చకులు కోట ప్రసాద్‌, శంకర్‌ శాండిల్య, అర్చకులు సుబ్రమణ్యం, గోపాలకృష్ణ ఉన్నారు.


వీరు ఈ ఏడాది మే 28 నుంచి జూన్‌ 26 వరకు ఐదువారాలపాటు అమెరికాలోని 10 ప్రధాన నగరాల్లో పర్యటించి దుర్గదేవి పూజలు నిర్వహించేందుకు ఈవో అనుమతి మంజూరు చేశారు. వీరు న్యూజెర్సీ, కాలిఫోర్నియా వంటి 10 ప్రధాన నగరాల్లో దుర్గాదేవి పూజలు నిర్వహించారు. అమెరికాలో పలు హిందూ దేవాలయాల ఆహ్వానం మేరకు అర్చకులను పంపుతున్నట్లు పేర్కొన్నా, పూజల నిర్వహణ మొత్తం కొందరు ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలోనే జరిగినట్లు చెబుతున్నారు. 


అలంకరణ సామాగ్రికీ అనుమతి

అమెరికాలో ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించేందుకు అమ్మవారి అలంకరణ సామగ్రిని తీసుకెళ్లేందుకు దేవస్థానం అధికారులు అనుమతించారు. 15 కేజీల విలువైన ఆభరణాలను పూజారులు తమ వెంట తీసుకెళ్లారు. వీటిలో అమ్మవారి ఎనిమిది చేతులు, అమ్మవారు ధరించే వివిధ ఆయుధాలు, పాదాలు, కిరీటం, చంద్రవంక, త్రిశూలం వంటివి ఉన్నాయి. అమ్మవారి ఆభరణాలను ఇలా తీసుకెళ్లడం సరికాదన్నది అర్చక స్వాములు చెబుతున్న మాట. అమెరికాలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో సుమారు 2 లక్షల డాలర్ల వరకు కానుల రూపంలో సేకరించారని సమాచారం. అంటే మన దేశ కరెన్సీలో సుమారు కోటిన్నర పైచిలుకు. ఇందులో ఒక్క రూపాయి కూడా దుర్గమ్మకు జమ చేయకపోవడం చర్చనీయాంశమైంది.


పూజారులకు రవాణాఖర్చులు, వసతి ప్రైవేటు వ్యక్తులే భరించారు. ఒక్కో నగరంలో ఒక్కో పూజారికి 200 డాలర్లు అంటే సుమారు రూ.15 వేలు చెల్లించారు. ఈ లెక్కన నలుగురు పూజారులకు ఒక నగరంలో పూజలు నిర్వహిస్తే చెల్లించిన మొత్తం రూ.60వేలు. 10 ప్రధాన నగరాల్లో రూ.6 లక్షలు, వసతి, రవాణాకు మరో రూ.20 లక్షలు ఖర్చయిందనుకున్నా... సుమారు కోటి నికరంగా అమ్మవారి పూజల పేరుతో ప్రైవేటు వ్యక్తులు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 

Updated Date - 2022-07-07T20:49:42+05:30 IST