Advertisement

కాకలు తీరిన సోమిరెడ్డికి ఎదురుగాలి.. అధిష్టానం ఆలోచన ఎలా ఉందో!?

Jan 24 2021 @ 17:53PM

నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గం టీడీపీకి ఎందుకు చేజారుతోంది? మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరుసగా నాలుగుసార్లు ఓడిపోవడానికి కారణం ఏమిటి? ప్రస్తుతం టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం ఎందుకు ఏర్పడింది? వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే కాకాణిపై ఎవరు బరిలోకి దిగనున్నారు? సోమిరెడ్డి తనయుడి గురించి ఏమంటున్నారు? కాకలు తీరిన సోమిరెడ్డికి పొలిటికల్ మైనస్‌లు ఏమిటి? ఈ విషయాలపై సర్వేపల్లి తెలుగు తమ్ముళ్లలో ఎలాంటి చర్చ జరుగుతోంది? వాచ్‌ దిస్‌ స్టోరీ? 

 

వరుసగా నాలుగుసార్లు ఓటమి..

నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గం... కృష్టపట్నం పోర్టు, పరిశ్రమలు, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు ఓ వైపు.. జలజలపారే కాలువలు, పచ్చని పొలాలు మరో వైపు... సుదూర ప్రాంతాల నుంచి పొట్టచేతపట్టుకొచ్చే బతుకుజీవులు ఇంకో వైపు...హెలికాప్టర్లలో ల్యాండ్‌ అయ్యే దేశ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు మరో వైపు... ఇలా ఆధునికత, సాంప్రదాయ జీవనశైలికి కలబోతగా విరాజిల్లుతున్న ప్రాంతమిది. ఇక్కడి నుంచి ప్రముఖ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను శాసించారు. 1994, 99 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరసగా నాలుగు సార్లు ఓటమి చవిచూశారు.

అప్పట్లో సంచలనం..

నియోజకవర్గంలో టీడీపీకి బలమున్నప్పటికీ.. నాయకుల మధ్య ఆధిపత్య పోరు, శత్రుశేషాలతో సోమిరెడ్డి ఓటమికి కారణమన్న వాదనలు ఉన్నాయి. సోమిరెడ్డికి రాజకీయ శత్రువుల సంఖ్య ఎక్కువనే చెబుతారు. ఆనం సోదరులతో సోమిరెడ్డికి అస్సలు గిట్టేదికాదంటారు. ఆ తర్వాత ప్రస్తుత నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో విభేదాలు తలెత్తి.. అవి కాస్తా బద్ధ శత్రుత్వానికి దారితీశాయంటారు. ‘నీ నియోజకవర్గానికే వస్తా...నువ్వు ఎలా గెలుస్తావో చూస్తా’నంటూ ఆదాల.. సోమిరెడ్డికి సవాల్‌ చేయడం అప్పట్లో సంచలనం రేపింది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీచేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. అనంతర పరిణామాల్లో సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డితో సోమిరెడ్డికి శత్రుత్వం ఏర్పడింది. 2014, 19 ఎన్నికల్లో కాకాణి చేతిలో సోమిరెడ్డి ఓటమిపాలయ్యారు. ప్రతిసారీ సర్వేపల్లి ఎన్నికల సమరం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది. గెలుపు ఓటములపై పెద్ద ఎత్తున చర్చలే కాదు..కోట్లలో పందేలు సాగుతాయంటే ఇక్కడి రాజకీయం ఎలా ఉంటుందో అర్థమవుతోంది. 

గండి కొడుతున్నదెవరు..!?

సోమిరెడ్డి నాలుగుసార్లు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి, మరోసారి కోవూరు ఉప ఎన్నికల్లో...వరస ఓటములు చవిచూశారు. గడిచిన నాలుగుసార్లు జరిగిన ఎన్నికలు పరిశీలిస్తే... 5 వేల నుంచి 14 వేల ఓట్ల తేడాతోనే సోమిరెడ్డిపై ప్రత్యర్థులు గెలుపు సాధిస్తూ వచ్చారు. ఆనం, ఆదాల, కాకాణి... వీరంతా బయటకి కనిపించే శత్రువులైతే, బయటపడని శత్రువులు లోలోపల సోమిరెడ్డి ఓట్లకి ఎవరి స్థాయిలో వారు గండి కొడుతుంటారని లోకల్‌గా టాక్‌ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో సోమిరెడ్డి సర్వేపల్లిని వదిలేసి...నెల్లూరు రూరల్ లేదా కోవూరు నుంచి పోటీచేయాలని భావిస్తున్నారట. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆయన కూతురు దీపా వెంకట్ 2014 ఎన్నికల్లో సోమిరెడ్డి కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ సమయంలో సోమిరెడ్డి ఓటమిపాలైనా.. టీడీపీ అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చింది. కీలకమైన వ్యవసాయశాఖ మంత్రిని చేసింది. ఆ సమయంలో సోమిరెడ్డి ఎవరినీ పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి.

చుట్టపు చూపుగా వస్తున్నారట..

గత ఎన్నికలకి ముందు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయన కుమారుడు జూనియర్ రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గాన్ని చుట్టేశారు. మేమున్నామంటూ అందరికీ భరోసా ఇచ్చేశారు. ఎన్నికలు ముగిసి రెండేళ్లు కావస్తున్నా సోమిరెడ్డి నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వస్తున్నారన్న అభియోగం ఉంది. నిడుగుంటపాళెంలో టీడీపీ శ్రేణులపై అధికార పార్టీ నేతలు తీవ్రస్థాయిలో వేధింపులకు పాల్పడ్డా.. సోమిరెడ్డి పట్టించుకోలేదంటారు. ఈ వ్యవరమే వారంతా బీజేపీలో చేరడానికి కారణమంటారు. నిడుగుంటపాళెంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి రేగి బీజేపీ గూటికి చేరారని చెబుతారు. రెండేళ్లుగా టీడీపీ క్యాడర్‌ను పట్టించుకోకపోవడంతో చెల్లాచెదురు అయినట్లు చెప్పుకొస్తారు.

కాకాణికి ఎదురొడ్డి పోరాడేవారే లేరా..!?

అయితే వచ్చే ఎన్నికల్లో సోమిరెడ్డి సర్వేపల్లి నుంచి పోటీ చేయకపోతే..ఆ స్థానంలో ఎవరు బరిలో ఉంటారనే చర్చ టీడీపీ వర్గాల్లో నడుస్తోంది. సోమిరెడ్డి కుమారుడు జూనియర్ రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా.. ప్రస్తుత పరిణామాల్లో వైసీపీ అభ్యర్థిని ఎదుర్కోవడం ఆయన వల్ల కాదని టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతుందట. త్వరలో తిరుపతి పార్లమెంట్‌కు ఉప ఎన్నిక జరగనున్న క్రమంలో.. పరిస్థితి ఇలాగే కొనసాగితే, వైసీపీకి మెజార్టీ వస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయట. సర్వేపల్లిలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎదురొడ్డి పోరాడేవారే లేరా అంటే...2014 ఎన్నికల సంగతులను విశ్లేషిస్తున్నారు. అప్పట్లో సోమిరెడ్డి తన అనుచరులకి ఒక్కో మండలం అప్పగించారు.

అధిష్టానం ఆలోచన ఎలా ఉందో..!?

ఎమ్మెల్యే కాకాణి సొంత మండలమైన పొదలకూరులో టీడీపీకి మైనస్ అవుతుందని అంతా భావించారు. అయితే అక్కడ పెత్తనం తీసుకున్న నేత కొన్ని నెలల పాటు గ్రౌండ్ వర్క్ చేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజల్లో నమ్మకం తెచ్చారు. దాంతో పొదలకూరులోనే టీడీపీకి ప్లస్ అయింది. అలా ఖచ్చితంగా పనిచేస్తే మిగిలిన మండలాల్లోనూ పార్టీకి మైలేజ్‌ పెంచుకోలేమా..? అన్న చర్చ జరుగుతుందట. మరి వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి పోటీ చేసేది సోమిరెడ్డి లేక కొత్త అభ్యర్థి అన్న దానిపై టీడీపీ అధిష్టానం ఆలోచన ఎలా ఉందో తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.