Advertisement

అంబేద్కర్‌ మహాభినిష్క్రమణ

Published: Wed, 14 Oct 2015 00:49:31 IST
అంబేద్కర్‌ మహాభినిష్క్రమణ

భారత చరిత్రలో అక్టోబర్‌ 14కు ఒక విశిష్టత ఉంది. 1936లో నాసిక్‌ మహాసభ జరిగిన చరిత్రాత్మకమైన రోజు అది. ‘నేను నా ప్రమేయం లేకుండా హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మాత్రం చచ్చిపోన’ని డాక్టర్‌ బీ.ఆర్‌. అంబేద్కర్‌ ఆ మహాసభలో ప్రకటించి బౌద్ధమతాన్ని సామూహికంగా స్వీకరించారు. దేశ చరిత్రలో ఈ రోజు ఎంతో విప్లవాత్మకమైనది. యుగయుగాలుగా భారత దేశ చరిత్రలో ఎంతోమంది సామాజిక సంస్కరణలకు పూనుకున్నారు కానీ, వారిలో ప్రముఖులు ఎవరూ కుల, మత చట్రం నుంచి బయటకు రాలేకపోయారు. మతం, కులం, ప్రాంతం, వర్ణం నుంచ బయటకు రాలేక వర్ణ సిద్ధాంతం ఉండాలని, వర్ణ బేధం పాటించాలని అన్నవారు ఉన్నారు. హిందూ మత విశ్వ వ్యాప్తికి పూనుకున్నవారు ఉన్నారు. కానీ కులం గురించి పట్టించుకోలేదు. తరతరాల నిచ్చెన మెట్ల ‘కుల’ వ్యవస్థకు మనువు రూపశిల్పి, ఆ రూపశిల్పి ధర్మం మనుధర్మం! ధ్వంసం చేసి పూడ్చి పాతరేసి నాసిక్‌ మహాసభలో మనుధర్మాన్ని తగులబె ట్టాడు.
 
పుట్టగానే నన్ను హిందువుగా గుర్తించిన మతమే మమ్మల్ని దేవాలయంలోకి ప్రవేశించడాన్ని నిషేధించింది. విద్యాలయాలలోనికి రానీయలేదు, వీధిలోకి వస్తే మూతికి ముంత ముడ్డికి తాటాకు కట్టుకోని రావాలి. రోజూ ఏదో ఒక సమయంలోనే బయటకు రావాలి అని నియమం విధించింది. మమ్మల్ని ఊరి అవతలకి సభ్య సమాజం నుంచి వెలివేసిన ఈ హిందూ మతంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లేవు. మనల్ని ఇంత అమానుషంగా, అవమానకరంగా కుల కట్టు బాట్లు విధించి పశువలకన్నా హీనంగా ఈ హిందూ మతం చూసింది. ఈ హిందూ మతాన్ని మనం వదిలి, మరొక మతం తీసుకోవాలని ఆయన విశ్వసించారు. మనకు సమాన హక్కులు కల్పించి, మనల్ని మనుషులుగా గుర్తించే మతాన్ని స్వీకరించాలని డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ పిలుపు ఇచ్చారు. ఈ దేశంలో నేను ఏ మతం స్వీకరించినా, నా దళితులు నన్ను అనుసరిస్తారు. కాబట్టి నేను తీసుకునే మతం ఈ దేశంలో అందరినీ సమానంగా చూసే మతమే కావాలని బాబా సాహెబ్‌ అంటుండేవారు. మరొక సందర్భంలో ఎవరు నన్ను అనుసరించి మతం మార్చుకున్నా, మార్చుకోకపోయినా నేను మాత్రం, హిందువుగా చచ్చిపోనని మతం మారుతానని ప్రకటించారు. అంబేద్కర్‌ ఎన్నో మత గ్రంథాలను అధ్యయనం చేసి, ఈ దేశంలో నా‘దళితులకు’కు ఏ మతంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఉంటుందో ఆ మతాన్ని స్వీకరిస్తానని ప్రకటించారు. ఈ దేశంలో పుట్టి పెరిగిన, ఈ దేశంలో విస్తరించిన, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన బుద్ధ భగవానుడి మతం బౌద్ధ మతం స్వీకరిస్తానని ఆయన ప్రకటించారు. ఈ ప్రపంచంలో హేతువు మీద ఆధారపడి మతం ఉందంటే అది ఒక్క బౌద్ధమతమేనని ఆయన చెప్పారు.
 
మతం మారతానని అంబేద్కర్‌ ప్రకటించిన దగ్గర నుంచి ఆయనను కలవని మత ప్రబోధకులు, రాజకీయ నాయకులు, స్వాతంత్య్ర నాయకులు లేరు. కొన్ని సంస్థలు, సంఘాలు ఆయనను కలవడానికి క్యూ కట్టాయి. దళిత జాతుల విముక్తి కొరకు డాక్టర్‌ అంబేద్కర్‌ ఒంటరిగా పోరాటం చేస్తుంటే ఏనాడూ కలవని, తలవని ఈ దేశ నాయకులు, స్వాతంత్య్ర నాయకులు, మత ప్రబోధకులు ఆయన మతం మారతానని ప్రకటించిన వెంటనే ఆయన్ని కలిసేందుకు పోటీ పడ్డారు. మత మార్పిడికి అంబేద్కర్‌ సిద్ధపడగానే మత పెద్దలు ఉలిక్కిపడ్డారు. అయితే అందరికీ ఆయన తగు సమాధానాలు ఇస్తూ వివిధ సందర్భాల్లో లేఖలు రాశారు. ఈ దేశంలో హిందూమతం మమ్మల్ని మనుషులుగా చూడటం లేదు. ఒక్కరినైనా మనిషిగా గుర్తించని మతంలో నేను ఉండను. నా అనుచరులతో, నా దళితులతో 1956 అక్టోబర్‌ 14న నాగపూర్‌లో జరిగే మహాసభలో బౌద్ధమత స్వీకారం చేస్తానని అంబేద్కర్‌ ప్రకటించారు. మతం మారడం అంటే భారత దేశంలో ఏదో ఒక్కరో-ఇద్దరో కాదు ఏకంగా ఆయనతో పాటు నాలుగు లక్షల మందికి పైగా బౌద్ధ మతంలోకి మారిపోయారు. ప్రపంచ చరిత్రలో ఒక్క వ్యక్తిపై ఆధారపడి ఇంతమంది మతం మార్చుకున్న చరిత్ర లేదు. అది అంబేద్కర్‌ వలనే జరిగింది.
నాగపూర్‌ మహాసభ సందర్భంగా నాలుగు లక్షల మంది బౌద్ధ మతాన్ని స్వీకరించినా ఆ తర్వాత అనతి కాలంలోనే మొత్తం 8 లక్షల మంది అంబేద్కర్‌ పిలుపునకు స్పందించి బౌద్ధ మతంలోకి మారారు. భారత్‌లో బౌద్ధం పునర్జీవంగా ఉందంటే అది డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ బౌద్ధం స్వీకరించడం వల్లనే. దళితుల అభ్యున్నతి కోసం, వారి జీవన పరిస్థితలు కొరకు శ్రమించి, ఎంతో పోరాటం జరిపి, వారి హక్కుల కోసం పోరాడి ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీల జీవితాలను మార్చిన మహనీయుడు అంబేద్కర్‌. రిజర్వేషన్ల విధానాన్ని రాజ్యాంగంలో రూపొందించండం ద్వారా కోట్ల మంది దళిత, బడుగు బలహీనవర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచిన మహోన్నతుడు అంబేద్కర్‌. మహా మేధావి, నవయాన బౌద్ధుడు డాక్టర్‌ అంబేద్కర్‌. బౌద్ధమతానికి కూడా పవిత్ర గ్రంథం ఉండాలని, ఎన్నో బౌద్ధ గ్రంథాలను క్షుణ్ణంగా చదవి, పరిశోధించి, ఎంతో పరిశోధనాత్మకమైన గ్రంథం బుద్ధుడు-బౌద్ధ దమ్మ రచించారు. దేశంలోని బౌద్ధ గ్రంథాలలో అత్యంత ముఖ్యమైన, ప్రామాణికమైన రచనగా అంబేద్కర్‌ మనకు అందించారు. రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనను అంబేద్కర్‌ బౌద్ధం నుంచి స్వీకరించి రాజ్యాంగంలో పొందుపరిచారు.
బుద్ధం శరణం గచ్ఛామి; సంఘం శరణం గచ్ఛామి; దమ్మం శరణం గచ్ఛామి!
-తంగిరాల సోని
(నేడు బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ బౌద్ధమతం స్వీకరించిన రోజు)

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.