ltrScrptTheme3
Advertisement

మాజీమంత్రి గాదె నేడు దేశంలో చేరిక

Apr 29 2016 @ 06:48AM

(ఆంధ్రజ్యోతి - గుంటూరు)
సీనియర్‌ రాజకీయ వేత్త గాదె వెంకటరెడ్డి శుక్రవారం టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పావులూరు గ్రామానికి చెందిన గాదె వెంకటరెడ్డి 11 సార్లు అసెంబ్లీకి పోటీ చేయగా 5 సార్లు గెలుపొందారు. ఆరుసార్లు ఓటమి చెందారు. 1967లో తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. 1967 - 72 మధ్య ప్రధాని పీవీతో పాటు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తరువాత 1972, 78, 83, 85, 89, 91, 94, 99, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా పోటీ చేశారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 1972 నుంచి 2009 వరకు వరుసగా 11 సార్లు అసెంబ్లీకి పోటీ చేసిన ఏకైక నేత గాదెవెంకటరెడ్డి. ఆయన 1967లో గెలుపొందాక 1972లో ఓటమి చెందారు. 1972 నుంచి సుమారు రెండు దశాబ్దాల పాటు ఓటమి చెందుతూ వచ్చారు.
మంత్రిగా ప్రస్థానం...
1989 ఎన్నికల్లో గాదె వెంకటరెడ్డి పర్చూరులో డాక్టర్‌ దగ్గుబాటిపై ఓడిపోయారు. దగ్గుబాటి 1991లో బాపట్ల ఎంపీగా గెలుపొందారు. దీంతో ఆయన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 1991లో జరిగిన ఉప ఎన్నికలు గాదె రాజకీయ జీవితాన్ని మలుపుతిప్పాయి. అప్పట్లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నారు. నేరుగా ఆయన జోక్యం చేసుకుని పర్చూరులో గాదె వెంకట రెడ్డిని గెలిపించాల్సిందేనని అప్పటి సీఎం జనార్ధనరెడ్డిని ఆదేశించారు. దీంతో నేదురుమల్లి ప్రతిష్టాత్మకంగా తీసుకుని గాదె వెంకటరెడ్డిని పర్చూరులో గెలిపించడానికి తీవ్రంగా కృషి చేశారు. ఆ ఎన్నికల్లో గెలుపొందిన వెంకటరెడ్డి సీఎంలు జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా కొనసాగారు. 1994లో జరిగిన ఎన్నికల్లో వెంకటరెడ్డి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రకాశం జిల్లాలో పర్చూరు మినహా అన్ని స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. పర్చూరులో మాత్రం ఎన్టీఆర్‌ ప్రభంజనాన్ని గాదె ఎదుర్కొన్నారు. తరువాత జరిగిన ఎన్నికల్లో 1999లో పర్చూరులో గాదె ఓడిపోయారు.
దగ్గుబాటి కాంగ్రెస్‌లో చేరికతో
బాపట్లకు గాదె...

రాజకీయాల్లో వచ్చిన మార్పుల్లో ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరి, అల్లుడు దగ్గుబాటిలు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో వెంకటేశ్వరరావుకు పర్చూరు కేటాయించి గాదె వెంకటరెడ్డిని బాపట్ల బరిలో ఉంచారు. సీనియర్‌ నేత వెంకటరెడ్డి 2004, 2009 ఎన్నికల్లో బాపట్ల నుంచి గెలుపొందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో బాపట్ల నుంచి రెండోసారి గెలుపొంది వైఎస్‌ క్యాబినెట్‌లో దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తరువాత వైఎస్‌ తరువాత రోశయ్య హయాంలో ఆయన అదేశాఖకు మంత్రిగా కొనసాగారు. తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత సామాజిక వర్గ సమీకరణలలో భాగంగా గాదెతో తొలగించి కాసుకృష్ణారెడ్డికి అవకాశం కల్పించారు. గాదె 2014 అసెంబ్లీ పూర్తయ్యే వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్ర విభజన తరువాత 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఆ ఎన్నికల సమయంలోనే టీడీపీలో చేరాలని భావించినా పరిస్థితులు అనుకూలించలేదు. రాష్ట్రంలో సీనియర్‌ నేతగా గుర్తింపు పొందిన గాదె వెంకటరెడ్డి తన అనుచరులతో తెలుగుదేశంలో చేరబోతున్నారు. గుంటూరులోని ఇండియన్‌ టుబాకో అసోసియేషన్‌ (ఐటిఏ) హాల్‌లో సాయంత్రం 5 గంటలకు సీఎం చంద్రబాబు సమక్షంలో గాదె వెంకటరెడ్డి ఆయన కుమారుడు, అనుచరులు టీడీపీ సభ్యత్వం స్వీకరిస్తారు. కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి డిఎల్‌ రవీంద్రారెడ్డి... గాదె వెంకటరెడ్డి వియ్యంకుడు.

Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.