Advertisement

సంజీవదేవ్‌ మెచ్చిన చిత్రకారుడు

Oct 7 2016 @ 01:48AM

‘శాంతినికేతన్‌లో నందాలాల్‌ బోస్‌ వద్ద నియో బెంగాల్‌ శైలిలో శిక్షణ పొందిన అనంతరం ఫ్రాన్సు, ఇటలీ దేశాలలో పాశ్చాత్య చిత్రకళా ధోరణులను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అందుకే ఆయన చిత్రాలలో భారతీయుల భావ పరిమళం, పాశ్చాత్యుల రూపసృష్టి సమానంగా దర్శనమిస్తుంటాయి.’

సెప్టెంబర్‌ 30న హైదరాబాదులో మరణించిన ఆర్ట్‌ డైరెక్టర్‌ జి.వి. సుబ్బారావు - ఐదు దశాబ్దాలకు పైగా సినిమా ప్రపంచానికి ఆర్ట్‌ డైరెక్టర్‌గా తన సేవలందించారు. 1950 ప్రాంతంలో శాంతినికేతన్‌లో నందాలాల్‌ బోస్‌, వినోద్‌ బెహరీ ముఖర్జీ - శిష్యరికంలో ఆర్ట్‌లో ఓనమాలు దిద్దిన సుబ్బారావుగారు తర్వాత కథల పుస్తకాలకు, నవలకు ముఖచిత్రాలందించారు.

 
1955 ప్రాంతంలో వెలువడిన జి.వి. కృష్ణరావు నవల ‘కీలుబొమ్మలు’ నవలకి ముఖచిత్రం అందించారు. అంతకుముందే మద్దులూరి రామకృష్ణ - (బాలల కథా రచయిత) నడిపిన చేతి రాత పత్రిక ‘కల్పన’కు రంగులలో చిత్రాలు వేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ సంచికకు ప్రముఖ సినిమా నటుడు జగ్గయ్య కవితలు సైతం రాశారు. ఎక్కువ కాలం సినిమారంగానికే పరిమితమవటం వలన సత్తా ఉన్నప్పటికీ, ఆర్టి్‌స్టగా ఆయన పేరు ఎక్కువ మందికి తెలియకుండా పోయింది. వంద సినిమాలకు పైగా కళా దర్శకత్వం వహించాడు. ఎక్కువ భాగం అన్నపూర్ణా జగపతి, ప్రసాద్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌కి పనిచేశారు. జయభేరి (1959), వెలుగునీడలు (1961) ఇద్దరు మిత్రులు (1961), డా. చక్రవర్తి (1964), మురళీకృష్ణ (1964) చిత్రాలు చెప్పుకోదగ్గవి. చెన్నై నుంచి 1964లో హైదరాబాద్‌కు మకాం మార్చి చివరి శ్వాస వరకు ఇక్కడే ఉన్నారు. తొలుత బంజారాహిల్స్‌లోని ఒకటవ నెంబర్‌ రోడ్డులో కళాత్మకంగా నిర్మించుకున్న ఇంటి ఆవరణలో ప్రవేశించగానే ఒక పెద్ద బండ రాయి దర్శనమిస్తుంది. అది ఆయన బెడ్‌రూమ్‌కెదురుగా ఉండి, ఉదయాన్నే కిటికీ తెరిస్తే కనిపిస్తుంది. ఉదయాన్నే ఆ రాయిని చూడటం తనకెంతో ఇష్టమని ప్రముఖ చిత్రకారుడు సంజీవదేవ్‌ ఆయన్ని సందర్శించినప్పుడు చెప్పాడు. లలిత కళా అకాడెమీ ఆహ్వానంపై సంజీవ్‌దేవ్‌ హైదరాబాద్‌ వచ్చినప్పుడు నేను ఒకసారి ఆయనతో సుబ్బారావుగారి ఇంటికి వెళ్ళటం తటస్థించింది.
 
పిల్లలకోసం రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఆంగ్లంలో రాసిన ‘క్రిసెంట్‌మూన్‌’ను ‘నెలవంక’ (గేయాలు) పేరుతో ప్రముఖ బాలసాహిత్య రచయిత కవిరావు పిల్లల్ని ఆకట్టుకొనే శైలిలో రాశారు. దీనికి సుబ్బారావుగారు వినూత్న పద్ధతిలో 2డీ ఎఫెక్ట్‌ వచ్చేలా ముచ్చటైన చిత్రాలు వేసి ఒక కొత్త ప్రయోగానికి నాంది పలికారు. ఇందులోని కవితలతో పాటు, సుబ్బారావుగారి చిత్రాలకు గొప్ప పేరు వచ్చింది. నెలవంకకు ముందు మాట రాసిన సంజీవదేవ్‌ అందులోని సుబ్బారావు చిత్రాలు, కవిరావు గేయాలు పోటీ పడ్డాయనే అభిప్రాయం వెలువరించారు. ‘‘చిత్రాలకు కవితలు ప్రతిధ్వనులా, లేక కవితలకే చిత్రాలు ప్రతిబింబాలా అన్న ప్రశ్నయే లేదు. ఎందుకంటే - రెండూ కూడా నిజమే! ఇందులోని కవితలకు చిత్రాలు ప్రతిబింబాలు, చిత్రాలకు కవితలు ప్రతిధ్వనులు.’’
 
సుబ్బారావు శైలిని గురించి రాస్తూ ‘ప్రముఖ వంగ చిత్రకారుడు నందాలాల్‌ బోస్‌ వద్ద శాంతినికేతన్‌లో నియో బెంగాల్‌ శైలిలో శిక్షణ పొందిన అనంతరం ఫ్రాన్సు, ఇటలీ దేశాలలో పాశ్చాత్య చిత్రకళా ధోరణులను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అందుకే ఆయన చిత్రాలలో భారతీయుల భావ పరిమళం, అటు పాశ్చాత్యుల రూపసృష్టి సమానంగా దర్శనమిస్తుంటాయి.’
 
‘‘రెండు ఆయతనాల (2డీ) సమతలంపై మూడు ఆయతనాల (3డీ) కళారూపం సృష్టించటం నిజమైన కళాకృతి కాక అనుకృతి మాత్రమే అవుతుంది. అలా కాక ‘నెలవంక’లో బాలల దృష్టికోణానికి అనుగుణంగా సుబ్బారావు రెండు ఆయతనాల చిత్రాలు సృష్టించడం ద్వారా నిజమైన కళాకారుడైనాడు.’’ ఇది 1950 ప్రాం తంలో వెలువడిన నెలవంకకు సంజీవదేవ్‌ రాసిన ముందుమాటలోని భావం. అప్పటికే సుబ్బారావుని గొప్ప సృజనాత్మక చిత్రకారునిగా సంజీవదేవ్‌ గుర్తించి ప్రశంసల వర్షం కురిపించారు. 1954లో ప్రభుత్వం ఇచ్చిన ఫెలోషి్‌పతో రోమ్‌ వెళ్ళి రెండేళ్ళ పాటు అడ్వాన్స్‌డ్‌ డిప్లోమా కోర్స్‌ అభ్యసించి తనలోని చిత్రకారునికి పదును పెట్టాడు. అప్పుడక్కడ ప్యారి్‌సలో ఉంటున్న తెలుగు చిత్రకారుడు క్రిష్ణారెడ్డి, అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచిన ‘రజా’తో సాన్నిహిత్యాన్ని నెలకొల్పుకున్నారు.
 
నార్లవారి రచన ‘కొత్తగడ్డ’ (నాటికలో)కు సైతం మరో వర్ధమాన చిత్రకారుడు తేజోమూర్తుల కేశవరావుతో కల్సి అందులోని ప్రతి నాటికకు చివర ఒక చిత్రం వేసి ఆ పుస్తకానికి ఒక ప్రత్యేక శోభ తెచ్చారు. శాంతి నికేతన్‌లో చిత్రకళాభ్యాసం ముగిశాక, చెన్నై చేరుకొని - ‘వాల్టర్‌ థామ్సన్‌’ - అనే అడ్వర్టైజింగ్‌ కంపెనీకి (ఇప్పుడు దీనిని హిందూస్థాన్‌ థామ్సన్‌ అడ్వర్టయిజింగ్‌గా వ్యవహరిస్తున్నారు) కొన్నాళ్ళు పనిచేసి ఆ తర్వాత ప్రఖ్యాత నృత్యకారిణి, రుక్మిణీ దేవి అరండెల్‌ స్థాపించిన కళాక్షేత్రంలో ఆర్ట్‌ టీచర్‌గా పనిచేసి సినిమా రంగంలో ప్రవేశించారు.
 
ఇంటీరియర్‌ డిజైన్‌ అనే మాట వాడుకలో లేని రోజుల్లోనే ప్రముఖ సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు హౌసింగ్‌ బోర్డు ఇంటిని అతిసుందరంగా తీర్చిదిద్దిన ఘనత సుబ్బారావుది. నార్లవారు సుబ్బారావు గారి పెయింటింగ్‌లను సేకరించటం చెప్పుకోదగ్గది. ఈయన కొన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్‌ లలితకళా అకాడెమీకి చిత్రాల ఎంపిక చేసే కమిటీలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.
 
1945 ప్రాంతంలో సంజీవదేవ్‌ ప్రేరణతో శాంతినికేతన్‌లో సీటు సంపాదించిన సుబ్బారావుగారు నందాలాల్‌ బోస్‌, వినోద్‌ బీహారి ముఖర్జీ, రాంకింకర్‌ బైజ్‌ లాంటి ఉత్తమ శ్రేణి అధ్యాపకుల నేతృత్వంలో చిత్రకళలోని మెళకువలు ఆకళింపు చేసుకొన్నారు. అప్పుడు శాంతినికేతన్‌లో ప్రఖ్యాత కళా విమర్శకుడు జగదీశ్‌ మిట్టల్‌, విఖ్యాత చిత్రకారుడు కె.జి. సుబ్రమణియన్‌లు చిత్రకళ అభ్యసిస్తున్నారు. సుబ్బారావుగారు 1924లో తెనాలి సమీప గ్రామం జంపనిలో జన్మించారు. తండ్రి సూర్యనారాయణ, తల్లి బాయమ్మ.
 వెనిగళ్ళ వెంకటరత్నం

Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.