Advertisement

మిషన్‌ మూసీకి ముందడుగు..!

Published: Fri, 28 Jul 2017 09:04:30 IST
మిషన్‌ మూసీకి ముందడుగు..!

 • రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌తో ‘సబర్మతి’ కల ఫలించేనా..
 • దశాబ్దాలుగా ప్రతిపాదనల్లోనే..
 • ఎప్పటికప్పుడు మారుతున్న ప్రతిపాదనలు తారుమారవుతున్న అంచనాలు
 • ఒకేసారి మూడు వేల కోట్లు సాధ్యమేనా..!
హైదరాబాద్‌: మూసీ.. ఈసీ.. రంగారెడ్డి జిల్లాలో రెండు నదులుగా మొదలై హైదరాబాద్‌ బాపుఘాట్‌ వద్ద ఏకమై మహానగరంలో పారే మూసీనది ఒకప్పుడు స్వచ్ఛమైన తాగునీటిని అందించేది. అలాంటి నదీ నేడు మురికి కూపంగా మారి మనుషులు ఆ నీటికి తాకడానికే కాదు.. చుట్టు పక్కలకు వెళ్లడానికి ముక్కు లు మూసుకొని వెళ్లాల్సిన దుస్థితి. గృహ, పారిశ్రామిక వ్యర్థా ల చేరికతో జీవనది కాస్త కాలుష్య కాసారంగా మారింది. మూసీకి పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా ఎప్పటి నుంచో ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రతిపాదనలు, ప్రణాళికల రూపకల్పన జరిగినా కాలం గడుస్తోంది తప్ప మూసీనదిలో మార్పు మాత్రం రాలేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నట్లు మహానగరంలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్‌బోర్డులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మూసీ సుం దరీకరణ ప్రాజెక్టు ముందుకెళ్లదని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ‘మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కా ర్పొరేషన్‌’ను ఏర్పాటు చేసింది. మహానగరానికి ఉత్తరాన ఉన్న ఔటర్‌ రింగురోడ్డు నుంచి తూర్పున ఉన్న ఓఆర్‌ఆర్‌ వరకు ఒకే ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకో సం సుమారు రూ.3వేల కోట్లు ఖర్చు అవుతాయని ఓ ప్రైవే ట్‌ కన్సల్‌టెన్సీ సంస్థ నివేదిక రూపొందించింది. 3 నెలల క్రి తం మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ను ఏ ర్పాటు చేస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం, దానికి అధికారులను నియమించి కార్యాలయాన్ని ఏర్పాటు చే యాల్సి ఉంది.
 
జంట జలాశయాల నుంచి మొదలై..
నిజాం నవాబుల కాలంలో నగరానికి మంచినీటిని అం దించేందుకు ఈసీనదిపై ఉస్మాన్‌సాగర్‌(గండిపేట)ను, హి మాయత్‌సాగర్‌ను నిర్మించారు. ఆ రెండు రిజర్వాయల్లోని నీరే నగర వాసుల దాహార్తిని తీర్చేది. క్రమేణా నగరం విస్తరిస్తున్న కొలది వర్షాభావ పరిస్థితులతో నదుల్లోకి వరద నీరు తగ్గిపోగా, రెండు జలాశయాల తర్వాత ఉన్న మూసీ నదిలో మాత్రం నగరం నుంచి వెలువడుతున్న మురుగునీ రు జీవనదిలా పారుతూనే ఉంది. అలాంటి మూసీనదిని గుజరాత్‌ రాష్ట్రంలోని సబర్మతీనది తరహాలో సుందరీకరించి, నగరంలో పర్యాటక కేంద్రంగా మా ర్చేందుకు కొత్తగా ఏర్పాటైన మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ల వద్ద ఉన్న ఔటర్‌ రింగురోడ్డు నుంచి మొదలు కొని బాపుఘాట్‌, పురానాపూల్‌, చాదర్‌ఘాట్‌, గోల్నాక, నాగోల్‌, ఉప్పల్‌ మీదుగా మహానగర సరిహద్దు గౌరె ల్లి వరకు మూసీ సుందరీకరణకు సమగ్ర నివేదిక సిద్ధమైం ది. ఓ ప్రైవేట్‌ కన్సల్టెన్సీ సహకారంతో హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) డీపీఆర్‌ను తయారు చేసింది. ప్రస్తుత మూసీ పరిస్థితిని వివరిస్తూ.. ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది నివేదికలో పొందుపర్చారు.
 
లక్ష్యాలు..
 • పర్యావరణం, మూసీ పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ అవగాహన కల్పించేలా కార్యక్రమాలు.
 • తీర ప్రాంతం రిక్రియేషన్‌, సాంస్కృతిక, సామాజిక కేంద్రాల, పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి.
 • నదీకి ఇరువైపులా ఉద్యానవనాల ఏర్పాటు.
 • గుర్తించిన ప్రాంతాల్లో నిర్ణీత స్థాయిలో నీటి మట్టం ఉండేలా డ్యామ్‌లతో కొలనులు.
 • కాలుష్య నియంత్రణకు హానీకర వ్యర్థాల మళ్లింపు. నదిశుద్ధికి చర్యలు
 • నాచు మొక్కలు, గడ్డి, వ్యర్థాలు, అడుగున చేరిన మట్టి, చెత్తాచెదారం, ఆర్గానిక్‌, ఇన్‌ ఆర్గానిక్‌ వ్యర్థాల తొలగింపు.
 • మూసీ, ఈసీకి ఇరువైపులా ఉన్న 20నాలాల నుంచి వ్యర్థాలను ఒకే చోట శుద్ధి చేసేలా సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాం ట్‌ (ఎస్‌టీపీ) నిర్మాణం.
 • నాలాలపై 10 ప్రాంతాల్లో ఇంటర్‌సెప్షన్‌ అండ్‌ డైవర్షన్‌ల ఏర్పాటు.
 • హైదర్షాకోట వద్ద ఎంబీబీఆర్‌ సాంకేతిక పరిజ్ఞానంతో 30 మిలియన్‌ లీటర్స్‌ పర్‌ డే(ఎంఎల్‌డీ) ఎస్‌టీపీ నిర్మాణం. శుద్ధి చేసిన వ్యర్థాలను మూసీలోకి వదులుతారు.
 • నీటి కాలుష్యాన్ని అరికట్టేందుకు ఫైటో రెమిడేయేషన్‌ చేయాలి. ప్రతి నెలకోసారి నీటి నాణ్యత పరీక్షల నిర్వహణ.
తీర ప్రాంత అభివృద్ధి..
 • నదికి ఇరువైపులా తారామతి బారాదరి పేరిట 7కిలోమీటర్ల మేర వాక్‌ వే నిర్మాణం
 • కిస్మత్‌పురా వద్ద ఈసీ నదికి ఇరువైపులా 10కిలోమీటర్ల మేర కిస్మత్‌పురా ఈసీ వాక్‌ నిర్మాణం.
 • ఈ రెండు ప్రాంతాల్లో 13మీటర్ల విస్తీర్ణంలో సైకిల్‌, జాగింగ్‌ ట్రాక్‌ల నిర్మాణం గ్రీన్‌స్పేస్‌, పౌరులకు అవసరమైన వసతుల కల్పన.
 • డ్యామ్స్‌తో నీటి కొలనులు తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం నిర్ణీత ప్రాంతాల్లో ఎగువన 1.75మీటర్ల ఎత్తుతో.. దిగువన 3.25 మీటర్ల ఎత్తులో డ్యామ్‌లను ఏర్పాటు చేయనున్నారు.
 • మూసీకి ఇరువైపులా ఉన్న రహదారులను కలుపుతూ అనుసంధాన వంతెనల నిర్మాణం. కేవలం పాదచారుల కోసం పలు ప్రాంతాల్లో స్టీల్‌ బ్రిడ్జీలు.
 • ఇబ్రహీంబాగ్‌ కాజ్‌వేను రెండులేన్ల ఆర్‌సీసీ రోడ్‌ బ్రిడ్జిగా పునర్నిర్మాణం.
 • గండిపేట వద్ద నాలెడ్జ్‌ పార్క్‌, ఏకో టూరిజం, క్రీడలు, రిక్రియేషన్‌ సౌకర్యాలు
 • మూసీ ఉత్తర తీరంలోని నాగోల్‌ బ్రిడ్జి నుంచి ఫిర్జాదిగూడ వరకు 5కిలోమీటర్ల మేర వంతెన.
 • ప్రతాప్ సింగారం నుంచి గౌరెల్లి వరకు 2.6కిలోమీటర్ల మేర మూసీ నదిపై అనుసంధాన వంతెన నిర్మాణం.
 • రబ్బర్‌ డ్యామ్‌లతో ఏర్పాటుచేసే ఫిర్జాదీగూడ గ్రామ సమీపంలో కొలను, ప్రతా్‌పసింగారంలోని రెండు కొలనుల చుట్టూ ఉద్యానవనాల అభివృద్ధి.
 
రూ.3వేల కోట్లు సేకరించేదేలా?
మూసీ సుందరీకరణకు ఒకేసారి రూ.3వేల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని ప్రైవేటు కన్సల్‌టెన్సీ నివేదిక ఇచ్చింది. దానికి అనుగుణంగా ఆ స్థాయిలో నిధులను సమకూర్చుకోవడమే ఇప్పుడు అతి పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం మూసీ సుందరీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రత్యేకంగా జీవో జారీ చేసి, చైర్మన్‌ను ని యమించినా ఇంకా క్షేత్ర స్థాయిలో మాత్రం ఎలాంటి ముం దడుగు లేదు. కార్పొరేషన్‌కు పూర్తి స్థాయిలో అధికారుల నియామకం జరగలేదు. అదేవిధంగా ఇందుకోసం ప్రత్యేకంగా కార్యాలయం సైతం ఏర్పాటు కాలేదు. ఎప్పటి నుంచో గుజరాత్‌లోని సబర్మతి నదిలా తీర్చిదిద్దుతామని మాటల్లో చెబుతూ వచ్చిన ప్రభుత్వం.. మంత్రితో పాటు అధికారుల బృందం మాత్రం గత నెలలో గుజరాత్‌ లోని అహ్మద్‌నగర్‌కు వెళ్లి అక్కడి సబర్మతీ నదిని ప్రత్యేకంగా పరిశీలించి వచ్చారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.