Advertisement

అభివృద్ధి చేస్తే ‘పేట’కు పర్యాటక శోభ

Nov 25 2017 @ 02:28AM

  • కట్టిపడేసే కాకతీయుల శిల్ప కళా వైభవం
  • రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర దురాజ్‌పల్లి
  • ప్రకృతి రమణీయతతో ఉండ్రుగొండ గుట్టలు
సూర్యపేట, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి చేస్తే సూర్యాపేట జిల్లా పర్యాటక కేంద్రంగా మారుతుంది. అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాలపై అధికారులు ప్రాజెక్టు రిపోర్టులు సిద్ధం చేసి మంత్రి జగదీశ్‌రెడ్డికి సమర్పించేందుకు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రంలో ప్రకృతి రమణీయతతో ఎన్నో గుట్టలున్నాయి. చారిత్రాత్మక వారసత్వ సంపద ఉంది. సూర్యాపేట జిల్లాలో నాగారం మండలం ఫణిగిరి గుట్టపై పర్యాటకుల కోసం ఓ గెస్ట్‌హౌస్‌, చివ్వెంల మండలం ఉండ్రుగొండలో ట్రెక్కింగ్‌, రోప్‌వే, ఓ రిసార్ట్‌లను నిర్మించేందుకు ప్రాజెక్టు వర్క్‌ పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పిల్లలమర్రి దేవాలయం, పెన్‌పహాడ్‌ మండలం నాగులపహాడ్‌ దేవాలయాల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నారు.
 
నాగారం మండలంలోని ఫణిగిరి గుట్టపై బౌద్ధ క్షేత్రం, అర్వపల్లిలో లక్ష్మీనర్సింహ్మాస్వామి దేవాలయం, ఖాజా నసీరొద్దీన్‌ దర్గా, సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామంలోని శివాలయాలు, చివ్వెంల మండలం ఉండ్రుగొండ గుట్టలు, దురాజ్‌పల్లి సమీపంలోని లింగమంతుల స్వామి గుడి, పాలేరు రిజర్వాయర్‌ను టూరిజం కేంద్రంగా తీర్చి దిద్దుతామని పాలకులు హామీ ఇచ్చారు. ఈ పర్యాటక ప్రాంతాలు సూర్యాపేట పట్టణం నలు దిక్కులా విస్తరించాయి.
 
సూర్యాపేట నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఫణిగిరి, 28 కిలోమీటర్ల దూరంలో అర్వపల్లి శ్రీయోగానంద లక్ష్మీనర్సింహ్మాస్వామి దేవాలయం, నసీరోద్దీన్‌ బాబా దర్గా, 4 కిలోమీటర్ల దూరంలో పిల్లలమర్రి శివాలయాలు, 7 కిలోమీటర్ల దూరంలో ఉండ్రుగొండ గుట్టలు, 30 కిలోమీటర్ల దూరంలో పాలేరు రిజర్వాయర్‌ ఉన్నాయి. పర్యాటక సంస్థ ఓ బస్సు ఏర్పాటు చేసి వీటన్నింటినీ చూపించాలని స్థానికులు కోరుతున్నారు. ఇక.. తెలంగాణలో బౌద్ధుల చరిత్ర గురించి ఫణిగిరి బౌద్ధ క్షేత్రం తెలియజేస్తుంది. ఈ క్షేత్రం 2000 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. ఇక్కడి బుద్ధ విగ్రహానికి రూ.85 లక్షల బీమా కూడా చేశారు. మిగిలిన విగ్రహాలను ఫణిగిరి గ్రామంలోని ఓ ఇంట్లో భద్రపరిచారు.
 
ప్రకృతి రమణీయతతో ఉండ్రుగొండలు
సూర్యాపేట పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉండ్రుగొండ అభివృద్ధికి నోచుకోలేదు. ఎతైన కొండలు, విస్తారంగా వ్యాపించి ఉన్న చెట్లు, బలిష్ఠమైన దుర్గ ప్రాకారాలు ఉండ్రుగొండ గుట్టలపై ఉన్నాయి. ఉండ్రుగొండ కోట విస్తీర్ణం 11 కిలోమీటర్లు, ఎత్తు 900 మీటర్లుగా అంచనా వేశారు. ఉండ్రుగొండ గిరిదుర్గంలో 20 వరకు దర్శనీయ స్థలాలు ఉన్నాయి. 1372 ఎకరాల్లో విస్తరించిన గిరిదుర్గాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటక కేంద్రంగా మారుతుంది. ఈ కోటపై ఈత కొలనులు కాకుండా మంత్రిగారి బావి, చాకలి బావి, రాజా దర్బార్‌, కొలిమి చావిడి ఉన్నాయి.
 
ఉండ్రుగొండపై అతిపురాతన లక్ష్మినర్సింహాస్వామి ఆలయం ఉంది. మండలం దురాజ్‌పల్లి సమీపంలోని లింగమంతుల స్వామి తెలంగాణలోనే రెండో అతి పెద్ద జాతర. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు 7-10 లక్షల మంది భక్తులు వస్తారు. మేళ్లచెర్వు మండలంలోని శివాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివ లింగం 11వ శతాబ్దంలో ఉద్బవించింది. ఈ శివలింగం పుష్కారానికి ఒక అంగుళం చొప్పున పెరుగుతుంది. ఈ లింగం కింద నుంచి నీరు ఎంత తీసినా ఊరుతూనే ఉంటుంది.

Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.