Advertisement

శలాక పురుషుడు పింగళి

Published: Thu, 10 Jan 2019 00:14:53 IST
శలాక పురుషుడు పింగళి

పాండిత్య గరిమ, గ్రంథ రచనా వైశిష్ట్యం, పాఠ ప్రవచనా కౌశలం, పరిశోధనా పటిమ–ఆచార్య పుంగవులకు అవసరమైన ఈ నాలుగు లక్షణాలు పింగళి లక్ష్మీకాంతంలో పుష్కలంగా లభిస్తాయి. లక్ష్మీ కాంతం గారి చదువులోతు, గద్ద చూపు, మాట పొందిక, బాస బిగువు, తెలుగు సాహిత్య విమర్శలో ఆయన్నొక శలాక పురుషునిగా తీర్చిదిద్దాయి.
 
 
పింగళి లక్ష్మీకాంతం, ఖండవల్లి లక్ష్మీరంజనం, భూపతి లక్ష్మీనారాయణరావు– ఈ ముగ్గురు మహావిద్వాంసులు ఆంధ్ర, ఉస్మానియా, మద్రాసు విశ్వవిద్యాలయాల్లో తెలుగు స్నాతకోత్తర పీఠాలకు పేరు ప్రతిష్ఠలు సంతరించిపెట్టిన ఆచార్య వర్యులు. తొలితరం తెలుగు ఆచార్యులైన ఈ ముగ్గురూ ముగ్గురే. ఈ ఆచార్య త్రయంలో పింగళి లక్ష్మీకాంతం స్థానమానాలు అద్వితీయం, అపూర్వం. తెలుగు బి.ఏ ఆనర్సు తరగతులకు ఆంధ్ర విశ్వకళాపరిషత్తులో పటిష్ఠమైన పాఠ్య ప్రణాళికను రూపొందించిన ఘనత లక్ష్మీకాంతం గారిదే. అంతేకాక, యం.ఏ. ఆనర్సు (యం.లిట్‌., యం.ఫిల్‌) పరిశోధనకు పర్యవేక్షక బాధ్యత వహించి సాధికారిక పరిశోధన జరిపించిన కీర్తి కూడా పింగళివారిదే.
 
పింగళి లక్ష్మీకాంతం 1931 నుండి 1949 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో లెక్చరర్‌, రీడర్‌గా పని చేశారే గానీ ఆచార్య స్థాయిని అందుకోలేకపొయ్యారు. 1961–65 మధ్య కాలంలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలోనే ఆచార్య పీఠం అలంకరించగలిగారు. ఇప్పుడు విశ్వవిద్యాలయం తెలుగు శాఖల్లో కొన్ని చోట్ల ఎనిమిదిమంది దాకా ఆచార్యులు– చిల్లర దేవుళ్ళు– వెలుగుతున్నారు. పాండిత్య గరిమ, గ్రంథ రచనా వైశిష్ట్యం, పాఠ ప్రవచనా కౌశలం, పరిశోధనా పటిమ– ఆచార్య పుంగవులకు అవసరమైన ఈ నాలుగు లక్షణాలు పింగళి లక్ష్మీకాంతంలో పుష్కలంగా లభిస్తాయి.
 
పింగళివారు ప్రాచీన తెలుగు కావ్య నాటకాల్ని తలస్పర్శిగా అధ్యయనం చేసిన ఆచార్యులు. అంతేకాదు వాటిని విద్యార్థుల మనస్సులకు హత్తుకుపొయ్యేలా పాఠం చెప్పిన ఘనాపాఠి. ఆయన పాఠ ప్రవచనాలు శ్రద్ధగా విని, మున్ముందు ఉత్తమ అధ్యాపకులుగా, ఆచార్యులుగా రూపొందిన వాళ్లలో కొందరు ప్రముఖులు–– దివాకర్ల వేంకటావధాని, పాటిబండ మాధవ శర్మ, కె.వి.ఆర్‌. నరసింహం, పోణంగి శ్రీరామ అప్పారావు, కొత్తపల్లి వీరభద్రరావు, దిగుమర్తి సీతారామ స్వామి మొదలైనవారు. కవిగా, ఆంధ్ర వాగ్గేయకార చరిత్రకారులుగా పేరుమోసిన బాలాంత్రపు రజనీకాంత రావు; కవి, సాహిత్యమర్మజ్ఞులు, ఎందరో శిష్యుల జీవితాల్ని మలచిన డా. నండూరి రామకృష్ణమాచార్యులు పింగళివారు పెంచి, పోషించిన విద్యార్థి కల్పతరువులే.
 
పింగళి లక్ష్మీకాంతం తెలుగు సాహిత్య రచనకు సుభద్రమైన పునాది వేసిన ప్రతిభా సంపన్నులు. ఆయన రాసిన ‘ఆంధ్ర సాహిత్య చరిత్ర’ ఆయన మరణానంతరమే (1974) వెలువడ్డా నలభయ్యేళ్ల పాటు లిఖిత రూపంలో సాహిత్య విద్యార్థులకు దారిదీపమై వెలుగొందింది. పింగళివారు ఆంధ్ర విశ్వ కళాపరిషత్తులో ఉపన్యాసకులుగా చేరినప్పుడు తెలుగు సాహిత్య చరిత్రకు పటిష్ఠమైన రూపం ఏర్పడి వుండలేదు. గురజాడ శ్రీరామమూర్తి ‘కవిజీవితములు’, కందుకూరివారి ‘ఆంధ్ర కవుల చరిత్ర’ మూడు భాగాలు, వంగూరి సుబ్బారావుగారి ‘ఆంధ్ర వాఙ్మయ చరిత్ర’ (1920), కవిత్వవేది కల్లూరు వెంకటనారాయణరావుగారి ‘ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము’ (1926), బసవరాజు అప్పారావుగారి ‘ఆంధ్ర కవిత్వ చరిత్రము’ (1921) మొదలైన గ్రంథాలు వెలువడ్డాయి. కాని తెలుగు సాహిత్య యుగవిభజన, యుగలక్షణాలు, కృతుల సమాలోచనం, వగైరా విషయాల్ని పరిశీలించి ప్రకృష్టమైన శైలిలో గ్రంథ నిర్మాణం చేసే సామర్థ్యం ప్రదర్శించిన సాహిత్యవేత్త పింగళి లక్ష్మీకాంతంగారే. మునుపటి తెలుగు సాహిత్య చరిత్రకారులు పై విషయాలన్నింటినీ స్థూలంగా పరిశీలించారే కాని లోతుకు దిగలేదు. కాని పింగళివారు మాత్రం ‘ఆంధ్ర సాహిత్య చరిత్ర’ రచనలో తెలుగు కావ్య నాటకాదుల్ని అడుగంట తరచి చూసి, చక్కని, చిక్కని శైలిలో తమ ప్రతిభను ప్రదర్శించారు.
 
పింగళి లక్ష్మీకాంతం తెలుగు సాహిత్య చరిత్రను 10 యుగాలుగా విభజించారు. కొంతమంది విద్వాంసులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినా, ఆయన చూపిన దారినే అనుసరిస్తున్నారు. వెనుకటి ఆంధ్ర సాహిత్య చరిత్రకారులు కవుల కాల, జన్మ, వంశ ప్రస్తావన చేసి, వాళ్ళ రచనల సంక్షిప్త పరిచయం మాత్రమే చేశారు. కాని పింగళివారు కవి దేశకాల వంశ పరిచయంతోపాటు వాళ్ల కావ్య వైశిష్ట్యాన్ని లోతుగా పరిశీలించి సమీక్షించడం గమనార్హం.
 
పింగళి లక్ష్మీకాంతం గారిది డేగ చూపు. ఆయన కావ్య నాటకాది రచనల్ని లోతుగా అధ్యయనం చేసి, వాటి సారాన్ని, లక్ష్యాన్ని వొడిసిపట్టి ఆ రచనలు ప్రచారం పొందటానికి, వ్యాప్తిలోకి రాకపోవటానికి కారణాల్ని సూటిగా చెప్తారు. నన్నెచోడుని, పాలకురికి సోమనాథుని కావ్యాలు బహుళ ప్రజాదరణ పొందకపోవడానికి కారణం పింగళివారు ఇలా చెప్తారు: ‘‘పాల్కురికి సోమనాథుడు నన్నెచోడుని వలెనే ఎక్కువగా మాండలిక దేశిపదములనే వాడెను. కాని ఆతని గ్రంథములు భారతము వలె సాహిత్యపరులందరకు సంసేవ్యములు కాలేదు. దానికి కారణము సోమనాథుడు కావ్యములనుపేర మత గ్రంథములు వ్రాయుట’’.
 
పింగళివారు సందర్భానుసారముగా ఇద్దరు కవుల కావ్యరీతుల్ని తులనాత్మకంగా పరిశీలించిన వైనం మహత్తరమైనది. పెద్దన, శ్రీకృష్ణదేవరాయల ‘మనుచరిత్ర’, ‘ఆముక్తమాల్యద’ల తౌలనిక వైఖరికి మచ్చుతునక. ‘‘మనుచరిత్ర పద్యములు శ్రావ్యతకు, బ్రసన్నతకు, నంక్లిష్టాన్వయమునకు, బ్రౌఢములయ్యు గాఢములు గాని సమాసములకు బ్రసిద్ధి చెందిన గ్రంథము. మాధుర్య సంపాదనము పెద్దనగారి సొమ్ము. వర్ణనలకు సందర్భౌచితి గాపాడుట యాయన రీతి. అప్రసిద్ధమలను వాడకుండుటాయన దీక్ష. ఆముక్తమాల్యద పద్యములకు శ్రావ్యత లేదు. ప్రసన్నత మృగ్యము. వర్ణనలతిదీర్ఘములు. సందర్భౌచితిని గోల్పోయినవి. సమాసములకు గాఠిన్యమెక్కువ. అయ్యును రాయలకు బ్రకృతి పరిశీలనాదుల యందు బెద్దనగారిని మించిన భావనాపటిమ గలదు. పెద్దన చూపుకంటె రాయల చూపు అతి నిశితమైనది. స్థూలాకారదర్శన వర్ణనలతో బెద్దన తృప్తిని బొంద, రాయలాంతర స్నాయువుల గుండ దర్శించిగాని తృప్తి బొందడు. ఆయన రూపచిత్రణములు చిత్రకారులకు గూడ నసాధ్యములు. లోకజ్ఞత యందును బెద్దన రాయలకు జాలడు’’. ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారి చదువులోతు, గద్ద చూపు, మాట పొందిక, బాస బిగువు, తెలుగు సాహిత్య విమర్శలో ఆయన్నొక శలాక పురుషునిగా తీర్చిదిద్దాయి.
 ఘట్టమరాజు
(నేడు పింగళి లక్ష్మీకాంతం 125వ జయంతి)

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.