Advertisement

మహిళావరణంలో మణిదీపం

Jan 23 2019 @ 04:26AM

బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో ప్రజాసేవకు అంకితమైన మహోన్నత మహిళ ఈశ్వరీబాయి. మానవతా విలువలు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, సమానత్వ సాధనకు అహర్నిశలు పోరాడిన ఈ ఉదాత్త నాయకురాలు తెలుగుతనానికి నిలువెత్తు నిదర్శనం.
 
భారత దేశ స్వాతంత్ర్యానంతర చరిత్రలో, తెలుగు మహిళావరణంలో మకుఠంలేని మహారాణి జె. ఈశ్వరీబాయి. ఆమె తెలుగువారి ముద్దుబిడ్డ, చట్టసభల్లో చిచ్చరపిడుగు. సంఘసేవా పరాయణురాలు దళిత పీడిత జనుల పెన్నిధి.
బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అడుగుజాడలలో నడిచిన ధీరవనిత. ఉత్తమ శాసన సభ్యురాలు. నిర్మల హృదయం ఆమెది. లంచగొండి అధికారులకు సింహస్వప్నం. ప్రజాసేవ ఆమె ధ్యేయం, పరమార్థం. రాజకీయాలలో నైతిక విలువల కోసం ఉద్యమించిన ఉదాత్తురాలు. దేశభక్తి, ప్రజాసేవ, మహిళాభ్యుదయం ఆమె దృక్పథం. నిరాడంబరురాలు, నిస్వార్థ సంఘసేవిక. ఈశ్వరీబాయి పోరాట పటిమ చరిత్రలో అద్వితీయం, అనితరసాధ్యం.
 
ఈశ్వరీబాయి డిసెంబర్‌ 1, 1918లో సికింద్రాబాద్‌లోని చిలుకలగూడలో ఒక సామాన్య దళిత కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు రాములమ్మ, బల్లెపు బలరామస్వామిలు. తండ్రి నాటి నిజాం రాష్ట్ర రైల్వే ఉద్యోగి.
 
ఈశ్వరీబాయి సికింద్రాబాద్‌లోని ఎస్‌.పి.జి. మిషన్‌ పాఠశాలలో ప్రాథమిక విద్యను కీస్‌ హైస్కూల్‌లో ఉన్నత విద్యను పూర్తిచేసింది. ఆమెకు తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్‌, మరాఠి భాషలలో ప్రవేశం, ప్రావీణ్యత కలదు.
 
స్వశక్తిపై జీవించాల్సిన అవసరం వచ్చినప్పుడు సికింద్రాబాద్‌లోని ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఆమె పని చేశారు. మహారాష్ట్ర పూణేలోని ఒక సంపన్న కుటుంబానికి చెందిన డా. జెట్టి లక్ష్మీనారాయణతో ఈశ్వరీబాయి పెండ్లి జరిగినది. ఈ దంపతుల సంతానమే నేటి కాంగ్రెస్‌ నాయకురాలు డా. జె. గీతారెడ్డి.
 
ఈశ్వరీబాయికి ప్రజాసేవ పట్ల అంకిత భావం కలగటానికి కారణం డా.అంబేడ్కర్‌ స్ఫూర్తి. ఆయన సిద్ధాంతాలు త్యాగపూరిత చరిత్ర ఆమెపై మిక్కిలి ప్రభావం చూపాయి. 1942లో నాగపూర్‌లో జరిగిన అఖిలభారత ఎస్‌.సి. కులాల సభకు నిజాం రాష్ట్రప్రతినిధిగా హాజరై ఆ మహనీయుని దర్శించుకోవడం, అదే సదస్సులో అఖిలభారత ఎస్‌.సి. ఫెడరేషన్‌ అనే రాజకీయ సంస్థను స్థాపించడం జరిగింది. అందులో ఆమె క్రియాశీల పాత్ర పోషించారు. అనంతరం డా. అంబేడ్కర్‌ వైస్రాయి కౌన్సిల్‌ మెంబర్‌గా హైదరాబాద్‌కు రావడం, విక్టరీ ప్లేగ్రౌండ్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగం విన్న ఈశ్వరీబాయి ఉద్యమాల బాట పట్టినది. అంతేకాక ఆ రోజుల్లో బి.ఎస్‌. వెంకట్రావు, జె.హెచ్‌. సుబ్బయ్య, అరిగె రామస్వామి, తదితరులు దళిత జనుల కోసం చేసే పోరాటాల ప్రభావం కూడా ఆమెపై ప్రముఖంగా ఉంది. 1948 సెప్టెంబర్‌లో పోలీస్‌ చర్య అనంతరం, హైదరాబాద్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైంది. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. దీనితో హక్కుల పోరాటాలు ప్రారంభమైనవి.
 
1942 జూన్‌లో అఖిలభారత షెడ్యూలు కులాల సమాఖ్య ఏర్పడినది. 1946లో సమాఖ్య శాఖలు అన్ని రాష్ట్రాలలో నెలకొల్పబడినవి. 1957 ఎన్నికలకు ముందు, సమాఖ్య స్థానంలో రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా ఏర్పడినది. 1957 సాధారణ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థులకు విజయం దక్కలేదు. వెంటనే ఆ పార్టీ మూడు వర్గాలుగా చీలిపోయినది. ఇందులో ఈశ్వరీబాయి ఈ మూడింటిలో కవాడే వర్గానికి మద్దతునిచ్చి అంటరాని వర్గాలపై అగ్రకులాల వారి దౌర్జన్యాలు, అక్రమాలకు వ్యతిరేకంగా రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఉద్యమం సాగించింది.
 
1951లో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలలో మొదటిసారిగా పురపాలక సంఘ ఎన్నికలు జరిగినవి. ఈశ్వరీబాయి చిలకలగూడ వార్డు (సీతాఫల్‌మండి) నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. కాంగ్రెస్‌ అభ్యర్థి నుంచి ఆమెకు బలమైన పోటీ ఎదురైంది. ఆమెకు అంగబలం, అర్థబలం, పార్టీబలం కూడ లేదు. ఆమె సోదరుడు కిషన్‌ సాయం చేశాడు. అహోరాత్రులు ఆమె గెలుపు కోసం ప్రచారం చేసాడు. ధైర్యంతో, కృషితో ఆమె విజయాన్ని సాధించింది. నాడు మాడపాటి హనుమంతరావు మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనాడు. పురపాలక సంఘ సభ్యురాలుగా ఈశ్వరీబాయి నగర పురోభివృద్ధికి ఎనలేని కృషి చేసింది.
 
1957లో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల షెడ్యూల్డు కులాల సమాఖ్యలు ఏకమై ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూలు కులాల సమాఖ్యకు బి. జగన్నాథం అధ్యక్షుడిగా, జె. ఈశ్వరీబాయి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనారు. 1960లో ఏర్పడిన రిపబ్లికన్‌ పార్టి ఆఫ్‌ ఇండియాకు బి. లక్ష్మీనారాయణ అధ్యక్షులుగా జె. ఈశ్వరీబాయి ప్రధాన కార్యదర్శిగా మహోన్నత సేవలు అందించారు.
 
1967లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈశ్వరీబాయి నిజామాబాద్‌ జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజక వర్గం నుంచి రిపబ్లికన్‌ పార్టి ఆఫ్‌ ఇండియా అభ్యర్థిగా కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి టి.ఎన్‌. సదాలక్ష్మిపై పోటీచేసి గెలుపొందారు. ఆమె ప్రజాసేవకు సార్థకత లభించింది. నాడు కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా, ఆనాటి ప్రతిపక్ష నాయకులైన తరిమెల నాగిరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, జి. శివయ్య లాంటి ఉద్దండుల సరసన ప్రతిపక్షంలో కూర్చుని ప్రజావాణిని, బాణిని వినిపించినది. అంతేకాకుండా ఆమె విశాఖ ఉక్కు కర్మాగార స్థాపన, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం, తెలంగాణ జిల్లాలలో జిల్లా పరిషత్‌ పాఠశాలల అధ్వాన్న పరిస్థితి, కోస్తా జిల్లాలలో షెడ్యూల్డు తరగతుల ప్రజలపై హత్యాచారాలు, దౌర్జన్యాలు మొదలైన ఎన్నో సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసింది. 1972లో జరిగిన ఎన్నికలలో ఆమె విజయం సాధించినది. మొత్తం పదేళ్ళ తన శాసనసభ సభ్యత్వ కాలంలో ఆమె ప్రజల తరఫున అలుపెరుగని పోరాటాన్ని చేసింది. అందుకే ఆమెను ప్రజాపక్షపాతి అన్నారు. ఆమె రాజకీయాలలో ఎప్పుడు ఓటమి భయంతో మరోపార్టీకి మారిన వ్యక్తిత్వం కాదు. ఆమె ఎప్పుడూ అంబేడ్కర్‌ సిద్ధాంతాలను విడనాడి వేరే పార్టీలో చేరలేదు. రాజకీయ ప్రలోభాలకు లోను కాలేదు. అందుకే ఆమె నిజాయితీకి మారు పేరుగా నిలిచినది. రాజకీయ చరిత్రలో ఇది అనితరసాధ్యం.
 
1956లో పెద్ద మనుషుల ఒప్పందంలోని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులెవరు ఈ అంశాలపై దృష్టి పెట్టలేదు. ఆ కారణంగా తెలంగాణ ప్రాంతానికి ఎంతో అన్యాయం జరిగినది. తమ ప్రాంతాన్ని తామే పరిపాలించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎ. మదన్‌మోహన్‌ కన్వీనర్‌గా తెలంగాణ ప్రజాసమితి ఏర్పడినది. దీనిలో మర్రిచెన్నారెడ్డి చేరడంతో ప్రజాఉద్యమం ఊపందుకున్నది. ఇందులో ఈశ్వరీబాయి క్రియాశీల పాత్ర పోషించింది. అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి అష్టసూత్రాల కార్యక్రమాన్ని ప్రకటించి రాజీ చేసినా, ఈశ్వరీబాయి మాత్రం రాజీపడలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పని చేసిన కొందరు నాయకులతో కలిసి సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితిని ఏర్పాటు చేసి అందులో కీలకపాత్ర పోషించింది. అది ఆమె రాజనీతిజ్ఞతకు ఉద్యమస్ఫూర్తికి తార్కాణం.
 
సాంఘిక సేవ కార్యకలాపాల భారత మహాసభ సంస్థాపక కమిటీ అధ్యక్షురాలిగా ఈశ్వరీబాయి ప్రతి ఆదివారం తన వార్డులోని పేదలు నివసించే వీధులకు వెళ్ళి అక్కడి ప్రజలకు ఆరోగ్యం, పారిశుద్ధ్యం గురించి బోధించేవారు. నిరక్షరాస్యత నిర్మూలనలో ఆమె ఎంతో ఆసక్తిని కనబరిచారు. అంతే కాకుండా సికింద్రాబాద్‌ చిలకలగూడలో ‘గీతావిద్యాలయము’ను స్థాపించి ఆ ప్రాంతములోని స్ర్తీలందరిని చేరదీసి వారికి చేతి వృత్తుల్లో శిక్షణ ఇప్పించి వారి కాళ్ళపై వారు నిలబడేలా చేసింది.
 
ఈశ్వరీబాయి ఒక వ్యక్తి కాదు. ఒక సంస్థ. సమూహ శక్తి. భారతదేశంలోనే దళితుల ఏకైక మహిళానాయకురాలిగా ఏ సమస్య పరిష్కారానికైన ముందుండి పోరాడింది. న్యాయపరమైన హక్కుల పోరాటం ద్వారా డా. అంబేద్కర్‌ సిద్ధాంతానికి ప్రతీకగా నిలిచింది. చిత్తశుద్ధితో మాట్లాడటం ఆమె నైజం. నాటి ముఖ్యమంత్రులు దళిత, స్ర్తీ అభ్యుదయానికి ఆమె సలహాల నెన్నిటినో పరిగణనలోకి తీసుకునేవారు.
 
ఎన్ని కష్టనష్టాలనైన త్యాగాలనైన భరించి స్ర్తీ సమాజములో స్వేచ్ఛ, సమానత్వం సాధించాలన్నదే ఈశ్వరీబాయి ముఖ్య ఉద్దేశ్యము. ఆమె సభలకు, సమావేశాలకు స్ర్తీలు అధికసంఖ్యలో పాల్గొనేవారు. పురుషులు వ్యసనాలకు ముఖ్యముగా తాగుడుకు భానిసలు కాకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత స్త్రీలదేనని నొక్కి చెప్పేవారు. ఆడపిల్లలను తన స్వశక్తిపై నిలబడేలా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత తల్లులదేనని సూచించేవారు. అంటే స్త్రీకి భావ స్వాతంత్ర్యం, ఆలోచన – నిర్ణాయకశక్తి ముఖ్యమనేది ఆమె తపన.
 
దేశ చరిత్రలో సాహసధీర, వీర సామాజిక సేవ చేసిన వనితల సరసన ఈశ్వరీబాయికి ప్రథమ స్థానంలో ఉండటం అతిశయోక్తి కాదు. ఆనాడు ముఖ్యమంత్రుల చేత నీళ్ళు తాగించిన ఘనత ఈశ్వరీబాయిది. ప్రతిపక్ష నాయకురాలి హోదాలో ‘ఫైర్‌బ్రాండ్‌ లేడీ లీడర్‌’గా ఆమెకు ఖ్యాతి దక్కింది. రిపబ్లికన్‌ పార్టి ఆఫ్‌ ఇండియా కవాడే జాతీయ అధ్యక్షురాలిగా దేశంలో విస్తృత పర్యటన చేసి అనేక మంది అభిమానులను, శిష్యులను సంపాదించుకున్న మేటి నాయకురాలు.
 
ఈశ్వరీబాయి తెలుగుతనానికి గొప్ప నిదర్శనం. ఆమె కట్టు, బొట్టు జీవనశైలి మహిళలకు ఆదర్శం. ఆమె వాక్చాతుర్యం యువనాయకులకు స్ఫూర్తిదాయకం. ఇటువంటి ఈశ్వరీబాయి అనారోగ్యానికి గురై 24 ఫిబ్రవరి 1991లో పరమపదించినది. ఈశ్వరీబాయి గొప్ప మానవతావాది. మానవతా విలువలు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, సమానత్వ సాధనకు అహర్నిశలు పోరాడిన మహానాయకురాలు. స్త్రీ జనోద్ధరణకు అవిరళ కృషి చేసిన మహిళా పక్షపాతి. మహిళా సాధికారితకు ఎల్లవేళల పోరాడి రాజకీయ, సాంఘిక, ఆర్థిక రంగాలలో నూతనోత్తేజాన్ని కలిగించి రెండు తెలుగు రాష్ట్రాలలో నవసమాజ, సమసమాజ స్థాపనకే కాక ప్రత్యేకంగా మానవ ప్రగతికి బాటలు చూపి భావితరాలకు ఆదర్శమైన మహా మహిళా నాయకురాలు. ఆమె జీవిత చరిత్ర అజరామరము. అందుకే మహిళా లోకానికి మణిదీపంగా మన ఈశ్వరీబాయి నేటికీ వేనోళ్ళ కీర్తించబడుచున్నది. ఆమె జీవితం మహిళా లోకానికే ఆదర్శం.
 ప్రొ. జి. వెంకటరాజం
విశ్రాంత ఆచార్యులు, ఓ.యు.
(నేడు రవీంద్రభారతిలో ఈశ్వరీబాయి శత జయంతి ఉత్సవాలు)

Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.