
- ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధి
- ఏళ్ల తరబడి వృత్తిలో గ్రామస్థులు
- ఆదాయం అంతంత మాత్రమే..
- ప్రభుత్వ సాయమూ కరువే..
- ఆదుకోవాలని వినతి
(ఇచ్ఛాపురం రూరల్ ) : వేసవి వచ్చిందంటే సామాన్యులకు గుర్తుకొచ్చేది విసనకర్రలు. ఈ సీజన్లో వాటి అమ్మకాలు జోరుగానే సాగుతాయి. అయితే వాటిని తయారుచేస్తున్న వారి పరిస్థితి మాత్రం మెరుగుపడడం లేదు. వాస్తవంగా ఉత్తరాంధ్రలోనే విసనకర్రల తయారీకి ప్రత్యేకంగా నిలుస్తోంది సన్యాసిపుట్టుగ. ఇక్కడ లభించే విసనకర్రలకు భలే గిరాకీ ఉంటుంది. ఈ గ్రామంలో వాటిని తయారు చేసే కుటుంబాలు సుమారు 16 వరకు ఉన్నాయి. అయితే పూర్వం నుంచి వస్తున్న వృత్తిని వదలలేక.. ప్రత్యామ్నాయ పనుల్లోకి వెళ్లలేక వృత్తిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మూడు నెలల ముందు నుంచే..
అసలు వేసవికాలం వచ్చిందటే ఇక్కడ తయారు చేసిన విసనకర్రల కోసం వివిధ పాంతాల నుంచి వ్యాపారులు వస్తుంటారు. దీంతో మూడు నెలల ముందు నుంచే వృత్తిదారులు విసనకర్రలు తయారీని మొదలెడతారు. ఇందుకోసం ఉదయం 5 గంటలకు చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లి తాటి కమ్మలను సేకరిస్తారు. వాటిని ఇంటికి తెచ్చి నిల్వ చేస్తారు. ఆ తర్వాత ఆరబెట్టి కుటుంబ సభ్యులందరూ తయారీ పనిలో నిమగ్నమవుతారు. సేకరించిన తాటి కమ్మలను విసరకర్ర ఆకారంలో కత్తిరించి పైన బరువు పెడతారు. మరుసటి రోజు వాటికి ఈనెలు జోడించి.. చెదరకుండా కడతారు. రంగుల్లో ముంచిన తాటి ఈనెతో చుట్టూ డిజైన్ అల్లుతారు. ఆపైన గ్రామాల్లో అమ్ముతారు.
ఇతర ప్రాంతాలకు ఎగుమతి
అలా తయారు చేసిన విసనకర్రలను కవిటి, ఇచ్ఛాపురం, సోంపేట, కంచిలి, పలాస, ఒడిశాలోని పర్లాకిమిడి, బరంపురం, పాత్రపురం, జరడ ప్రాంతాలకు తరలిస్తారు. ఒక్కో విసనకర్ర రూ. 15 నుంచి రూ. 20 లకు అమ్ముతారు. ఈ సీజన్లో రోజుకు రూ. 300 వరకు ఆదాయం పొందుతారు. వేసవిలో మాత్రమే వీటికి మంచి గిరాకీ ఉండడంతో ఇంటిలో ముగ్గురు నుంచి నలుగురు వరకూ వీటి తయారీ పనిలో ఉంటారు. అయితే ఏడాదిలో 6 నెలలు మాత్రమే పని ఉంటుంది. మిగతా సమయంలో ఖాళీగా ఉండాల్సి వస్తోందని వృత్తిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తితలీ తుఫాన్‌తో ఇబ్బందులు
తితలీ తుఫాన్ వల్ల ఉద్దానంలో చాలా వరకు తాటి చెట్లు నేలకొరిగాయి. దీంతో విసనకర్రల తయారికి అవసరమయ్యే తాటి కమ్మలు దొరకడం లేదు. దీంతో వేరే ప్రాంతాల నుంచి తాటి కమ్మలను కిరాయి బళ్లుపై తీసుకొస్తుండడంతో తమకు గిట్టు బాటు కావడం లేదని వృత్తిదారులు వాపోతున్నారు.
ఆదుకోని ప్రభుత్వం
మా వృత్తికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందడం లేదు. దీన్ని కుటీర పరిశ్రమగా గుర్తించకపోవడంతో ఇదే వృత్తిగా జీవిస్తున్న మాకు ఎలాంటి రుణాలు అందని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం రుణాలు ఇచ్చి రక్షణ కల్పిస్తే మరింత నైపుణ్యంతో జీవనోపాధిని పొందుతాం.
- ఎస్.పీ. పుష్పలత, సన్యాసిపుట్టుగ
ఆరు నెలలే పని
ఏడాదిలో ఆరు నెలలు పాటు విసనకర్రలు తయారు చేస్తాం. మిగిలిన కాలంలో పనుల్లేక అవస్థలు పడుతున్నాం. నా భర్తతో కలిసి రోజంతా కష్టపడి వాటిని తయారు చేస్తాం. దాదాపు 30 ఏళ్లుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్నాం. ఈ సీజన్లోనే ఉపాధి హామీ పని కూడా జరుగుతుండడంతో జాబు కార్డులు ఉన్నా వృత్తిని వదులుకుని ఆ పనికి వెళ్లలేకపోతున్నాం.
- ఎస్.వనజాక్షి, సన్యాసిపుట్టుగ
గుర్తింపు లేదు
తరతరాలుగా ఇదే వృత్తిని నమ్ముకున్నాం. జీవితంలో ఎదుగూ, బొదుగూ లేదు. ఆదాయం అంతంత మాత్రమే. రాబడి పెద్దగా పెరగలేదు. తితలీ తుఫాన్ వల్ల తాటి కమ్మలు ఈ ప్రాంతంలో దొరకడం లేదు. వేరే ప్రాంతాల నుంచి తెప్పించాల్సి వస్తోంది. కొత్తతరం ఈ పనిలోకి రావడం లేదు. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి.
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.