
- లోక్‌సభ ఆవిర్భవించిన నాటి నుంచి 16 సార్లు ఎన్నికలు
- 11 మార్లు గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థులు
- మూడుసార్లు విజయం సాధించిన టీడీపీ
- ఓసారి టీఆర్ఎస్, మరోసారి స్వతంత్ర అభ్యర్థుల విజయం
- హ్యాట్రిక్ విజయాలు సాధించిన హరీష్చందర్, రాంగోపాల్ రెడ్డి
ఆంధ్రజ్యోతి, జగిత్యాల: ఇందూరు కోటలో ఆది నుంచి కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతోంది. నిజామాబాద్ లోక్‌సభ ఆవిర్భావం నుంచి 16 సార్లు ఎన్నికలు జరుగగా, 11సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందడంతో ఇక్కడ హస్తం ఆధిపత్యం నిలుపుకుంది. మూడుసార్లు టీడీపీ అభ్యర్థులు గెలుపొందగా, ఒకసారి టీఆర్ఎస్, మరోసారి స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. 17వసారి ఇందూరు లోక్‌సభకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈసారి పోరు త్రిముఖంగా కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణలో ఇప్పుడు నిజామాబాద్ నియోజకవర్గమంటే రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం...
1952లో మొదటిసారి ఎన్నికలు
నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి మొదటిసారిగా 1952లో ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే జరిగిన తొలి ఎన్నికల్లో గులాబీ పార్టీ బోణీ కొట్టింది. మొదట్లో ఈ నియోజకవర్గం పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, బాల్కొండ, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలు ఉండేవి. 2009లో ఏర్పడిన నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడిన జహీరాబాద్ లోక్‌సభ పరిధిలోకి వెళ్లాయి. దీంతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు నిజామాబాద్ లోక్‌సభలో కలిశాయి. దీంతో నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో ప్రస్తుతం నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బోధన్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం పరిధిలో 14,96,593 మంది ఓటర్లు ఉన్నారు. 1952లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ బోణీ కొట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పీడీఎఫ్ అభ్యర్థులు విజయం సాధించగా, అందుకు విరుద్ధంగా నిజామాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి హరీష్ చంద్ర హేడే విజయం సాధించాడు.
1957, 1962లో జరిగిన వరుస ఎన్నికల్లో ఆయనే విజయం సాఽధించి హ్యాట్రిక్ నమోదు చేసుకున్నాడు. 1967లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎం.నారాయణ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 1971, 1975, 1980లో జరిగిన వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఎం.రాంగోపాల్ రెడ్డి విజయం సాధించి హ్యాట్రిక్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత 1984లో 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన టి.బాలా గౌడ్ వరుసగా రెండుసార్లు గెలుపొందాడు. 1991లో టీడీపీ అభ్యర్థి గడ్డం గంగారెడ్డి విజయం సాధించగా, 1996లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మచరణ్ రెడ్డి గెలుపొందాడు. 1998, 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయిన గడ్డం గంగారెడ్డి విజయం సాధించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మధుయాష్కి గౌడ్ తొలిసారి విజయం దక్కించుకున్నాడు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరుగగా, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు నిజామాబాద్ పరిధిలో చేరాయి. అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మధుయాష్కి గౌడ్‌ను ప్రజలు గెలిపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత విజయం సాధించారు. ఇలా నిజామాబాద్ లోక్‌సభ ఆవిర్భవించిన నాటి నుంచి 16 సార్లు ఎన్నికలు జరుగగా, కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తూ ఇందూరు కోటను కాంగ్రెస్ కంచుకోటగా మార్చుకుంది.
ఇందూరు లోక్‌సభకు రాజకీయ ప్రాధాన్యం
ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇందూరు లోక్‌సభకు రాజకీయ ప్రాధాన్యం నెలకొంది. 17వసారి జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత బరిలో నిలుస్తుండటంతో ఈ స్థానం ఇప్పుడు టీఆర్ఎస్కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. అయితే ఏఐసీసీ అధికార ప్రతినిధి, రాహుల్ గాంధీకి సన్నిహితుడైన మధుయాష్కిగౌడ్ ఇక్కడి నుంచే బరిలో నిలుస్తుండటంతో కాంగ్రెస్ పార్టీకి కూడా ఇక్కడ సవాల్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకునిగా గుర్తింపు పొందిన డి.శ్రీనివాస్ ప్రస్తుతం టీఆర్ఎస్లో కొనసాగుతుండగా, ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉన్నాడు. ఆయన కుమారుడైన ధర్మపురి అర్వింద్ బీజేపీ తరపున బరిలో నిలుస్తున్నాడు. రెండు సంవత్సరాలుగా ఆయన నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ, పరోక్షంగా ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. ఈ ముగ్గురు ఇప్పుడు నామినేషన్లు వేయడంతో ఇక్కడ పోరు త్రిముఖంగా మారింది. అయితే ముగ్గురు అభ్యర్థులకు కూడా ఇప్పుడు రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేయడం తలనొప్పిగా మారింది. ఏది ఏమైనా నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలు అన్ని పార్టీలకు ఇప్పుడు సవాల్‌గా మారాయి.
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.