Advertisement

కేశినేని నాని అలక!

Published: Thu, 06 Jun 2019 04:15:55 IST
కేశినేని నాని అలక!

  • పార్టీ పదవిని తీసుకోవడానికి నిరాకరించిన బెజవాడ ఎంపీ
  • ఫేస్‌బుక్‌లో వెల్లడించిన నాని
  • లోక్‌సభలో విప్‌ పదవి కన్నా ప్రజాసేవే ఆనందమని వ్యాఖ్య
  • అధినేత చంద్రబాబుతో భేటీ
  • పార్టీలోనే ఉంటానన్న కేశినేని
  • కోరాననే ఫ్లోర్‌ లీడర్‌ని చేశారు: జయదేవ్‌
 
అమరావతి, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని అలక పాన్పు ఎక్కడం ఆ పార్టీలో కలకలం రేపింది. లోక్‌సభలో పార్టీ విప్‌ పదవి తీసుకోవడానికి ఆయన నిరాకరిస్తూ, తన నిర్ణయాన్ని బుధవారం ఉదయం తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పెట్టారు. ఆయన పార్టీని వీడబోతున్నారన్న ప్రచారానికి ఇది దారితీసింది. సాయంత్రం ఆయన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కలిసి తన అసంతృప్తికి కారణాలను వివరించారు. తాను పార్టీ మారడం లేదని, టీడీపీలోనే ఉండి పనిచేస్తానని, ఆ తర్వాత ఆయన మీడియా వద్ద ప్రకటించారు. మంగళవారం రాత్రి చంద్రబాబు వద్ద జరిగిన సమావేశంలో లోక్‌సభలో టీడీపీ తరఫున విప్‌గా, ఉప నేతగా నాని పేరును ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. లోక్‌సభకు టీడీపీ తరఫున ఈసారి ముగ్గురు ఎంపీలు గెలిచారు. ఈ ముగ్గురూ రెండోసారి గెలిచినవారే. వీరిలో గల్లా జయదేవ్‌ను పార్లమెంటరీ పార్టీ నేతగా, కింజరాపు రామ్మోహన్‌నాయుడును లోక్‌సభ పక్ష నేతగా గతంలోనే ప్రకటించారు. నానికి విప్‌ బాధ్యతలపై ఇప్పుడు నిర్ణయం తీసుకొన్నారు. ఈ పదవి తీసుకోలేకపోతున్నానంటూ నాని తన ఫేస్‌బుక్‌ పేజీలో బుధవారం ఉదయం పోస్టింగ్‌ పెట్టారు. ‘నన్ను లోక్‌సభలో పార్టీ విప్‌గా నియమించిన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. కానీ ఇంత పెద్ద పదవిని నిర్వహించడానికి నేను సరిపోనని భావిస్తున్నాను. నా కంటే మరింత సమర్థుడిని ఆ పదవిలో నియమిస్తే బాగుంటుందని నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాను. విజయవాడ ప్రజలు నన్ను ఆశీర్వదించి తమ ఎంపీగా ఎన్నుకొన్నారు. ఈ పదవుల కన్నా విజయవాడ ప్రజలకు పూర్తి సమయం వెచ్చించి పనిచేయడం నాకు ఆనందం. నాపై నమ్మకం ఉంచిన చంద్రబాబు గారికి మరోసారి కృతజ్ఞతలు. నాకు ఇచ్చిన పదవిని తిరస్కరిస్తున్నందుకు క్షమాపణలు’ అని నాని అందులో పేర్కొన్నారు.
 
అందుకే కలత..
రెండు మూడు అంశాలు కేశినేని నానిలో అసంతృప్తికి దారి తీసినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్లమెంటరీ నాయకుల పదవులు ప్రకటించిన రోజే లోక్‌సభలో మిగిలిన ఇద్దరు ఎంపీలకు పదవులు నిర్ణయించి తనకు ఏ బాధ్యతా అప్పగించకపోవడం ఆయనకు అసంతృప్తిని కలిగించింది. వారిద్దరితో పోలిస్తే తాను సీనియర్‌ అయినా తనను విస్మరించారన్న అభిప్రాయంలో ఆయన ఉన్నారు. విజయవాడలో పార్టీ కార్యాలయం ఏర్పాటుపై కొంతకాలం క్రితం చంద్రబాబు వద్ద చర్చ జరిగింది. ఏదైనా ఒక భవనం చూడాలని నానికి చంద్రబాబు చెప్పారు. ఒకదానిని ఎంపిక చేసి దానిపై ఒప్పందం కుదుర్చుకొనే సమయంలో ఆ విషయం పక్కనపెట్టి, విజయవాడ నగర శివార్లలోని గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు చెందిన పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర కార్యాలయంగా వినియోగించాలని నిర్ణయం తీసుకొన్నారు. తనకు ఒక పని అప్పచెప్పి ఇంతలోనే మరో నిర్ణయం తీసుకోవడం కూడా నానికి ఇబ్బంది కలిగించింది. తనకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోతోందన్న కారణంతోనే ఆయన విప్‌ పదవి తీసుకోవడానికి నిరాకరించారని చెబుతున్నారు.
 
కోరాననే ఫ్లోర్‌ లీడర్‌ని చేశారు: జయదేవ్‌
బుధవారం సాయంత్రం అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లి కలిసి మాట్లాడారు. అక్కడ కూడా ఆయన తన వైఖరికే కట్టుబడి ఉన్నారు. తనకు పార్లమెంటులో ఏ పదవులూ అవసరం లేదని, విజయవాడ ప్రజలు ఇచ్చిన ఎంపీ పదవి చాలని చెప్పారు. తనకు అసంతృప్తి కలిగించిన అంశాలను పార్టీ అధ్యక్షుడికి దాచుకోకుండా చె ప్పారు. గత ఐదేళ్లలో చోటు చేసుకొన్న అనేక ఘటనలను అధినేత దృష్టికి తెచ్చారు. కృష్ణా జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలను కూడా ఆయన చంద్రబాబుకు చెప్పారు. వాటన్నింటిని పరిగణనలోకి తీసుకొంటానని ఆయన నానితో చెప్పారు. చంద్రబాబుతో భేటీ తర్వాత బయటకు వచ్చిన నాని.. తాను పార్టీని వీడటం లేదని... ఆ ఆలోచన లేదని మీడియా ప్రతినిధుల వద్ద పునరుద్ఘాటించారు. గల్లా జయదేవ్‌ కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీలో సంక్షోభం ఏదీ లేదని, ఈ అంశం ఇంతటితో ముగిసిందని అనుకొంటున్నానని చెప్పారు. ‘పార్లమెంటరీ పార్టీ నేతగా నేనే ఉండాలని అనుకోవడం లేదు. ఈ పదవిని నానికి ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు. ఫ్లోర్‌ లీడర్‌గా అవకాశం ఇవ్వాలని నేను గతంలో పార్టీ అధ్యక్షుడిని కోరాను. నేను అడిగానని అవకాశం ఇచ్చారు. లోక్‌సభలో ఇప్పుడు ఉన్న టీడీపీ ఎంపీలం ముగ్గురం రెండోసారి గెలిచిన వాళ్లమే. పార్టీ అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకొంటే దానికి కట్టుబడి ఉంటాను. మా కుటుంబానికి రెండు పదవులుగా చూడకూడదు. మా అమ్మ గత ముప్ఫై ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి ఆ అనుభవంతో పార్టీ కోసం పని చేస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకోవడంతో ఆమె సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని పొలిట్‌బ్యూరో పదవి ఇచ్చారు’’ అని జయదేవ్‌ పేర్కొన్నారు.
 
బాబు వైసీపీలో చేరితేనే..
బుధవారం మధ్యాహ్నం గల్లా జయదేవ్‌ గుంటూరు నుంచి విజయవాడ వచ్చి నానిని కలిశారు. సుమారు రెండు గంటలపాటు వారు మాట్లాడుకొన్నారు. జయదేవ్‌తో కూడా నాని తన అభ్యంతరాలను సూటిగానే చెప్పినట్లు సమాచారం. ‘మీ ఇంట్లో మీకు ఒక పదవి. మీ అమ్మగారు గల్లా అరుణకు పొలిట్‌బ్యూరో పదవి ఉండటం సరికాదు. చిత్తూరు జిల్లా నుంచి ఇప్పటికే బాబుగారు పార్టీని నడిపిస్తుండగా, మళ్లీ అదే జిల్లాకు ఇన్ని పదవులంటే, చూసేవారికి బాగుండదు. నేను నాకేమీ ఇవ్వాలని అడగడం లేదు. పార్టీలో అందరికీ అన్ని అవకాశాలు ఇచ్చి సమతూకం పాటిస్తే బాగుంటుంది’’ అని ఆయన జయదేవ్‌తో చెప్పారు. ఆయన వచ్చి వెళ్లిపోయిన తర్వాత కొందరు మీడియా ప్రతినిధులు నానిని ఆయన కార్యాలయంలో కలిశారు. ‘మీరు బీజేపీలో చేరుతున్నారా’ అన్న ప్రశ్నకు ఆయన ఘాటుగా స్పందించారు. చంద్రబాబు నాయుడు వైసీపీలో చేరిన రోజు తాను బీజేపీలో చేరతానని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలో అంతర్గతంగా ఉన్న అంశాలపై తన అభ్యంతరాలు చెబుతున్నాను తప్ప పార్టీని వీడే ఆలోచన లేదన్నారు. ఆ తర్వాత ఆయనకు చంద్రబాబు నుంచి ఫోన్‌ వచ్చింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.