
- ఆయన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం
- భావప్రకటన స్వేచ్ఛ అడ్డుకు సంకేతం
- ఏక సాహిత్యవాదాన్ని కోరుకుంటున్నారా?
- సాహిత్య వేదికలపై ఫత్వాల జారీనా?
- కవులు, కళాకారులను కొనలేరు: జయధీర్ తిరుమలరావు
హైదరాబాద్ సిటీ, జూలై3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రచయితల వేదిక (తెరవే) అవసరం ఇకలేదని, ఆ సంస్థను ఇక మూసేస్తేనే మంచిదని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి వ్యాఖ్యానించడం రాజ్యాంగ విరుద్ధమని ఆ సంస్థ అధ్యక్షుడు ఆచార్య జయధీర్ తిరుమలరావు అన్నారు. తెలంగాణలో భావప్రకటనా స్వేచ్ఛను హరించే దిశగా ఆయన వ్యాఖ్యలు నాందీవాచకంగా తోస్తున్నాయని వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో కొందరు మేధావులు, కవులు, రచయితలు, జర్నలిస్టులు ప్రభువుల సింహాసనపు సాలభంజికలుగా మారడంతో, అందరూ అదే తొవ్వ తొక్కాలని సిధారెడ్డి భావిస్తున్నాడు. వాళ్లకంటే రెండాకులు ఎక్కువ చదివిన భజనభంజికుడు నందిని’ అని దుయ్యబట ్టారు. ఆదివాసీలకు మద్దతుగా తెరవే నిలిచినందుకే, ఆ సంస్థను లేకుండా చేయాలనుకుంటున్నారా? అని పరోక్షంగా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇటీవల తెలంగాణ రచయితల సంఘం మూడవ మహాసభలో పాల్గొన్న నందిని సిధారెడ్డి.. తెలంగాణ ఆవిర్భావం కోసం పోరాడిన తెలంగాణ రచయితల వేదిక అవసరం ఇక లేదని.. ఆ సంస్థ అక్కడితో ఆగితేనే గౌరవప్రదమని అన్నారు. సమీకరణాలతో కాకుండా సమస్యల ప్రాతిపదికగా సాహిత్య సంస్థలు పనిచేయాలని తెరవేను పరోక్షంగా విమర్శించారు. సిధారెడ్డి చేసిన ఈ విమర్శలను ఖండిస్తూ బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెరవే బాధ్యులు విలేకరులతో మాట్లాడారు. ప్రజల గొంతుకగా, ప్రతిపక్షపాత్ర వహిస్తున్న ఒక సాహితీ సంస్థను అంత మాట అనడం అప్రజాస్వామికమని జయధీర్ తిరుమలరావు అన్నారు. ప్రజాస్వామిక విలువలతో నడిచే సాహిత్య వేదికలపై ఫత్వాలు సరికాదని హితవు పలికారు.
దేశంలో ఏక సాంస్కృతిక వాదం నడుస్తున్నట్లుగా, తెలంగాణలో ఏక సాహిత్యవాదం ఉండాలని పాలకులు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తున్న తీరుగా కవులు, కళాకారులను కొనలేరని హెచ్చరించారు. తెరవేపై దాడిని నిరసిస్తూ, సంస్థ ఉద్దేశాలను దేశవ్యాప్తంగా తెలిసేలా వచ్చే ఏడాది ద్విదశాబ్ది ఉత్సవాలను పెద్దఎత్తున నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజలపక్షం వహిస్తున్న తెరవేపై దాడిని రచయితలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని కోరారు. ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య సభాముఖంగా తెరవేకు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో తెరవే ప్రధాన కార్యదర్శి గాగోజు నాగభూషణం, రచయిత తెలిదేవర భానుమూర్తి, గఫూర్ శిక్షక్ పాల్గొన్నారు.
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.