Advertisement

పదునైన అక్షరాలే ముందుకు నడిపిస్తాయి

Jul 8 2019 @ 00:49AM

  • విరసం జాతీయ నాయకుడు కళ్యాణ్‌రావు
నెల్లూరు (సాంస్కృతిక ప్రతినిధి), జూలై 7 : ప్రజల పక్షాన నిలబడి రాజ్యాన్ని, పెట్టుబడిని, భావజాలాన్ని, సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నించినందుకు కవులు చీకట్లో బందీ అయినా వారి గొంతు వినిపించే అవకాశం లేకపోయినా కలాలు మాత్రం పదునైన అక్షరాల్లా ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తాయని విప్లవ రచయితల సంఘం నాయకుడు జీ కళ్యాణ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం నగర పుమందిరంలో నేను చావును నిరాకరిస్తున్నాను...సాయిబాబా కవిత్వం, సమర కవి సమయం, వరవరవరావు పుస్తకావిష్కరణ, వ్యక్తిత్వమే కవిత్వం, వరవరరావుపై పాణి వెలువరించిన గ్రంఽథాలు ఆవిష్కరించారు. కళ్యాణరావు మాట్లాడుతూ నిజమైన స్వేచ్ఛాస్వాతంత్ర్యాలతో జీవించే రోజు ఒకటి వస్తుందని, రచయితలు, బుద్ధిజీవులు అందుకు పోరాటం చేస్తూనే ఉండాలని వారి స్వరం ప్రతిధ్వనిస్తూనే ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న అసమానత, అణిచివేత, దోపిడీ రద్దయ్యే రోజు కోసం తమ జీవితాలనే ఫణంగా పెట్టి పోరాడుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజ్యం ఆగ్రహిస్తుందని, కలాన్ని, జ్ఞానాన్ని చిదిమి వేయడానికి కుట్ర పన్నుతుందని, హృదయంతో ఆలోచించి, మేధస్సుతో స్పందించి సృజనతో అక్షరీకరించటంలో రచయితలు ముందుండాలని ఆయన అన్నారు. అనంతరం విరసం నాయకురాలు పీ వరలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతం దేశం జైలుగా మారిందని, స్వేచ్ఛ దండకార్యణంలో ఉన్నా సమాజంలో లేదన్నారు.
 
నక్సలైట్లు, ఆదివాసీల విషయం మాట్లాడితేనే తీవ్రవాద చర్యగా ఈ ప్రభుత్వాలు పరిగణిస్తున్నాయని ఆమె ఆరోపించారు. అజ్ఞాత కవిత్వం, అజ్ఞాత జీవితం వెనుక అనేక చీకటి కోణాలున్నాయని, వాటి కోసమే కవిత్వం ప్రజల్లోకి తీసుకురావాల్సిన అవసరం రచయితలకు ఉందన్నారు. అజ్ఞాత కవిత్వమే నిజానికి సామాజిక నేపథ్యాన్ని ముందుకు నడిపిస్తుందని ఆమె అన్నారు. అనంతరం విరసం జిల్లా కన్వీనర్‌ పీ కోటయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీ చెంచయ్య నేను చావును నిరాకరిస్తున్నాను, కవిత్వమే వ్యక్తిత్వం సంపుటాలు సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం నాయకులు ఎల్లంకి వెంకటేశ్వర్లు, జిల్లా విరసం నాయకులు, సభ్యులు, సానుభూతిపరులు, సాహితీవేత్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.