Advertisement

జాతీయోద్యమ జ్ఞానపుంజం!

Oct 15 2019 @ 01:01AM

దేశ స్వాతంత్య్రోద్యమ కాలంలో గ్రంథాలయ ఉద్యమాల పాత్ర గణనీయమైనది. జాతిని మేల్కొలిపిన విజ్ఞాన చైతన్య కెరటాలు గ్రంథాలయాలు. స్వాతంత్ర్య సమర యోధులు ప్రారంభించి, సాహితీ పిపాసకుల ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా నడుస్తూ శత వసంతాలు దాటిన గ్రంథాలయాలు దేశంలో బహు అరుదు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా వేటపాలెంలోని ‘సారస్వత నికేతనం’ అటువంటి అరుదైన గ్రంథాలయాల్లో ఒకటి. దేశంలోని మొదటి పది ప్రసిద్ధ గ్రంథాలయాల్లో ఒకటి. రాజమండ్రి ‘గౌతమీ గ్రంథాలయ’ స్థాపకులు, స్వాతంత్య్ర సమరయోధులు, భాషావేత్త కీ.శే. నాళం కృష్ణారావు బంధువు అయిన ఊటుకూరి వెంకట శ్రేష్టి 1918అక్టోబర్‌ 15వ తేదీన సాహిత్యం, నైతికత, దేశభక్తి, దాతృత్వం, మొదలైన విలువల వ్యాప్తి లక్ష్యంగా ఈ గ్రంథాలయాన్ని సొంత ధనంతో స్థాపించారు. కావలసిన సామగ్రి అందించి, రీడింగ్‌ రూములు ఏర్పాటుచేసి గ్రంథాలను సమకూర్చారు. సారస్వత నికేతనం ఆధ్వర్యంలో సంచార గ్రంథాలయాలు నడిపారు. వెంకట శ్రేష్ఠి తరువాత ఈ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసినవారు అడుసుమిల్లి శ్రీనివాసరావు పంతులు. అనతి కాలంలోనే పేరెన్నిక గన్న ఈ గ్రంథాలయాన్ని గాంధీతో పాటు ఎందరెందరో స్వాతంత్ర్య సమరయోధులు, ప్రముఖులు సందర్శించారు. 1929లో జాతిపిత మహాత్మా గాంధీ నూతన భవన నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. ఆ తరువాత 1935లో గాంధీజీ రెండోసారి సారస్వత నికేతనానికి విచ్చేశారు.
 
1935లో భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌ ఈ సరస్వతీ నిలయాన్ని సందర్శించారు. గాంధీ మహాత్ముడు శంకుస్థాపన చేసిన భవనాలకు సేఠ్‌ జమ్నాలాల్‌ బజాజ్‌, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు ప్రారంభం చేశారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం, కాశీనాథుని నాగేశ్వరరావు, కట్టమంచి రామ లింగారెడ్డి, పాతూరి నాగభూషణం, తదితర ప్రముఖులెందరో గ్రంథాలయాన్ని సందర్శించారు. పేరెన్నిక గన్న ఈ గ్రంథాలయ నిర్వాహకులు పేద విద్యార్థుల కోసం ఉచిత పాఠశాల నడిపారు. ఆరు బయట ఉన్న స్థలంలో పెద్దలను ఆహ్వానించి ఉపన్యాసాలిప్పించేవారు. ఆనాడు అందుబాటులో ఉన్న ‘మాజిక్‌ లాంతరు’ను ఉపయోగించి స్లైడ్స్‌ ప్రదర్శించి పారిశుద్ధ్యం, ట్రాఫిక్‌ రూల్స్‌ మొదలైన సమాజ విషయాలను తెలియేజేసేవారు. ఏ శుభ ముహూర్తంలో ప్రారంభమైందో, స్థాపించిన నాటి నుండి ఈనాటి వరకు లాభాపేక్ష లేని ప్రైవేట్‌ యాజమాన్యంలో ఇది నడవటం విశేషం. ఇందులో పని చేసిన అధికారులు, వర్కర్లలో స్వచ్ఛందంగా సేవ చేస్తున్నవారే ఎక్కువమంది ఉన్నారు. వారికిది సరస్వతీ దేవాలయమే. సుమారు లక్ష దాకా ఉన్న పుస్తక సంచయం నుంచి మనకు కావలసిన పుస్తకం ఏ బీరువాలో ఎన్నో నంబర్‌లో దొరుకుతుందో చెప్పగలిగిన వ్యక్తులున్నారు. ఆనాటి యువజనులు ‘హిందూ యువజన సంఘం’ పేరిట స్థాపించిన ఒక స్వచ్ఛంద సంస్థ కార్యకలాపాలను సారస్వత నికేతనం కేంద్రంగానే నిర్వహించే వారు. లైబ్రరీకి కూడా వారు అండదండలందించారు. నాటి నుంచీ నేటి వరకూ అదే అంకితభావంతో ఈ ప్రాంతమే కాదు, దేశవ్యాప్తంగా గల ప్రజల, ప్రముఖుల సారస్వత తృష్ణ తీర్చి కర్తవ్య పరాయణులను చేస్తోంది వేటపాలెం సారస్వత నికేతన్‌. ఇన్ని విధాల సేవలందిస్తున్న ఇది ప్రజలకు సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం వహించి విద్యా విజ్ఞాన వికాస కేంద్రంగా భాసిస్తోంది. రకరకాల సేవలందిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్న ఈ సారస్వత కేంద్రం ఎన్నో ప్రత్యేకతలను సొంతం చేసుకుంది. ‘మనకు కావాల్సిన పుస్తకం, అందులోనూ ముఖ్యంగా తెలుగు పుస్తకం ఎక్కడా దొరకకపోతే, అది వేటపాలెం గ్రంథాలయంలో దొరుకుతుంది’ అని పాఠకులతో అనిపించుకుంటోంది. అంటే దానిలో ఎంతటి అరుదైన, అపురూపమైన గ్రంథ సంచయం ఉందో, దాని ప్రత్యేకత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. భారత, రామాయణ, భాగవతాలతో పాటు, భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌, అష్టాదశ పురాణాలు, పరిశోధన గ్రంథాలు, కవితా సంపుటాలు, నవలలు, కథా సంపుటాలు, వ్యాస సంకలనాలు, తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం, హిందీ వగైరా భాషల్లో అన్నీ కలిపి లక్షకు పైగా పుస్తకాలున్న అతి పెద్ద లైబ్రరీగా గుర్తింపు పొందింది. 1927 నుండి భారతి (సాహిత్య పత్రిక), 1935 నుండి ఆంధ్రపత్రిక, 1947 నుండి ఆంధ్రప్రభ, 1938 నుండి కృష్ణాపత్రిక, 1910 నుండి ఆంధ్రపత్రిక ఉగాది సంచికలు, అలనాటి ప్రముఖ పత్రికలు గృహలక్ష్మి, తెలుగు స్వతంత్ర, యంగ్‌ ఇండియా, త్రివేణి, భవన్స్‌ జర్నల్‌, వగైరా దిన, వార, మాస పత్రిలన్నీ ఈ లైబ్రరీలో లభిస్తాయి. వీటితో పాటు 1500కు పైగా వివిధ రకాల ప్రత్యేక సంచికలు అందుబాటులో వున్నాయి. ప్రాచీన కాలంనాటి 50 తాళపత్ర గ్రంథాలు, మహాత్ముని చేతికర్ర, వివిధ భాషల్లో వెలవడిన ప్రముఖ నిఘంటువులు, విజ్ఞాన సర్వస్వాలు, ప్రభుత్వ గెజిట్‌లు ఇక్కడ వున్నాయి.
 
దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే పరిశోధకులు రోజుల తరబడి ఇక్కడే ఉండి ఎక్కడా దొరకని ఇక్కడి గ్రంథాల నుంచి సమాచారం పొంది పి.హెచ్‌.డి పట్టాలు, డి.లిట్‌లు పొందారు, పొందుతున్నారు. నిత్యం వందలాదిమంది పాఠకులు సందర్శించి, పుస్తకాలు, పత్రికలు చదువుకుని, జ్ఞాన సముపార్జన చేస్తుంటారు. ఏనాటి వార్తాపత్రికైనా, మేగజైన్‌ అయినా ఇక్కడ లభ్యమౌతుంది. వాటిని అతి భద్రంగా జాగ్రత్త చేసి సంరక్షిస్తున్నారు. అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా మొదలైన విదేశాలనుండి, భారత దేశంలో అన్ని ప్రాంతాలనుండి పరిశోధకులు ‘పుస్తకాల వేట’లో వేటపాలెం వచ్చి గ్రంథాలయ భవనాలలో బస చేసి, సౌకర్యాలను వినియోగించుకొని తమ ప్రాజెక్ట్‌లను నిర్విఘ్నంగా పూర్తి చేసుకొని సఫలమవుతున్నారు. ఇది గ్రంథాలయంగానే కాకుండా, ఒక చైతన్య కేంద్రంగా సేవలందిస్తోంది. మొదట పెంకుటింట్లో ప్రారంభమై, నేడు కాంక్రీటు రెండు అంతస్థుల భవనాలలో విరాజిల్లుతోంది ఈ ‘సారస్వత సరస్వతి’. 1942లో గుంటూరు జిల్లా గ్రంథాలయాధికారుల సభ, అంతర్జాతీయ సహకార ఉద్యమ సభ, దక్షిణ భారత యువత విద్యా సదస్సు, తదితర జాతీయ, అంతర్జాతీయ సభలు ఈ గ్రంథాలయంలోనే జరిగాయి. 1950లో వావిలాల గోపాలకృష్ణయ్య ‘జర్నలిజం తరగతులకు’ ప్రధాన ఆచార్యులుగా వ్యవహరించారు. తల్లావఝల శివ శంకర శాస్త్రి, తల్లావఝల కృత్తివాస తీర్ధులు, మహాకవి, బండ్ల సుబ్రహ్మణ్యం, మాచిరాజు దేవీ ప్రసాద్‌, నేల నూతుల కృష్ణమూర్తి, బూదరాజు రాధాకృష్ణ వంటి రచయితలూ ఈ సరస్వతీ ప్రాంగణం గురించి విపులంగా రాశారు. వేటపాలెం నివాసి, ఆర్థిక- గణాంక శాస్త్ర నిపుణులు దేశ విదేశాలలో అత్యున్నత పదవులనలంకరించి రిటైరయిన సాహితీవేత్త బందా లక్ష్మీ నరసింహారావు ‘సారస్వత నికేతనం’ చరిత్రను రచించి శాశ్వతం చేస్తున్నారు. ‘వేట పాలెము తెలుగుల పేర్మి ధనము -నిత్య పరిశోధన కాంచి తౌన్నత్య గృహము’ అని గుండు మధుసూదన్‌, ‘వేట వలదోయి, గ్రంథాలు వేలకొలది -ఒక్క చోటనే దొరకును నిక్కముగను’ అని నేదునూరి రాజేశ్వరి ఈ గ్రంథాలయాన్ని తమ కవిత్వంతో ప్రస్తుతించారు. ఇక్కడున్న గాంధీ చేతి కర్ర వారసత్వపు ఆస్తిగా, పవిత్రంగా అందరూ భావించి ఆ కర్ర చేతబట్టి ఫోటోలు తీసుకొని మురిసిపోతుంటారు.
 
చలపాక ప్రకాష్‌
ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.