Advertisement

అమరజీవి ఆత్మబలిదానం అర్థమేమిటి?

Mar 16 2016 @ 01:05AM

ఆంధ్ర రాష్ట్రమును గురించి బహుదీర్ఘకాల చర్యలు జరిగినవి. రాష్ట్రము అవసరమా, ఏర్పాటు చేయ వచ్చునా, అనే ప్రశ్నలు యిప్పుడు లేవు. ప్రభుత్వాలు, ప్రజలు, నాయకులు ఏకాభిప్రాయానికి (అనగా రాష్ట్రమును త్వరగా ఏర్పాటు చేయాలనే నిర్ణయం) వచ్చారు. దేశం ఏకంగా ఉండాలంటే రాష్ట్రాలు సంకుచిత భావం పోగొట్టుకోవాలంటే ఢిల్లీ, బొంబాయి, మద్రాసు కలకత్తా మొదలగు ముఖ్య నగరాలు ఏ ఒక్క రాషా్ట్రనికి చెందకుండా కేంద్ర ప్రభుత్వమే పాలించాలి. ఈ నగరాల అభివృద్ధి దేశంలో నుండు అన్ని ప్రాంతాల ధనరాసులతో, రక్తముతో, బుద్ధితో జరిగినది. ఆర్థిక వ్యవస్థ మారితే ఈ నగరాలు వస్తు సంగ్రహ ఆలయాల క్రింద ఉండిపోతవి. అంతవరకు ప్రతి ఒక్కడు ఈ నగరాలలో చేరాలనుకుంటారు. ప్రతి పట్నం, ప్రతిపల్లె ఈ నగరాల మీద ఒక రకంగా ఆధారపడియున్నవి. కనుక ఎవరికి కూడా ఈ నగరాలలో నిషేధముండరాదు...’ పొట్టి శ్రీరాములు ప్రాయోపవేశ దీక్ష ప్రారంభించడానికి 34 రోజులు ముందు అనగా 1952 సెప్టెంబరు 15న ‘ఆంధ్రరాష్ట్రం’ పేరున నెల్లూరు నుంచి రాసిన వ్యాసంలో తొలుత కనబడుతాయి ఈ వాక్యాలు! (చూడుము: బలిదానం - వైఎస్‌ శాస్త్రి, ఎ.సుబ్బారాయ గుప్త).
         1952 అక్టోబరు 19న మద్రాసులోని మైలాపూరు ప్రాంతంలో బులుసు సాంబమూర్తి గృహంలో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించే ముందు తాను దేని కొరకు దీక్ష చేస్తున్నదీ వివరిస్తూ శ్రీరాములు ఒక సుదీర్ఘమైన ప్రకటన చేశారు. ఆయన పేర్కొన్న కారణాలలో మద్రాసు నగరం ఒక కీలక అంశంగా కనబడుతుంది. ఈ వివరాలు పెద్దగా ప్రచారంలోకి రాలేదు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు శ్రీరాములు దీక్ష చేశారనే అభిప్రాయం బహుళవ్యాప్తిలో ఉంది. కానీ ఆయన కోరినది ఆంధ్ర రాషా్ట్రనికి మదరాసు నగరం రాజధానిగా ఉండటం; అనంతరం మదరాసు నగరాన్ని ‘సి’ తరగతి రాష్ట్రంగా మలచడం! ఈ రెండు విషయాలు దాదాపు మరుగున పడిపోయాయి.
శ్రీరాములు పూర్వీకుల తొలి నివాస స్థలం ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని (ఇది వరకు నెల్లూరు జిల్లా) కనిగిరి తాలూకాలోని పడమటి పల్లె అనే కుగ్రామం. శ్రీరాములు తండ్రి గురవయ్య, 1876ఽ ధాత కరవు కారణంగా గురవయ్య తన సోదరుడడు నారాయణతో కలిసి మద్రాసుకు పది మైళ్ళ దూరంలో ఉండే న్యాయపాలెం గ్రామానికి తరలి వచ్చారు. గురవయ్య, నారాయణలు కొంత భూమిని సంపాదించి, వ్యవసాయం ప్రారంభించారు. కష్టపడని గురవయ్యతో మరదలు (నారాయణ భార్య) గొడవపడేది. అప్పటికి గురవయ్య, మహా లక్ష్మమ్మలకు గురవమ్మ, నారాయణలు కలిగారు. కట్టుబట్టలతో ఈ కుటుంబం మద్రాసు నగరం జార్జిటవునలోని అన్నా పిళ్లై వీథిలోని 163 నెంబరు ఇంటిలో దిగారు. ఈ ఇంటిలోనే శ్రీరాములు 1901 మార్చి 16న జన్మించారు.
 
            శ్రీరామ నవమి పర్వదినాల్లో జన్మించారు కనుక ఆ పేరుపెట్టారని అంటారు. గురవయ్య పెద్దగా కష్టపడే వ్యక్తి కాదుకనుక, కుటుంబ భారం మహాలక్ష్మమ్మ మీద పడింది. వంటపని చేస్తూ ఈమె కుటుంబాన్ని పోషించింది. శ్రీరాములు ఏడవ ఏట తండ్రి మరణించడం, 1917లో అన్న నారాయణ గతించడం, మరుసటి సంవత్సరం అక్క గురవమ్మ మరణించడం ఘోర విషాదాలు. గురవయ్య గతించిన తర్వాత 1912లో మహాలక్ష్మమ్మ పప్పులు తయారి తిరుగలి మొదలు పెట్టి, అభివృద్ధి చేసింది. చేతికి వచ్చిన పిల్లలు మరణించడం ఆ కుటుంబాన్ని కుంగతీసింది. శ్రీరాములు చదువు గోవిందప్ప నాయక్‌ వీధిలోని వీధి బడి, ఆదియప్ప నాయక్‌ వీధిలోని పోగ్రెసివ్‌ యూనియన సెకెండరీ స్కూలులో, మింట్‌సీ్ట్రట్‌లోని హిందూ థియోలాజికల్‌ హైస్కూల్‌లో సాగింది. ఫిఫ్త్‌ ఫార్మ్‌తో ఆగిపోయిన శ్రీరాములు చదువు అక్కడితో ముగిసిపోయింది. ఫిఫ్త్‌ ఫార్మ్‌ పూర్తి చేయని వారు కూడా విక్టోరియా జూబిలి టెక్నికల్‌ ఇనస్టిట్యూట్‌వారు చేర్చుకుంటార ని అక్కడ చేరారు శ్రీరాములు.
 
            పి.ఎస్.గుప్త అని విద్యా సంస్థలచే పిలువబడే శ్రీరాములు 1924లో శానిటరీ ఇంజనీరింగ్‌, ప్లంబింగ్‌లో డిప్లొమా సాధించారు. ఈ చదువు సమయంలోనే వారి వివాహం జరిగింది. ఈ కాలంలోనే వర్తమాన పరిణామాలు గమనిస్తూ గాంధీజీ సిద్ధాంతాల పట్ల ఆకర్షణ శ్రీరాములుకు కలిగింది. యంగ్‌ ఇండియా, నవజీవన పత్రికలలో గాంధీజీ రాసిన వ్యాసాలు శ్రీరాములు వ్యక్తిత్వాన్ని మూలమట్టుగా కదిలించి వేశాయి. నేడు సెంట్రల్‌ రైల్వేగా పిలువబడే జి.ఐ.పి. (గ్రేట్‌ ఇండియన పెనిన్స్యులర్‌) రైల్వేలో శ్రీరాములు బొంబాయిలో అసిస్టెంట్‌ ప్లంబర్‌గా పని చేశారు. ఒకవైపు దేశం కోసం కృషి చేయాలనే మనసు, మరోవైపు కుటుంబ సమస్యలు - ఇదీ శ్రీరాములు పరిస్థితి. 1928లో భార్య కనుమూయడంతో శ్రీరాములు దాదాపు ఒంటరి వాడయ్యారు. ఒక రకంగా మనస్సన్యాసి అయ్యారు. అప్పటికి తమ్ముడు, మేనల్లుడి బాధ్యతలు తనమీద ఉన్నాయి.
      శ్రీరాములు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనాలని తలంచారు. 1930 ఏప్రిల్‌ 1వ తేదిన గాంధీని కలిశారు. గాంధీజీ సలహా మేరకు ఉద్యోగానికి రాజీనామా చేసి ఏప్రిల్‌ 16న సబర్మతి ఆశ్రమానికి బయలుదేరారు. శ్రీరాములు సబర్మతి ఆశ్రమంలో మూడు సంవత్సరాలపాటు ఉన్నారు. 1934 జనవరిలో సంభవించిన బిహార్‌ భూకంపంలో సేవలందించడానికి గాంధీ సలహా మేరకు వెళ్లి, పదినెలల పాటు అక్కడ సేవలందించారు. రాజ్‌కోట్‌ సత్యాగ్రహాశ్రమంలో కొంతకాలం, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ శ్రమజీవి సంఘంలో కొంతకాలం పని చేశారు శ్రీరాములు. 1936లో మారెళ్ళ గ్రామ పరిసర ప్రాంతాలలో సుమారు మూడు సంవత్సరాలు కృషి చేశారు. 1939లో గుడివాడ తాలూకాలోని కొమరవోలులోని గాంధీ ఆశ్రమంలో చేరారు. ఈ ఆశ్రమం స్థాపకులు ఎర్నేని సుబ్రమణ్యం ‘దరిద్ర నారాయణ’ అనే పత్రిక నడిపేవారు. అందులో శ్రీరాములు గాంధీ సిద్ధాంతంపై రచనలు చేసేవారు. క్విట్‌ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొని 1943 జనవరి 26న జైలు పాలయ్యారు.
            ఉత్తర దేశంలో కన్న దక్షిణ హిందూ దేశంలో సవర్ణుల ప్రాబల్యం అధికంగా ఉందని, ఫలితంగా సమాజంలో చీలికలు రావచ్చని శ్రీరాములు ఆందోళన పడేవారు. 1945 జులైలో రామస్వామి పెరియార్‌ నెల్లూరు వచ్చినపుడు శ్రీరాములు మంతనాలు జరిపారు. వర్ణ వైషమ్యాలు తగ్గాలని అన్ని కులాల వారికి సామూహిక విందు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌ నాయకులలో బ్రాహ్మణులు ఎవరూ ఈ విందుకు హాజరు కాలేదు. 1946లో నెల్లూరులో దేవాలయంలో హరిజనుల ప్రవేశానికి శ్రీరాములు రెండుమార్లు నిరశన వ్రతం చేశారు. నెల్లూరులోని మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలోకి హరిజన ప్రవేశం కోసం జరిగిన ఈ దీక్ష పిమ్మట తిరుమల వెంకన్న, సింహాచలం అప్పన్న ఆలయాలను కూడా ప్రభావితం చేసింది.
            కరవు ఏమిటో, కష్టం ఏమిటో శ్రీరాములుకు కుటుంబం నేర్పింది. కష్టజీవులకు నగరాలు ఇచ్చే ఆసరా ఏమిటో అనుభవపూర్వకంగా శ్రీరాములుకు తెలుసు. చదువు కోసం బొంబాయి వెళ్ళి, మరలా మదాస్రులో ఉద్యోగం కోసం ప్రయత్నించి, గత్యంతరం లేక బొంబాయి వెళ్ళిన శ్రీరాములుకు ఇతర ప్రాంతాల, ఇతర నగరాల సదుపాయాలు తెలుసు. కుటుంబం నేర్పిన కష్టాలే కాదు, గాంధీ సిద్ధాంతం ప్రభావం కూడా అవగతమే! స్వామి సీతారామ్‌ చేస్తున్న దీక్ష కూడా తెలుసు. తెలుగు వాళ్ళకు ప్రత్యేక రాష్ట్రం లేక పోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయని కూడా తెలుసుకున్న శ్రీరాములు మద్రాసుతో కూడిన రాష్ట్రం కావాలని దీక్ష పూనారు. తర్వాత పది సంవత్సరాలకు ఆ నగరాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి పంపాలని ఉద్దేశం. దీనికోసం 1952 అక్టోబరు 19వ తేది ఉదయం పది గంటలకు నిరాహార దీక్ష ప్రారంభించారు. డిసెంబరు 15 తేది రాత్రి పదకొండు గంటల 20 నిమిషాలకు శ్రీరాములు శ్వాస ఆగిపోయింది. 1952 డిసెంబరు 12న ప్రకాశం పంతులు ‘మద్రాసు తెలుగునగరం’ అనే నివేదికను ప్రచురించారు. దీన్ని మద్రాసు ఆంధ్రా వెల్‌ఫేర్‌ లీగ్‌ వెలువరించింది. మళ్ళీ 17 రోజులకే (డిసెంబర్‌ 28) పునర్ముద్రణ పొందింది. 1953 అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది మద్రాసు లేని రాష్ట్రంగా. ఒక ప్రముఖ రాయలసీమ నాయకుడి కారణంగా బళ్ళారి ఆంధ్ర రాష్ట్రంలో కలువలేదు. చరిత్ర మరుగున పడిపోయింది.
 
         పొట్టి శ్రీరాములు ప్రాణాలు కోల్పోయింది దేనికోసమో తెలియకుండా పోయింది. తెలుగునాట మద్రాసు అంతర్భాగమై ఉంటే తెలుగు పరిస్థితి, ఇప్పుడు తమిళనాడుగా పిలవబడే ప్రాంతంలో ఉండే నలభై శాతం తెలుగువాళ్ళ స్థితి వేరుగా ఉండేది. రెండునెలల క్రితం అరియలూరు అనే గ్రామంలో ఒక తెలుగు రైతును కలిశాను. మాటల మధ్యలో ఆయన పొట్టి శ్రీరాములు గురించి అసంతృప్తిగా వ్యాఖ్యానించారు. శ్రీరాములు గతించిన తర్వాతగా ఆంధ్ర రాష్ట్రం అమలు జరగడంతో తెలుగువారికి మచ్చ పడింది. తమిళ నాయకులకుండే ఢిల్లీ నాయకుల బంధుత్వం, సాన్నిహిత్యం తెలుగుకు ప్రతిబంధకమైంది. దీని ఫలితాలే నేడు తమిళనాట తెలుగును దెబ్బతీస్తున్నాయి. కనీసం ఇప్పుడైనా సరిగా చరిత్రను తెలుసుకోవాల్సి ఉంది!
-డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌
(నేడు పొట్టిశ్రీరాములు జయంతి).

Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.