బంగాళాదుంపతో పెరుగు కర్రీ

ABN , First Publish Date - 2018-05-05T22:19:18+05:30 IST

బంగాళాదుంపలు- నాలుగు (ముక్కలుగా తరిగి), పెరుగు- ఒకటిన్నర కప్పు, శెనగపిండి...

బంగాళాదుంపతో పెరుగు కర్రీ

కావలసినవి
 
బంగాళాదుంపలు- నాలుగు (ముక్కలుగా తరిగి), పెరుగు- ఒకటిన్నర కప్పు, శెనగపిండి- రెండు టేబుల్‌స్పూన్లు, ఇంగువ- 1/3టీస్పూను, జీలకర్ర- ఒక టీస్పూను, కరివేపాకు రెబ్బ- ఒకటి, ఉల్లిపాయ- ఒకటి (సన్నగా తరిగి), అల్లం- అర టీస్పూను (చిన్నముక్కలుగా తరిగి), వెల్లుల్లి- అర టీస్పూను చిన్న ముక్కలుగా తరిగి), పచ్చిమిర్చి- రెండు(చిన్నముక్కలుగా), కారం- ఒక టీ స్పూను, ధనియాలపొడి- ఒకటిన్నర టీస్పూను, పసుపు-అర టీస్పూను, ఉప్పు- రుచికి సరిపడా, వంటనూనె- నాలుగు టీస్పూన్లు, కొత్తిమీర- అలంకరణకు.
 
తయారీవిధానం
ఆలుగడ్డలను కడిగి కుక్కర్‌లో నీళ్లు పోసి ఉడికించాలి. కొద్దిసేపైన తర్వాత కుక్కర్‌లోని ఆలుగడ్డలను బయటకు తీసి వాటి పైనున్న పొట్టును తీసి కచ్చాపచ్చాగా చేయాలి.
పెద్ద పాత్ర తీసుకుని అందులో పెరుగు, శెనగపిండి వేసి, తర్వాత కొద్దిగా నీళ్లు పోసి, పేస్టులా చేయాలి. కడాయిలో కొద్దిగా నూనె పోసి వేడిచేయాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఇంగువలను వేసి వేగించాలి.
అందులో ఉల్లిపాయముక్కలను కూడా వేసి మెత్తగా అయ్యేదాకా వేగించాలి.
తరిగిపెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిముక్కలు, కరివేపాకు అందులో వేసి పాన్‌లో రెండు నిమిషాలు వేగించాలి. తర్వాత కారం, ధనియాలపొడి, పసుపు వేసి కాసేపు వేగనివ్వాలి. ఇలాంటప్పుడు మసాలా కడాయి అడుగుభాగానికి అతుక్కుపోయే అవకాశం ఉంది. అందుకని అందులో రెండు టేబుల్‌స్పూన్ల నీటిని కలపాలి. ఉడికించిన బంగాళాదుంప ముక్కలను ఈ మసాలాలో వేసి, బాగా కలిసే దాకా వేగించాలి. తర్వాత మంటను తగ్గించి వేగిన బంగాళాదుంప ముక్కలపై చిక్కటి పెరుగును పోసి కలపాలి. ఉప్పు సరిపోయిందో లేదో చెక్‌ చేసుకోవాలి. తర్వాత పాన్‌ మీద మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. తర్వాత దానిపై కొత్తిమీర చల్లి, వేడి వేడిగా అన్నంలోకి లేదా పుల్కాలతో తింటే రుచి అదిరిపోతుంది.

Updated Date - 2018-05-05T22:19:18+05:30 IST