కావలసిన పదార్థాలు
లేత మునగాకు - 2 కప్పులు, పెసరపప్పు - అరకప్పు, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లిరెబ్బలు - 4, ఎండుమిర్చి - 2, పచ్చిమిర్చి - 2, పచ్చికొబ్బరితురుము - అరకప్పు, ఆవాలు, జీలకర్ర పొడి - ఒక టీ స్పూను చొప్పున, నూనె - 2 చెంచాలు, ఉప్పు, కారం - రుచికి తగినంత, కరివేపాకు - 4 రెబ్బలు, కొత్తిమీర - అరకప్పు, పసుపు - పావు టీ స్పూను.
తయారుచేసే విధానం
పెసరపప్పు అరగంట ముందు నానబెట్టుకోవాలి. నూనెలో ఎండుమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లి తరుగు ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. తర్వాత శుభ్రం చేసిన మునగాకు వెయ్యాలి. తగినంత ఉప్పు, కారం చేర్చాలి. ఆకు కొంచెం వేగాక, పెసరపప్పు వేసి మగ్గబెట్టాలి. పప్పు మెత్తబడ్డాక పచ్చికొబ్బరి తురుము కలపాలి. రెండునిమిషాల తర్వాత జీలకర్ర పొడితో పాటు కొత్తిమీర వేసి అర నిమిషం ఆగి దించేయాలి.