పచ్చిరొయ్యలతో పొట్లకాయ కూర

ABN , First Publish Date - 2017-10-07T23:42:03+05:30 IST

రొయ్యలు - పావు కేజీ, పొట్లకాయ ముక్కలు - రెండు కప్పులు, పచ్చిమిర్చి - ఒకటి....

పచ్చిరొయ్యలతో పొట్లకాయ కూర

కావలసిన పదార్థాలు
(శుభ్రం చేసిన) రొయ్యలు - పావు కేజీ, పొట్లకాయ ముక్కలు - రెండు కప్పులు, పచ్చిమిర్చి - ఒకటి, టమోటా - ఒకటి, అల్లం తరుగు - ఒక టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, పచ్చికొబ్బరి తురుము - ఒక కప్పు, ఉల్లితరుగు - రెండు కప్పులు, మెంతులు - చిటికెడు, కారం - ఒకటిన్నర టీ స్పూన్లు, ధనియాల పొడి - 2 టీ స్పూన్లు, కరివేపాకు - 4 రెబ్బలు, నూనె - 3 టేబుల్‌ స్పూన్లు.
 
తయారుచేసే విధానం
కడాయిలో ఒక టీ స్పూను నూనె వేసి మెంతులు, కొబ్బరి తురుము, ఒక కప్పు ఉల్లి తరుగు దోరగా వేగించి, చల్లారిన తర్వాత కారం, ధనియాల పొడులతో పాటూ పేస్టు చేసుకోవాలి. ఒక పాత్రలో పొట్లకాయ ముక్కలు, పసుపు, చీరిన పచ్చిమిర్చి, అల్లం తరుగు, ఉప్పు వేసి అరకప్పు నీటితో పాటుగా ముక్కల్ని సగం ఉడికించాలి. తర్వాత రొయ్యలు, టమోటా ముక్కలు వేసి మగ్గించాలి. తర్వాత రుబ్బుకున్న పేస్టు కూడా వేసి తగినంత నీరు పోసి చిన్న మంటపై కొద్దిసేపు ఉడికించాలి. ఇప్పుడు విడిగా నూనెలో వేగించిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూరలో కలిపి దించేయాలి.

Updated Date - 2017-10-07T23:42:03+05:30 IST