పనీర్‌ టిక్కా మసాలా

ABN , First Publish Date - 2018-08-21T21:27:59+05:30 IST

పనీర్‌ 75 గ్రాములు, టమోటాలు: వందగ్రాములు(ముక్కలుగా చేసుకోవాలి), వెన్న: 25 గ్రాములు, క్రీమ్‌: వందగ్రాములు..

పనీర్‌ టిక్కా మసాలా

కావలసిన పదార్థాలు
 
పనీర్‌ 75 గ్రాములు, టమోటాలు: వందగ్రాములు(ముక్కలుగా చేసుకోవాలి), వెన్న: 25 గ్రాములు, క్రీమ్‌: వందగ్రాములు, పెరుగు: 25 గ్రాములు, కారం: రెండు లేదా మూడు స్పూన్లు, జీలకర్ర పొడి: టేబుల్‌ స్పూను, గరం మసాలా పొడి: టేబుల్‌ స్పూను, కసూరి మెంతి: టేబుల్‌ స్పూను, ధనియాల పొడి: టేబుల్‌ స్పూను, పసుపు: చిటికెడు, జీడిపప్పు: 25 గ్రాములు, కోవా: 25 గ్రాములు, పచ్చిమిరపకాయలు: 200 గ్రాములు, కొత్తిమీర: కొద్దిగా, నిమ్మరసం: రెండు స్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడ.
మసాలా కోసం: గట్టిపెరుగు: కప్పు, జీడిపప్పు: ముద్ద: మూడు లేక నాలుగు స్పూన్లు, కారంపొడి: టేబుల్‌స్పూను, గరంమసాలా పొడి: టేబుల్‌ స్పూను, నిమ్మరసం: టేబుల్‌స్పూను, ఉప్పు: రుచికి సరిపడ
 
తయారీ విధానం
 
ముందుగా పచ్చిమిరపకాయలకు మధ్యలో గాట్లు పెట్టి నూనెలో బాగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. మసాలాపదార్థాలన్నీ ఓ గిన్నెలో వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. సగం మసాలను పనీర్‌ ముక్కలకు పట్టించి గ్రిల్‌లో కొద్ది సేపు ఉంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ లేదా కడాయిలో నూనె పోసి కాగిన తరువాత టమోటా ముక్కలు, కారంపొడి, జీలకర్ర పొడి, కసూర్‌ మెంతి, గరంమసాలా పొడి వేసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మిగిలిన మసాలా ముద్దను టమోటాలకు జత చేసి నూనె పైకి తేలేంతవరకూ ఉడికించాలి. క్రీమ్‌ను నెమ్మదిగా జతచేస్తూ బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా ఉడికిన తరువాత పనీర్‌ ముక్కలను వేసి మరికొద్దిసేపు ఉడికించాలి. ఇప్పుడు కోవా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, వేయించిపెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి దింపుకోవాలి. అవసరం అనుకుంటే కూర ఉడుకున్న సమయంలో కొద్దిగా నీరు కూడా పోసుకోవచ్చు.

Updated Date - 2018-08-21T21:27:59+05:30 IST