పిజ్జా

ABN , First Publish Date - 2015-08-31T16:26:25+05:30 IST

రొట్టెకి కావలసినవి: మైదా రెండు కప్పులు లేదా ఒకటిన్నర కప్పు మైదా, అర కప్పు గోధుమపిండి, వాము- అర టీ స్పూను

పిజ్జా

రొట్టెకి కావలసినవి: మైదా రెండు కప్పులు లేదా ఒకటిన్నర కప్పు మైదా, అర కప్పు గోధుమపిండి, వాము- అర టీ స్పూను, మూడు తరిగిన వెల్లుల్లి రేకలు , మూడు తరిగిన పచ్చి మిరపకాయలు, తులసి ఆకులు, పొడి చేసిన రెండు లేక మూడు నల్లమిరియాలు, ఈస్ట్‌ రెండు టీ స్పూన్‌లు, పంచదార అర టీ స్పూను (ఇష్టాన్ని బట్టి), మూడు టీ స్పూన్‌లు నూనె, ఉప్పు రుచికి తగినంత.
టాపింగ్‌కి పిజ్జా చీజ్‌..
తయారీ విధానం: ముందుగా వేడినీళ్లు తీసుకుని అందులో ఈస్ట్‌ని ఐదునిమిషాలు నానబెట్టండి (నురగ వచ్చేదాక). మిగతా పదార్థాలన్నింటినీ నీళ్లు పోసి కలుపుకున్నాక దానిలో ఈస్ట్‌ని కూడా వేసి చపాతీ పిండిలా మృదువుగా కలిపిపెట్టండి. పిండి మీద పలుచని తడిబట్టవేసి గంటన్నర కదిలించకుండా ఉంటే రెట్టింపుగా పొంగుతుంది.
పిజ్జాసాస్‌ పదార్థాలు:
16 ఔన్సుల టొమాటో సాస్‌లో వెల్లుల్లి పొడి ఒక టీ స్పూన్‌, ఒక టీ స్పూన్‌ కారం, ఉప్పు రుచికి తగినంత వేసుకుని బాగా కలిపితే పిజ్జా సాస్‌ రెడీ..
పిజ్జా తయారీకి..
400 ఫారన్‌ హీట్‌లో పెట్టి ఒవెన్‌ని వేడి చేసి ఉంచుకోవాలి. పిండిముద్దని చపాతీలా అంచులవరకూ సమానంగా గుండ్రంగా వత్తుకోండి. సాస్‌ని ఆ రొట్టెపైన మందపాటి పొరలా వేయండి. దానిమీద సన్నగా పొడుగ్గా తరిగిన చీజ్‌ని చల్లండి. దానిమీద వేసుకునే పదార్థాలు మీ ఇష్టం. సాధారణంగా గుండ్రంగా పలుచగా తరిగిన ఉల్లిపాయలు, టొమాటో, గ్రీన్‌పెప్పర్‌లతో పాటు ఖీమా, పుట్టగొడుగులు, పైనాపిల్‌లలో ఏదొకటి ఉపయోగించి చేస్తారు. మీ రుచికి తగినట్లుగా కూరగాయలతో అలంకరించుకున్న తరువాత మళ్లీ చీజ్‌ని చల్లండి. ఒవెన్‌ని 350 ఫారన్‌ హీట్‌ దగ్గర సెట్‌ చేసుకుని అడుగురాక్‌లో పిజ్జాపాన్‌ని పెట్టి 18 నుంచి 20 నిమిషాలు ఉంచితే చీజ్‌ కరిగి అడుగు బ్రౌన్‌రంగులోకి మారుతుంది. వెంటనే బయటకి తీసి వేడివేడిగా తింటే భలే బాగుంటుంది. హోంమేడ్‌ పిజ్జా రుచే వేరు కదా. పై కొలతలు ఒకే ఒక పిజ్జాకి సరిపోతాయి. ఎన్ని పిజ్జాలు కావాలంటే ఈ కొలతలు అన్ని రెట్లు పెంచుకుంటూ పోండి.

Updated Date - 2015-08-31T16:26:25+05:30 IST