అమెరికాలో ఈ మాత్రలకు పెరగబోతున్న గిరాకీ!

ABN , First Publish Date - 2022-06-27T03:05:14+05:30 IST

గర్భస్రావానికి రాజ్యాంగ రక్షణ కల్పించే చట్టాన్ని రద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు వెల్లడించిన సంచలన తీర్పు

అమెరికాలో ఈ మాత్రలకు పెరగబోతున్న గిరాకీ!

వాషింగ్టన్: గర్భస్రావానికి రాజ్యాంగ రక్షణ కల్పించే చట్టాన్ని రద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు వెల్లడించిన సంచలన తీర్పు నుంచి ఆ దేశ ప్రజలు ఇంకా కోలుకోలేదు. ఈ తీర్పుపై ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా పలువురు ప్రముఖులు  విస్మయం వ్యక్తం చేశారు. అమెరికాకు ఇది దుర్దినమని, అబార్షన్‌కు చట్టబద్ధత తొలగించడంతో ఎంతో మంది మహిళల ఆరోగ్యం, జీవితం ప్రమాదంలో పడతాయని బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు.  మరోవైపు ఈ తీర్పును వ్యతిరేకిస్తూ అమెరికా ప్రజలు సుప్రీంకోర్టు ఎదుట నిరసనకు దిగారు.


సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో చట్టబద్ధంగా అబార్షన్ చేయించుకునే హక్కును మహిళలు కోల్పోవడంతో ఇప్పుడు వారి దృష్టి గర్భస్రావ మాత్రలపై పడింది. గర్భస్రావాన్ని నిషేధించిన లేదంటే పరిమితం చేసిన రాష్ట్రాల్లో ఈ పిల్స్‌ను వీలైనంతగా అందుబాటులో ఉంచడంపై బైడెన్ ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది. అయితే, వీటి వినియోగాన్ని కూడా అడ్డుకోవాలనుకునే రాష్ట్రాలు, సంప్రదాయవాదులకు మాత్రం చట్టపరమైన సవాళ్లు తప్పవు.


సుప్రీంకోర్టు తీర్పు అనంతరం మహిళలకు అబార్షన్ పిల్స్ అందుబాటులో ఉండేలా చూడాలని ఆరోగ్య శాఖ అధికారులను బైడెన్ ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పు పర్యవసానాలను ఎదుర్కొనే రాష్ట్రాల్లో మహిళల హక్కును రక్షించేందుకు తాను శక్తిమేర కృషి చేస్తానని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో బైడెన్ వ్యాఖ్యానించారు. 


అబార్షన్ పిల్స్‌తో ఎలాంటి ప్రమాదం ఉండదు. పది వారాల గర్భాన్ని కూడా ఎలాంటి ముప్పు లేకుండా ఈ మాత్రలతో తొలగించుకోవచ్చు. అంతేకాదు, అమెరికాలోని మొత్తం గర్భస్రావాలలో సగం వీటి ద్వారానే అవుతున్నట్టు గణాంకాలు కూడా చెబుతున్నాయి. మరోవైపు, రిపబ్లికన్లు శనివారం సుప్రీంకోర్టు బయట చేతిలో పోస్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ పోస్టర్లలో అబార్షన్ పిల్స్ ఎక్కడ లభ్యమవుతాయన్న వివరాలున్నాయి. మరికొందరు ‘నా శరీరం.. నా ఇష్టం’ అని నినదించారు.   

Updated Date - 2022-06-27T03:05:14+05:30 IST