‘సంపూర్ణ’ మద్యాంధ్ర!

Published: Sun, 12 Jun 2022 02:49:08 ISTfb-iconwhatsapp-icontwitter-icon

మద్య నిషేధం ఉండదు... ఉండబోదు

సర్కారు వారి విస్పష్టమైన హామీ

‘ఏపీ లిక్కర్‌ బాండ్స్‌’తో రూ.8 వేల కోట్లు

బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా అప్పు

ఉద్యోగుల సొమ్ముతో ‘మద్యాభివృద్ధి’

రూ.5 వేల కోట్లు పెట్టుబడి పెట్టిన ఈపీఎ్‌ఫవో

9.5 శాతం వడ్డీతో నిధుల సేకరణ

0.85 శాతం కమీషన్‌ కూడా సమర్పయామి

కమీషన్‌ ఎందుకో, ఎవరికో తెలియదు

మద్యంపై ఆదాయం వదులుకోలేని సర్కారు

అమ్మకాలు మరింత పెంచుకునే చర్యలు రూ.14,500 కోట్లు

(2018-19లో మద్యంపై ఆదాయం)


 రూ.19,500 కోట్లు

(2021-22లో మద్యంపై ఆదాయం)


‘మాట తప్పడు... మడమ తిప్పడు! చెప్పాడంటే.. చేస్తాడంతే!’  అని ఇప్పటికీ కాసింతైనా నమ్ముతూ... చెప్పిన ప్రకారం మద్య నిషేధం అమలు చేసేస్తారేమో అని మనసులో ఏ మూలనో భయపడుతున్న మద్యపాన ప్రియులకు శుభవార్త! మీరేం భయపడకండి! రాష్ట్రంలో సంపూర్ణంగాకాదు కదా, పాక్షికంగానైనా మద్య నిషేధం అమలు కాదు! ఇది సర్కారు వారు స్వయంగా ఇచ్చిన హామీ! 


గతంలో చంద్రబాబు సర్కారు హయాంలో... అమరావతి డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ బాండ్లు విక్రయించి రూ.2వేల కోట్లు అప్పు చేసింది. ఇది... అమరావతి నగరాభివృద్ధి కోసం. ఇప్పుడు... జగన్‌ సర్కారు హయాంలో బేవరేజెస్‌ కార్పొరేషన్‌ బాండ్ల విక్రయం ద్వారా రూ.8 వేల కోట్లు అప్పు తెచ్చుకుంది. ఇది... రాష్ట్రంలో ‘మద్యాభివృద్ధి’ కోసమా!


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

అనుకున్నదే అయ్యింది! ‘దశలవారీగా సంపూర్ణ మద్య నిషేధం కాదు’... రాష్ట్రాన్ని సంపూర్ణంగా మద్యంలో ముంచేందుకు వైసీపీ సర్కారు కంకణం కట్టుకుంది. రాష్ట్రంలో మద్యం వ్యాపారం చేసే బేవరేజెస్‌ కార్పొరేషన్‌ నుంచి బాండ్లు జారీ చేయించి... రూ.8వేల కోట్ల నగదు సమీకరించింది. అది కూడా 9.6 శాతం భారీ వడ్డీతో బాండ్లు కొనుగోలు చేయించింది. ‘అమ్మో! చెప్పిన మాట ప్రకారం మద్య నిషేధం అమలుచేస్తే ఎలా? అప్పులు ఎలా వసూలవుతాయి?’ అనే ఆందోళన లేకుండా... ‘‘మద్య నిషేధం చేసేదిలేదు’ అని ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చి, బాండ్ల రేటింగ్‌ను కూడా పెంచుకుంది. ‘‘రాష్ట్రం లో మద్యం అమ్మకాలపై పాక్షికంగాకానీ, పూర్తిగాకానీ నిషేధం విధించం’’ అని ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చింది. ఈ హామీతోనే బేవరేజెస్‌ కార్పొరేషన్‌ బాండ్లను మార్కెట్లో అమ్మి రూ.8,300 కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఏపీ లిక్కర్‌ బాండ్లపై 9.62 శాతం వడ్డీ పడింది. ఇది కాకుండా 0.85 శాతం కమీషన్‌ కింద చెల్లిస్తున్నారు. అంటే... మొత్తం 10.47 శాతం వడ్డీ. ప్రస్తుతం మార్కెట్లో ఎన్‌సీడీలపై (నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌) 8.85 శాతం మాత్రమే వడ్డీ అమలవుతోంది. దీని ప్రకారం చూేస్త జగన్‌ సర్కార్‌ 1.62 శాతం ఎక్కువ వడ్డీ చెల్లిస్తోంది.  భారీ కమీషన్లు ముట్టజెప్పి తెచ్చిన రూ.8,300 కోట్ల అప్పులో ఉద్యోగుల సొమ్ము రూ.5,000 కోట్లు ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈపీఎ్‌ఫవో రూ.5,000 కోట్లు పెట్టి జగన్‌ సర్కారు జారీ చేసిన లిక్కర్‌ బాండ్లు కొనుగోలు చేసింది. రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ఈపీఎ్‌ఫవో బకాయిలు, ఇతర పెండింగ్‌ నిధులు దాదాపు రూ.2,200 కోట్లు చెల్లించాలి. వాటిని చెల్లించకుండా ఉద్యోగులను ఉసూరుమనిపిస్తున్న జగన్‌ సర్కారు... అదే ఉద్యోగుల డబ్బులతో అప్పుల సోకులు చేసుకోవడం విశేషం.


అడ్డదారిలో... అడ్డగోలుగా

రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలు లిస్ట్‌ 2లోని ఐటెమ్‌ నంబర్‌ 58 ప్రకారం లిక్కర్‌పై వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్ర ఖజానాకే చెందాలి. రాష్ట్రం తరఫున మద్యం వ్యాపారం నిర్వహించే బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు నిర్వహణ చార్జీలు మాత్రమే ఇవ్వాలి. అదికూడా ఏటా అకౌంటింగ్‌, ఆడిటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక చెల్లించాలి. కానీ, రాజ్యాంగ నిబంధనకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వమే స్పెషల్‌ మార్జిన్‌ పేరుతో జీవోలు ఇచ్చేసి, చట్టం సవరించి ఖజానా నుంచి మద్యం ఆదాయాన్ని బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు మళ్లించింది. ఈ ఆదాయాన్ని చూపించి ఎన్‌సీడీలు జారీచేసి రూ.8,300 కోట్లు అప్పు భారీ వడ్డీకి తీసుకొచ్చారు. ఇండియా రేటింగ్స్‌ సంస్థ బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు ‘ఏఏ’ రేటింగ్‌ ఇవ్వడం గమనార్హం. అందువల్లే ఎన్‌సీడీల కొనుగోలుకు ఇన్వెస్టర్లు  ఎగబడ్డారని... రూ.2,000 కోట్లు వస్తాయనుకుంటే రూ.8,300 కోట్లు వచ్చాయని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటోంది. అయితే.. మద్యం విధానం మార్చబోమని హామీ ఇవ్వాలనే షరతుకు సర్కారు అంగీకరించిన తర్వాత బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు ‘ఏఏ’ రేటింగ్‌ లభించింది. రూ.8300 కోట్ల అప్పు కోసం రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు కమీషన్లు చెల్లిస్తున్నారు. ఈ కమీషన్లు ఎందుకు ఎవరికి చెల్లిస్తున్నారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.


ఇదేమి పోలిక...

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతి అభివృద్ధి కార్పొరేషన్‌ బాండ్ల ద్వారా నిధులు సేకరించింది. ఇప్పుడు... ఏపీ లిక్కర్‌ బాండ్లను దాంతో పోల్చుతున్నారు. అప్పట్లో అమరావతి అభివృద్ధి కోసం అప్పు తీసుకున్నారు. అప్పుడు ఎన్‌సీడీలపై ఉన్న వడ్డీ 10.5 శాతం అమలైంది. ఆ అప్పు కోసం ఎవరికీ కమీషన్లు ఇవ్వలేదు. ఇప్పుడేమో మద్యం వ్యాపారం చేసే సంస్థ పేరు తో అప్పులు తీసుకున్నారు. పైగా... ఎన్‌సీడీల వడ్డీరేటు 8.85 శాతం కాగా, 9.62 శాతానికి తీసుకున్నారు. ఎవరికో,ఎందుకో తెలియని 0.85 శాతం కమీషన్‌ కూడా చెల్లిస్తున్నారు. పైగా ఉద్యోగులు తమ వేతనంలో కోత ద్వారా నెలనెలా దాచుకుంటున్న పీఎఫ్‌ సొమ్మును తెచ్చి లిక్కర్‌ బాండ్లలో పెట్టడం మరింత చర్చనీయాంశమవుతోంది.


మద్యాదాయం కోసం...

దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధం... అని హామీ ఇచ్చిన జగన్‌ సర్కారు మూడేళ్లలో అనేక పిల్లిమొగ్గలు వేసింది. పైగా... మద్యాన్ని ‘అస్మదీయులకు’ ఆదాయం తెచ్చి పెట్టే మార్గంగా మలచుకున్నారు. అధికారంలోకి వచ్చీ రాగానే ‘కొత్త మద్యం పాలసీ’ పేరుతో షాపులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చింది. తొలి విడత 830 షాపులు తగ్గించింది. అనంతరం కరోనా కాలంలో మరో 500 తగ్గించింది. ప్రస్తుతం 2,930 షాపులను నడుపుతోంది. రెండేళ్లలో ఒక్క షాపు కూడా తగ్గించలేదు. పైగా.. ‘లిక్కర్‌ మాల్స్‌’ను తెరపైకి తెచ్చారు. ‘మద్యపానాన్ని నిరుత్సాహపరిచేందుకు’ అంటూ ధరలు భారీగా పెంచారు. దీంతో అమ్మకాలు పడిపోవడంతో కుంటిసాకులు చెబుతూ మళ్లీ ధరలు తగ్గించేశారు. మద్యం అమ్మితేనే సంక్షేమ పథకాలు అమలుచేయగలమని నిర్మొహమాటంగా చెప్పారు. అమ్మఒడి, చేదోడు, చేయూ త పథకాలను మద్యం ఆదాయంతోనే అమలు చేస్తున్నట్లు తెలిపారు. 2021-22లో రూ.19,500 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రతి రూపాయికీ వెతుక్కుంటున్న సర్కారు ఇంత ఆదాయాన్ని కోల్పోయేందుకు సిద్ధంగాలేదు. ‘మద్య నిషేధం లేదు’ అంటూ అప్పులూ తెచ్చుకుంది.


నిషేధం నుంచి ‘నియంత్రణ’

ఎన్నికల హామీలో, అధికారంలోకి వచ్చాక ‘మద్య నిషేధం’ అని పదేపదే చెప్పారు. ఆ తర్వాత ‘నిషేధం’ ఎత్తివేసి ‘నియంత్రణ’ తీసుకొచ్చారు. గతేడాది ఒక పత్రికా ప్రకటనలో తొలుత ‘మద్య నిషేధం’ అని రాసి, ఆ తర్వాత ‘నియంత్రణ’ అంటూ సవరణ జారీచేశారు. మంత్రులు, అధికార పార్టీ నేతలు కూడా మద్యపాన నిషేధం గురించి మాట్లాడటం లేదు. ఎక్కడైనా విలేకరులు ప్రశ్నిస్తే ‘దశలవారీగా చేస్తామన్నాం కదా’ అంటూ ముక్తసరిగా సమాధానం చెబుతున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.