Abu Dhabi: అబుదాబి ఎయిర్‌పోర్టులకు పొటెత్తిన ప్రయాణికులు.. భారతీయులే టాప్

ABN , First Publish Date - 2022-08-25T15:54:20+05:30 IST

యూఏఈ రాజధాని అబుదాబి (Abu Dhabi) పరిధిలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలకు (International Airports) ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో ప్రయాణికులు (Passengers) పొటెత్తారు.

Abu Dhabi: అబుదాబి ఎయిర్‌పోర్టులకు పొటెత్తిన ప్రయాణికులు.. భారతీయులే టాప్

అబుదాబి: యూఏఈ రాజధాని అబుదాబి (Abu Dhabi) పరిధిలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలకు (International Airports) ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో ప్రయాణికులు (Passengers) పొటెత్తారు. జనవరి నుంచి జూన్ వరకు ఏకంగా 6.3 మిలియన్ల మంది ప్రయాణికులు ఈ ఎయిర్‌పోర్టుల ద్వారా ప్రయాణించారు. వీరిలో భారతీయులే (Indians) టాప్. ఈ ఆరు నెలల్లో మనోళ్లు 12.8లక్షల మంది ప్రయాణించారు. అబుదాబి పరిధిలోని అబుదాబి ఇంటర్నెషనల్, అల్ ఐన్ ఇంటర్నెషనల్, అల్ బతీన్ ఎగ్జిక్యూటివ్, దెల్మా అండ్ సర్ బని యాస్ ఐలాండ్ ఎయిర్‌పోర్టులు ఆరు నెలల కాల వ్యవధిలో 94,538 విమాన సర్వీసులు నడిపించాయి. అబుదాబి ఎయిర్‌పోర్ట్స్ సీఈఓ షరీఫ్ హసీం అల్ హష్మీ మాట్లాడుతూ.. 2021తో పోలిస్తే ఈ ఏడాది ప్రయాణికులు తాకిడి గణనీయంగా పెరిగిందని చెప్పారు. ఒక్క అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం (Abu Dhabi International Airport) నుంచే గతేడాది మొదటి అర్ధభాగంతో పోలిస్తే ఈ ఏడాది 94శాతం విమాన సర్వీసులు పెరిగాయన్నారు. ఇక్కడి నుంచి 2022 మొదటి ఆరు నెలల్లో 101 గమ్యస్థానాలకు 23 విమాన సంస్థలు విమాన సర్వీసులు నడిపినట్లు ఆయన వెల్లడించారు. గతేడాది ఇదే సమయానికి కేవలం 76 గమ్యస్థానాలకు 19 ఎయిర్‌లైన్స్ మాత్రమే విమానాలు నడిపాయని తెలిపారు. 


ఇక దేశాలవారీగా ప్రయాణికుల జాబితాను పరిశీలిస్తే.. 12.8లక్షల మంది ప్రయాణికులతో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా పాకిస్థాన్ (4,85,000), బ్రిటన్ (3,74,000), సౌదీ అరేబియా (3,33,000), ఈజిప్ట్ (2,83,000) ఉన్నాయి. అలాగే అబుదాబి నుంచి టాప్ గమ్యస్థానాల్లో లండన్ హీత్రౌ (2,76,000), ఢిల్లీ (2,25,000), ముంబై (2,21,000), కొచ్చి (2,17,000), కైరో (2,03,000) నగరాలు ఉన్నాయి. 

Updated Date - 2022-08-25T15:54:20+05:30 IST