సామరస్యంతోనే సమృద్ధ సాగునీరు

ABN , First Publish Date - 2021-12-23T05:51:45+05:30 IST

కృష్ణానదిలో ఉభయ తెలుగు రాష్ట్రాల అవసరాలు తీర్చే నీళ్లు లేకున్నా ముఖ్యమంత్రు లిరువురూ ఆ లేని నీళ్ల కోసం పోట్లాడుకుంటున్నారు! ఇదే అదనుగా ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు...

సామరస్యంతోనే సమృద్ధ సాగునీరు

కృష్ణానదిలో ఉభయ తెలుగు రాష్ట్రాల అవసరాలు తీర్చే నీళ్లు లేకున్నా ముఖ్యమంత్రు లిరువురూ ఆ లేని నీళ్ల కోసం పోట్లాడుకుంటున్నారు! ఇదే అదనుగా ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు వేగంగా ముందుకెళుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ వ్యక్తిగత సంబంధాల్లో కనబరుస్తున్న సౌభ్రాతృత్వాన్ని ప్రజల ప్రయోజనాల విషయంలో కూడా వర్తింప చేసుకుంటే పరిష్కారం కాని సమస్యంటూ ఉండదు. 


ఇప్పటికైనా ఎగువ రాష్ట్రాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్ధం కావాలి. లేని పక్షంలో ఉభయ రాష్ట్రాల్లో మిగులుజలాల ఆధారంగా ఉన్న ప్రాజెక్టులను ఎండబెట్టుకోవలసిందే! తాజాగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పరిగణించాలని తెలంగాణ కోరుతోంది. ఈ పరిస్థితుల్లో ఇదెలా సాధ్యం? బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డును కోర్టు తుది తీర్పుకు లోబడి నోటిఫై చేసేందుకు అనుమతి ఇవ్వాలని కర్ణాటక సుప్రీంకోర్టులో మధ్యంతర పిటిషన్ వేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాలు దీనికి అభ్యంతరాలు వ్యక్తం చేయగా కర్ణాటకకు అనుకూలంగా మహారాష్ట్ర ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. కృష్ణలో క్రమేణా నీటి లభ్యత తగ్గిపోతున్న దృష్ట్యా ఎగువ రాష్ట్రాల దయాదాక్షిణ్యాలపై దిగువ రాష్ట్రాలు ఆధారపడవలసి వస్తోందని తెలుగు రాష్ట్రాలు భావిస్తున్నాయి. కనుక మొత్తం బేసిన్‌లోని అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగే విధంగా దామాషా పద్ధతిలో నీటి పంపకానికి ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును మన రెండు రాష్ట్రాలు కోరలసి ఉంది. ఇదే జరిగితే సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వ అభిప్రాయం కోరుతుంది. ఈ ప్రక్రియ విజయవంతమైతే తెలుగు రాష్ట్రాల వివాదం ఒక మేరకు పరిష్కారమవుతుంది. ఎలాగూ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తన తుదితీర్పులో శాశ్వత బోర్డు ఏర్పాటు చేయాలని సూచించి ఉన్నందున ఇదొక్కటే ప్రస్తుత పరిస్థితుల్లో పరిష్కార మార్గం. బేసిన్‌లో నీటి కొరత ఉన్న సంవత్సరాల్లో ఆ భారం అన్ని రాష్ట్రాలు భరిస్తాయి. అయితే ఉభయ తెలుగు రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లలో ఆ ప్రతిపాదన లేదు! 


కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం చేసిన కొద్దిరోజులకే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు త్వరలో నోటిఫై చేయబడుతుందనే ప్రకటన ఒకటి వెలువడింది. అప్పట్లో దానిని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఆ ప్రకటన ప్రభావం ఇప్పుడు తెలిసొస్తోంది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నందున తాము తీవ్రంగా నష్టపోతున్నామని కోర్టు తీర్పుకు లోబడి అవార్డు నోటిఫై చేసేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును కర్ణాటక ప్రభుత్వం ఆశ్రయించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల మెడ మీద ఇది కత్తిలా వేలాడుతోంది. 


2013లో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తుది అవార్డు ప్రకటించగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి అవార్డు నోటిఫికేషన్ జారీ కాకుండా స్టే తెచ్చింది. తదనంతరం తెలంగాణ కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయింది. అప్పటి నుంచి ఈ కేసు పెండింగ్‌లో ఉంది. 


ఒకవేళ సుప్రీంకోర్టు తన తుది తీర్పునకు లోబడి అనుమతి ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డును నోటిఫై చేస్తే ఏం జరుగుతుందో పరిశీలిద్దాం! 75 శాతం నీటి లభ్యత కింద 2130 టియంసి నికరజలాలను బచావత్ ట్రిబ్యునల్ బేసిన్‌లోని అన్ని రాష్ట్రాలకు పంచింది. 150 టియంసిలను క్యారీఓవర్ కింద ఆంధ్రప్రదేశ్ నిల్వ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఆ పైన మిగులు జలాలను కూడా వినియోగించుకొనే స్వేచ్ఛను దఖలు పరచింది.


అయితే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం నీటి లభ్యత కింద 2293 టియంసిలుగా లెక్కగట్టింది. బచావత్ ట్రిబ్యునల్ పంపకం చేసిన నికరజలాలు 2130 టియంసిలకు మించి ఉన్న 163 టియంసిల నికరజలాలను, 285 టియంసిల మిగులుజలాలను కలిపి మొత్తం 448 టియంసిలను బేసిన్‌లోని అన్ని రాష్ట్రాల మధ్య పంపకం చేసింది. ఇక కృష్ణలో పంపకానికి చుక్క నీరు లేకుండా చేసింది. అయితే బచావత్ ట్రిబ్యునల్ పంపకం చేసిన నీటి జోలికి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ వెళ్లలేదు. మిగులు జలాల ఆధారంగా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణమైన లేక నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయలేదు.


బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ద్వారా, పర్యావరణ కేటాయింపులు పోగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు దక్కింది నికరంగా 38 టియంసిలు మాత్రమే. తెలుగుగంగకు 25 టియంసిలు, జూరాలకు 9 టియంసిలు, ఆర్డీయస్ కుడి కాలువకు 4 టియంసిలు మాత్రమే. బచావత్ ట్రిబ్యునల్ 2130 టియంసిల నికరజలాల పైన మిగులు జలాలను వినియోగించుకొనే స్వేచ్ఛతో పాటు 150 టియంసిలు క్యారీఓవర్ కింద శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నిల్వ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం నీటి లభ్యత కింద 30 టియంసిలు, సరాసరి నీటి లభ్యత కింద 120 టియంసి లు మొత్తం 150 టియంసిలు క్యారీఓవర్ కింద నిల్వ చేసుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్‌కు కల్పించింది. అంటే ఎందుకూ కొరగాని క్యారీఓవర్ 150 టియంసిలతో కలిపి మొత్తం 194 టియంసిలు ఆంధ్రప్రదేశ్‌కు లెక్క చూపింది. దురదృష్టమేమంటే ఇంతవరకు ఏనాడు క్యారీఓవర్ కింద శ్రీశైలం, సాగర్‌లలో నీరు నిల్వ చేసిన సందర్భం లేదు.


కర్ణాటకకు కేటాయింపులు భిన్నంగా ఉన్నాయి. 65 శాతం నీటి లభ్యత కింద 61టియంసిలు, సరాసరి (మిగులు జలాలు) నీటి లభ్యత కింద 105 టియంసిలతో పాటు పర్యావరణం కింద 7 టియంసిలు మొత్తం 173 టియంసిలు కేటాయించింది. అదే ఆంధ్రప్రదేశ్ 65 శాతం లభ్యత కింద 43 టియంసిలు, సరాసరి నీటి లభ్యత కింద 145 టియంసి లు, పర్యావరణం కింద 6 టియంసిలు కేటాయించి సరాసరి నీటి లభ్యత కింద కేటాయించిన 145 టియంసిల్లో 120 టియంసిలు క్యారీఓవర్ కింద కేటాయించి ఎందుకూ కొరగాకుండా చేసింది. కర్ణాటకకు భిన్నంగా ఆల్మట్టిలో ఉపయోగించుకునే వీలు కల్పించింది. తెలంగాణ సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్‌లో ఈ అంశం ప్రముఖంగా ప్రస్తావించింది. ఆంధ్రప్రదేశ్‌లో అంతా రహస్యమే కాబట్టి అఫిడవిట్ బహిర్గతం కాలేదు.


ఇక తెలంగాణతో వివాదం అటుంచి, కృష్ణానది తమ ఇంట ముంగిట నుంచి ప్రవహిస్తున్నా కనీసం తాగునీటికి దిక్కులేదని ఆందోళన చేస్తున్న రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లావాసుల డిమాండ్‌లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలా తీర్చుతారు? ఇదిలా వుండగా బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమలు కాగానే పూర్తిగా మిగులు జలాలు హుష్‌కాకి అయితే ఇప్పడు ఉన్న నీటిలో కర్ణాటక, మహారాష్ట్రలకు 258 (448–190=258)టియంసిలు అదనంగా దఖలుపడతాయి. ఆ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలకు లభ్యత తగ్గిపోతుంది.‍


కనీస ప్రాతిపదికన, 11వ షెడ్యూల్‌లో పేర్కొన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హంద్రీ-నీవా, గాలేరు నగరి, వెలుగొండ, తెలుగుగంగ నాలుగు పథకాలకు 150 టియంసిలు; తెలంగాణకు చెందిన కల్వకుర్తి, నెట్టెంపాడు, శ్రీశైలం ఎడమ కాలువ, పాలమూరు- రంగారెడ్డి, దిండిలకు 225 టియంసిలు. వెరసి ఉభయ రాష్ట్రాలకు మొత్తం నాలుగు వందల టియంసిలకు పైగా అవసరమవుతుంది. అంటే కృష్ణా నదిలో 2578 టియంసిలకు పైగా కనీసం నాలుగు వందలు టియంసిల నీరు లభ్యమైతేనే రెండు తెలుగు రాష్ట్రాల్లోని మిగులు జలాల ఆధారంగా గల ప్రాజెక్టులకు మోక్షం కలుగుతుంది. ఇది పూర్తిగా అసాధ్యం. 


ఈ నేపథ్యంలో ఇరువురు ముఖ్యమంత్రులు సామరస్యానికి ప్రాధాన్యతనిచ్చి బేసిన్ అంతటా దామాషా పద్ధతిలో నీటి పంపకానికి డిమాండ్ చేయవలసి ఉంది. 


బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎలాగూ శాశ్వత ప్రాతిపదికన బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదించింది కాబట్టి రెగ్యులేట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇదిలా ఉండగా తుంగభద్ర జలాశయానికి ఎగువ భాగంలో కర్ణాటక తలపెట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేకున్నా కేంద్రప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వబోతోంది. వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో ఉన్నా ఇబ్బంది లేదని రుజువు కాబోతోంది. ఇదే జరిగితే కెసి కెనాల్ విషయమెలా ఉన్నా ఇన్నాళ్లూ రాయలసీమ వాసులు కోరుతున్న తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ పూర్తిగా అటకెక్కుతుంది. దీని ప్రభావం ఉభయ తెలుగు రాష్ట్రాలపై ఉండబోతోంది.

వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయులు

Updated Date - 2021-12-23T05:51:45+05:30 IST