ఏసీబీ ఏం తేల్చింది?

ABN , First Publish Date - 2022-01-20T05:10:02+05:30 IST

నెల్లూరు నగర పాలక సంస్థలోని రెవెన్యూ, సిటీప్లానింగ్‌ విభాగాలు అవినీతిమయంగా మారాయన్న ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గతేడాది ఆగస్టు 18వ తారీఖున కార్పొరేషన్‌ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. వరుసగా మూడు రోజులు ఆ రెండు విభాగాలను ఉక్కిరిబిక్కిరి చేసిన ఏసీబీ అధికారులు అక్కడి ఫైల్స్‌ అన్నిటినీ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి రెండు రోజులు క్షేత్ర స్థాయిలో అక్రమాలను గుర్తించి విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఇదంతా జరిగి ఐదు నెలలు దాటినా ఇప్పటికీ ఏసీబీ నివేదిక ఇవ్వకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలు లేకపోలేదు.

ఏసీబీ ఏం తేల్చింది?

కార్పొరేషన్‌లో అవినీతిపై గతేడాది తనిఖీలు

రెవెన్యూ, సిటీప్లానింగ్‌ ఫైళ్లు స్వాధీనం

ఐదు నెలలుగా సా.....గుతున్న విచారణ 

క్షేత్ర స్థాయిలో అక్రమాలు గుర్తింపు 

మరి నివేదిక ఎప్పుడు?

రాజకీయ జోక్యంపై అనుమానాలు! 


నెల్లూరు(సిటీ), జనవరి 19 : 

నెల్లూరు నగర పాలక సంస్థలోని రెవెన్యూ, సిటీప్లానింగ్‌ విభాగాలు అవినీతిమయంగా మారాయన్న ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గతేడాది ఆగస్టు 18వ తారీఖున కార్పొరేషన్‌ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. వరుసగా మూడు రోజులు ఆ రెండు విభాగాలను ఉక్కిరిబిక్కిరి చేసిన ఏసీబీ అధికారులు అక్కడి ఫైల్స్‌ అన్నిటినీ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి రెండు రోజులు క్షేత్ర స్థాయిలో అక్రమాలను గుర్తించి విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఇదంతా జరిగి ఐదు నెలలు దాటినా ఇప్పటికీ ఏసీబీ నివేదిక ఇవ్వకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. 


అవినీతి ఊడలు

కార్పొరేషన్‌ రెవెన్యూ విభాగంపై క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టగా దిమ్మతిరిగే వాస్తవాలు గుర్తించినట్లు ఐదు నెలల క్రితం ఏసీబీ పేర్కొంది. ఓ ప్రాంతంలో భవనానికి 2012లో సిటీప్లానింగ్‌ వద్ద అనుమతులు తీసుకుని నిర్మించిన యజమాని 2018 వరకు ఇంటి పన్ను లేకుండానే రోజులు గడిపేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతం ఆర్‌ఐ అవినీతి ఏ స్థాయిలోనిదో అవినీతి నిరోధక శాఖ లెక్కకట్టేపనిలోకి వెళ్లింది. ఇక అపార్టుమెంట్ల నిర్మాణంలో అనుమతులు ఉన్నది కొన్ని అంతస్తులకే అయితే అంతకు మించి నిర్మించారని, ఇలాంటి భవంతులు పదుల సంఖ్యలో ఉన్నాయని ఏసీబీ తేల్చింది. దీని వెనుక ఆ ప్రాంత టీపీఎస్‌ (టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్లు) అవినీతి బాగోతాన్ని గుర్తించారు. ఇలా వేగంగా అవినీతిని వెలికితీసిన అధికారులు ఆ తర్వాత విచారణ సా.....గదీస్తూ వచ్చారు. గతేడాది ఆగస్టు 18 నుంచి ఇప్పటి వరకు నివేదికలను తయారు చేయకపోవడం, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకపోవడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


బదిలీలతో సరి... 

 సిటీప్లానింగ్‌ విభాగంలో ముగ్గురు టీపీఎస్‌లు మితిమీరిన అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఆ వివరాలను కార్పొరేషన్‌ ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లింది. దీంతో అప్పట్లో ఆ ముగ్గురు టీపీఎస్‌లను జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలకు బదిలీ చేసిన అధికారులు అంతటితో చేతులు దులుపుకున్నారు. వీరితోపాటు రెవెన్యూలోని కొందరు ఆర్‌ఐలు అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించినప్పటికీ వారిపై కనీస చర్యలు కూడా తీసుకోలేదన్న విమర్శలున్నాయి. వీరంతా మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్సుల్లోని దుకాణాలను వేలం ద్వారా కాకుండా నేరుగా అద్దెలకు కట్టబెట్టారని, నిర్ణయించిన ధరలకు కాకుండా ఇష్టానుసారంగా అద్దెలు వసూలు చేసి కార్పొరేషన్‌ ఖజానాకు గండికొట్టినట్లు ఏసీబీ గుర్తించింది. 


తనిఖీలతో పెరిగిన ఆదాయం 

ఏసీబీ తనిఖీలతో కార్పొరేషన్‌కు ఆదాయం స్వల్పంగా పెరిగింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఖాళీ స్థలం పన్ను (వీఎల్టీ) వసూలు చేయడం లేదని ఏసీబీ బృందం గుర్తించడంతో అప్రమత్తమైన కార్పొరేషన్‌ రెవెన్యూ విభాగం హుటాహుటిన నోటీసులు జారీ చేసి పన్నులు వసూలు చేసింది. ఇలా లక్షల రూపాయలు కార్పొరేషన్‌కు చేరాయి.  దీంతోపాటు వీఎల్టీలు చెల్లించకుండానే నిర్మించిన భవనాల ద్వారానూ భారీగా పన్నులు రాగా, అనుమతులు లేని భవన నిర్మాణాలు, అనుమతులకు మించి కట్టడాలు, భవనాలకు తగ్గ పన్ను వసూళ్లు లేకపోవడంపై ఏసీబీ తనిఖీలతో నోటీసులు జారీ చేసిన మున్సిపల్‌ అధికారులు భారీగా పన్నులు, జరిమానాలు వసూలు చేశారు. అయితే ఏసీబీ తనిఖీలు జరిగి ఐదు నెలలు అవుతున్నా ఇంకా నివేదిక ఇవ్వకపోవడం వెనుక కొందరు టీపీఎస్‌లు, ఆర్‌ఐల ఒత్తిళ్లు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. వారు కొందరు రాజకీయ నాయకులకు ఆదాయ వనరులుగా మారడం వల్లే  వారిపై చర్యలు తీసుకునేందుకు రాజకీయ అడ్డంకులు ఏర్పడినట్లు చర్చ జరుగుతోంది.



Updated Date - 2022-01-20T05:10:02+05:30 IST