అక్కడంతా మామూలే..!

ABN , First Publish Date - 2022-07-07T06:01:05+05:30 IST

ఏసీబీ దాడులు చేసినా.. విజిలెన్స తనిఖీలు చేసినా.. పెనుకొండ ఆర్టీఓ చెక్‌పోస్టులో వసూళ్ల దందా నిరాటంకంగా కొనసాగుతుందన్నది నగ్న సత్యం. తరచూ ఏసీబీ దాడులు జరుగుతున్నా అక్కడ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు.

అక్కడంతా మామూలే..!

ఏసీబీ దాడులు చేస్తున్నా ఆర్టీఓ చెక్‌పోస్టులో ఆగని దందా

కాసేపటికే మళ్లీ వసూళ్లు.. రోజుకు 2 లక్షల కలెక్షన

హిందూపురం టౌన, జూలై 6: ఏసీబీ దాడులు చేసినా.. విజిలెన్స తనిఖీలు చేసినా.. పెనుకొండ ఆర్టీఓ చెక్‌పోస్టులో వసూళ్ల దందా నిరాటంకంగా కొనసాగుతుందన్నది నగ్న సత్యం. తరచూ ఏసీబీ దాడులు జరుగుతున్నా అక్కడ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. ఏసీబీ దాడులు చేసిన ప్రతిసారీ ప్రైవేటు వ్యక్తులు పట్టుబడుతుండడమే ఇందుకు నిదర్శనం. ఏడాదిలో ఒకసారైనా ఈ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు జరుగుతాయి. అయినా అక్కడ పనిచేసే అధికారులు, సిబ్బంది తీరు ఏమాత్రం మారలేదు. అక్రమాదాయం కోసం అధికారులు అర్రులు చాస్తున్నారన్న విమర్శలున్నాయి. ఏసీబీ, విజిలెన్సను వారు ఖాతరు చేయట్లేదు. వసూళ్లే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అక్కడంతా మామూళ్ల పర్వం కొనసాగుతోంది. మంగళవారం రాత్రి ఏసీబీ అధికారులకు పట్టుబడిన నగదును బట్టి చెక్‌పోస్టులో దందా ఏస్థాయిలో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.


ఆగని దందా

పెనుకొండ ఆర్టీఓ చెక్‌పోస్టు రాష్ట్ర సరిహద్దుకు దగ్గరలో ఉంది. దీంతో వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో అధిక శాతం లారీలు వివిధ రకాల వస్తువులను తరలిస్తుంటాయి. చెక్‌పోస్టులో వారికి చేయి తడపకపోతే బండి ముందుకు కదలదు. దీంతో చచ్చినట్లు అక్కడ ఇవ్వాల్సిందే.


కాసేపటికే మళ్లీ..

పెనుకొండ ఆర్టీఓ చెక్‌పోస్టులో మంగళవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఏసీబీ దాడులు కొనసాగాయి. ఏసీబీ అధికారులు.. ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. అయినా బుధవారం ఉదయం విధుల్లో ఉన్న సిబ్బంది షరా మామూలే అన్న చందంగా వచ్చీపోయే వాహనాల నుంచి వసూళ్లు కొనసాగించారు. విలేకరులు అక్కడికి వెళ్లగా.. గుర్తించిన సిబ్బంది.. ఆర్టీఓ కార్యాలయంలోకి డబ్బుతో వస్తున్న డ్రైవర్లను అడ్డుకున్నారు. బయటి నుంచే పంపించేశారు. చెక్‌పోస్టులోకి వెళ్లే డ్రైవర్లు ఎవ్వరూ రికార్డులను చేతపట్టుకెళ్లట్లేదు. చేతుల్లో వంద, రెండొందల నగదుతో వెళ్తున్నారు. ఏసీబీ దాడులు జరిగిన గంటల వ్యవధిలోనే సిబ్బంది.. వాహనాల డ్రైవర్ల నుంచి వసూలు చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.


రోజుకు 2 లక్షలు..? 

ఆర్టీఓ చెక్‌పోస్టు జాతీయ రహదారిపై ఉండటంతో నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఇక్కడ సరుకు, వస్తువులను బట్టి వసూళ్లు చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. లారీ నుంచి రూ.100 నుంచి రూ.500 వరకు గుంజుతారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకోవడం కొసమెరుపు. ఈ లెక్కన ఒక రోజులో రూ.2 లక్షల వరకు వసూలవుతుందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఏసీబీ దాడులను ఖాతరు చేయకుండా అధికారులు, సిబ్బంది వసూళ్ల దందా సాగిస్తుంటారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.


Updated Date - 2022-07-07T06:01:05+05:30 IST