SP Velumani: ఆ పత్రాల్లో ఏముంది?

ABN , First Publish Date - 2022-09-15T14:28:24+05:30 IST

అన్నాడీఎంకే నాయకులు, మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, డాక్టర్‌ సి.విజయభాస్కర్‌ నివాసాలు, వారి అనుచరుల సంస్థల్లో అవినీతి నిరోధక

SP Velumani: ఆ పత్రాల్లో ఏముంది?

- అధికారుల పరిశీలన

- ఏసీబీ దాడుల వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశం

- మా అమ్మ నగలు ఎత్తుకెళ్లారు

- ఏసీబీ అధికారులపై ఎస్పీ వేలుమణి ఆగ్రహం


చెన్నై, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే నాయకులు, మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, డాక్టర్‌ సి.విజయభాస్కర్‌ నివాసాలు, వారి అనుచరుల సంస్థల్లో అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో పట్టుబడిన 436 దస్తావేజుల్లో ఏముందన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆ పత్రాల్లో వేలుమణి(Velumani)తో పాటు  అన్నాడీఎంకేకు చెందిన పలువురు సీనియర్‌ నేతలకు సంబంధించిన ఆస్తుల వివరాలు కూడ వున్నాయంటూ ఏసీబీ వర్గాల నుంచి వెలువడుతున్న సమాచారం ప్రధాన ప్రతిపక్ష పార్టీలో దుమారం రేపుతోంది. నిబంధనలు ఉల్లఘించి ప్రైవేటు వైద్యకళాశాలలకు అనుమతిచ్చారనే ఆరోపణలపై మాజీ మంత్రి విజయభాస్కర్‌(Former Minister Vijaya Bhaskar), ఆయన అనుచరుల నివాసాలు, ప్రైవేటు విశ్వవిద్యాలయం సహా13 ప్రాంతాల్లోనూ, ఎల్‌ఈడీ బల్పుల కొనుగోలు టెండర్లను అనుచరుల సంస్థలకు కేటాయించి ప్రభుత్వానికి రూ.500 కోట్ల మేర నష్టం కలిగించారనే ఆరోపణలపై మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి నివాసం, అనుచరులకు చెందిన సంస్థలు సహా 31 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో విజయభాస్కర్‌కు సంబంధించి 120 దస్తావేజులు, వేలుమణికి సంబంధించి 316 దస్తావేజులు(Documents) స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ వేలుమణి నివాసగృహంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన తనిఖీలలో రూ.32.8 లక్షల నగదు, రూ.1228 గ్రాముల బంగారు నగలు, 10 లగ్జరీల కార్లను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో ఆయన బ్యాంక్‌ ఖాతాలను పరిశీలించగా రెండు లాకర్లను ఉపయోగిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఆ లాకర్ల తాళాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వేలుమణి, విజయభాస్కర్‌ నివాసాల నుండి స్వాధీనం చేసుకున్న పెన్‌డ్రైవ్‌లు, 436 దస్తావేజుల్లో వారిపై అవినీతి ఆరోపణలకు సంబంధించి కీలక ఆధారాలేమైనా దొరుకుతాయేమోనని అధికారులు పరిశీలిస్తున్నారు. 


ఆధారాలు లభించలేదు...

ఏసీబీ అధికారులు తన నివాసంలో నిర్వహించిన తనిఖీల్లో కీలకమైన ఆధారాలేవీ పట్టుబడలేదని మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి పేర్కొన్నారు. ఏసీబీ అధికారులు ఇదివరకే రెండుసార్లు తన నివాసం, అనుచరుల నివాసాలు, కార్యాలయాల్లో దాడులు నిర్వహించారన్నారు. మూడోసారి తన నివాసంలో జరిపిన సోదాల్లో తన తల్లి నగలను తీసుకెళ్లారని చెప్పారు. ఏసీబీ(ACB) అధికారులు చెబుతున్నట్లు భారీగా నగదు కూడా పట్టుబడలేదని, రూ.7100లు మాత్రమే స్వాధీనం చేసుకున్నారని వివరించారు. ఇదే విధంగా మాజీ మంత్రి విజయభాస్కర్‌ కూడా ఏసీబీ తనిఖీలలో ఎలాంటి దస్తావేజులను అధికారులు స్వాధీనం చేసుకోలేదని వివరణ ఇచ్చారు. తన కుటుంబ సభ్యులకు చెందిన స్కూలు సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డులను మాత్రమే స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. కానీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కీలకమైన ఆస్తుల పత్రాలు లభించాయంటూ లీకులిస్తోందని ఆరోపించారు. 

Updated Date - 2022-09-15T14:28:24+05:30 IST