ఏసీబీ వలకు సీతారామపురం తహసీల్దారు

ABN , First Publish Date - 2022-09-29T04:51:03+05:30 IST

సీతారామపురం తహసీల్దారు కాయల సతీ్‌షకుమార్‌ బుధవారం ఏసీబీ వలకు చిక్కారు.

ఏసీబీ వలకు సీతారామపురం తహసీల్దారు
తహసీల్దారును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్న ఏసీబీ అధికారులు



రైతు భూమి మ్యూటేషన కోసం లంచం

రూ.10 వేలు తీసుకుంటుండగా అదుపులోకి.. 


సీతారామపురం, సెప్టెంబరు 28 : సీతారామపురం  తహసీల్దారు కాయల సతీ్‌షకుమార్‌ బుధవారం ఏసీబీ  వలకు చిక్కారు. మండలంలో అయ్యవారిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన బొబ్బా అంకయ్య అనే రైతు తన భూమిని మ్యూటేషన నిమిత్తం తహసీల్దారును సంప్రదించారు. ఇందుకుగాను తనకు రూ.10 వేలు ఇవ్వాలని తహసీల్దారు చెప్పారు. లంచం ఇవ్వడం ఇష్టంలేని అంకయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బుధవారం రూ.10 వేలు నగదు తీసుకొని తహసీల్దారు నివాసం ఉండే గదికి వెళ్లి ఇవ్వగా ఏసీబీ అధికారులు దాడులు  చేసి సతీష్‌కుమార్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. అనంతరం తహసీల్దారును కార్యాలయానికి తరలించి విచారించారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ జీఆర్‌ఆర్‌ మోహన, సీఐలు రమే్‌షబాబు, శ్రీనివాస్‌, వేణు, కిరణ్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


ఆది నుంచీ అంతే!


గతంలో అల్లూరు, సైదాపురం మండలాల్లో తహసీల్దారుగా పని చేసిన సమయంలో సతీ్‌షకుమార్‌ పలు అవినీతి, ఆరోపణలు ఎదుర్కొన్నారు. బుచ్చిలో సీఎస్‌ టీడీగా విధులు నిర్వహిస్తున్న సమయంలో రైస్‌మిల్లు యజమానులతో కుమ్మక్కై పలు అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి. వాటన్నింటిపై కూడా ఏసీబీ అధికారులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ఏసీబీ అధికారులు తహసీల్దారుపై దాడి చేయడంతో నియోజకవర్గంలో చర్చానీయాంశంగా మారింది. 2000లో సైతం స్థానిక తహసీల్దారు కార్యాలయంలోనే ఓ వీఆర్వోపై ఏసీబీ దాడులు జరిగాయి. 22 ఏళ్ల అనంతరం తిరిగి ఏసీబీ దాడులు జరగడం విశేషం. 


రూ.40 వేలు అడిగాడు!


నా భూమి మ్యూటేషన కోసం కొన్ని నెలలుగా తహసీల్దారును సంప్రదించగా ముప్పుతిప్పలు పెట్టారు. రూ.40 వేలు లంచం ఇస్తే చేస్తానని చెప్పారు. చివరకు రూ.10వేలకు ఒప్పందం కుదుర్చుకున్నా. అది కూడా ఇచ్చేందుకు ఇష్టం లేకే ఏసీబీ అదికారులను ఆశ్రయించా.

- బొబ్బా అంకయ్య, రైతు

Updated Date - 2022-09-29T04:51:03+05:30 IST