రాయలచెరువు గండి పూడ్చివేత పనులు వేగవంతం

ABN , First Publish Date - 2021-11-26T06:45:04+05:30 IST

మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువుకట్ట గండి పూడ్చే పనులు రాత్రింబవళ్లు శరవేగంగా జరుగుతున్నాయి.

రాయలచెరువు గండి పూడ్చివేత పనులు వేగవంతం
గండిపూడ్చే పనులు

భయం వీడి గ్రామాలకు చేరుతున్న జనం 


రామచంద్రాపురం, నవంబరు 25: మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువుకట్ట గండి పూడ్చే పనులు రాత్రింబవళ్లు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ చెరువుకు వచ్చే పెద్దేటివంక నీటి ఉధృతి తగ్గడం..రెండు మొరవలతోపాటు నక్కలగండి, కుక్కల గండి తూములనుంచి చెరువులోపల నీరు జోరుగా బయటకు వస్తుండడంతో నాలుగు అడుగుల మేర చెరువునీటి మట్టం తగ్గింది.చెరువుకు గండి పడే ప్రమాదం వుందని ఇల్లూవాకిలి వదిలి బయటూళ్లకు,సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిన ప్రజలు మెల్లమెల్లగా బయల్దేరి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఆదివారం చెరువుకు గండిపడిన నేపథ్యంలో కలెక్టర్‌ హరినారాయణన్‌, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్ని శాఖల అధికారులను సమన్వయపరిచి గండిపూడ్చే పనులు పురమాయించారు. 300మంది కూలీలు, 3ఇటాచీలు, 7జేసీబీలు, 2భారీ క్రేన్లు, గండిపూడ్చే పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. తిరుపతి గరుడవారధి పనులు చేపడుతున్న ఆఫ్కాన్‌ సంస్థ, ఇరిగేషన్‌శాఖ ఇంజనీర్లు గండిపడిన చోట అడుగుభాగం నుంచి ఇసుకబస్తాలు అమర్చుతున్నారు. ఇసుక జారకుండా పైన వైర్‌నెట్‌ ఏర్పాటు చేస్తున్నారు. కట్టజారకుండా ఉండేందుకు ఇండియన్‌ స్టాండెడ్‌ మీడియం బీమ్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. దీనివలన కట్టజారిపోయే ప్రమాదం ఉండదని నిపుణులంటున్నారు.ఆఫ్కాన్స్‌ ఇంజనీర్లు రంగస్వామి, హరిబాబు, హరికృష్ణ, ఇరిగేషన్‌ ఈఈ శివారెడ్డి, డీఈ గురవారెడ్డి పర్యవేక్షిస్తున్న ఈ పనులు రెండు రోజుల్లో పూర్తవుతాయని ఇరిగేషన్‌  ఎస్‌ఈ విజయ్‌కుమార్‌ తెలిపారు.  


జలదిగ్భంధంలో నాలుగు గ్రామాలు 

రాయలచెరువు వరద నీరు ఉప్పొంగడంతో సూరావారిపల్లె, కాలేపల్లె, పీకే పల్లె, రాయలచెరువుపేట గ్రామాలు నాలుగు రోజులుగా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఈ గ్రామాలకు మండల కేంద్రమైన ఆర్సీపురంతో సంబంధాలు తెగిపోయాయి. ఏదైనా అవసరమైతే 15కిలోమీటర్ల దూరంలోని పచ్చికాపల్లం, చంద్రగిరికి వెళ్లాల్సివస్తోంది. ఈ దారుల్లో కూడా వరద నీరు పారుతుండడంతో వెళ్లలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హెలికాప్టర్‌ ద్వారా నిత్యావసరాలను అందజేస్తున్నారు. ఈ ముంపు గ్రామాల సమీపంలో ఉన్న ఎన్నార్‌ కమ్మపల్లె, పుల్లమనాయుడుకండ్రిగ, నెత్తకుప్పం గ్రామాలకు వచ్చే రహదారులు కొట్టుకుపోవడంతో ఎటూ కదలలేని పరిస్థితి ఏర్పడింది. బుధవారం ఈ గ్రామాల ప్రజలు గండిపూడ్చుకుని రాకపోకలను పునరుద్ధరించుకున్నారు. రాయలచెరువు ముంపునకు గురైన గ్రామాల్లో 880కుటుంబాలకు రూ. 2వేల చొప్పున, 106కుటుంబాలకు రూ. వెయ్యి చొప్పున ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, జడ్పీటీసీ ఢిల్లీరాణి భానుకుమార్‌రెడ్డి గురువారం పంపిణీ చేశారు. 

Updated Date - 2021-11-26T06:45:04+05:30 IST