ప్రకృతి వ్యవసాయంలో పరిశోధనలు వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2022-05-20T06:14:49+05:30 IST

ప్రకృతి వ్యవసాయంపై పరిశోధనలను మరింత వేగవంతం చేయాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ వీసీ డాక్టర్‌ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రకృతి వ్యవసాయంలో పరిశోధనలు వేగవంతం చేయండి
సమావేశంలో పాల్గొన్న వీసీ విష్ణువర్దన్‌రెడ్డి, డీఆర్‌ ప్రశాంతి

ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ వీసీ విష్ణువర్ధన్‌రెడ్డి


తిరుపతి(విద్య), మే 19: ప్రకృతి వ్యవసాయంపై పరిశోధనలను మరింత వేగవంతం చేయాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ వీసీ డాక్టర్‌ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వేదికగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి సాంకేతిక సమావేశాల్లో గురువారం ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో పరిశోధనలు వేగవంతం చేయాలని శాస్త్రవేత్తలకు సూచించారు.  ఇందుకోసం ఈ సమావేశాల్లో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో నిపుణులైన శాస్త్రవేత్తలను భాగస్వాములను చేశామని, వారి సలహాలు, సూచనలు స్వీకరించి ఉత్తమ పరిశోధనలు రూపొందించాలని చెప్పారు. రానున్న సంవత్సరకాలంలో చేపట్టనున్న పరిశోధనలకు సంబంధించి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వ్యవసాయవిద్యలో పీజీ, పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థులు చేపట్టే పరిశోధనాంశాలు కూడా నిశితంగా పరిశీలించి.. విషయ నిపుణుల సూచనలతో నిర్మాణాత్మక పరిశోఽధనా అంశాలను రూపకల్పన చేయాలని తెలిపారు. సేద్యవిభాగం, కీటకశాస్త్రం, తెగుళ్ల విభాగాలపై రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ఆయా విభాగాల శాస్త్రవేత్తలు గత ఏడాది జరిగిన పరిశోధనలు, వాటి ఫలితాలను నివేదించారు. రానున్న సంవత్సరంలో చేపట్టాల్సిన అత్యవసర పరిశోధనల ప్రణాళికల రూపకల్పనలపై చర్చించారు. వర్సిటీ డీఆర్‌ డాక్టర్‌ ప్రశాంతి, ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ డాక్టర్‌ రాజశేఖర్‌, శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T06:14:49+05:30 IST