కొంపముంచిన మంచు

ABN , First Publish Date - 2020-12-03T05:21:24+05:30 IST

మంచుతెరలు కొంపముంచాయి. ఓ కుటుంబంలో ఏడు గురిని మింగేశాయి. బోర్‌వెల్స్‌ లారీ రూపంలో వారిని మృత్యువు కబ ళించింది.

కొంపముంచిన మంచు
ఎదురెదురుగా ఢీకొన్న కారు, లారీ.

  • చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. 
  • బోర్‌వెల్స్‌ లారీని ఢీకొన్న కారు.. ఏడుగురు దుర్మరణం, ప్రాణాలతో బయట పడిన నలుగురు 
  • కారులో 11 మంది ప్రయాణం, మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి    
  • తీవ్ర గాయాలతో ఇద్దరు ఉస్మానియాలో చికిత్స
  • మృతులంతా ఒకే కుంటుంబానికి చెందినవారు


తెల్లవారుజామున కురిసే మంచు ఓ కుటుంబానికి చెందిన ఏడుగురి ప్రాణాలను బలిగొన్నది. కుటుంబ సభ్యుల్లో అనారోగ్యంతో ఉన్న ఒకరికి చికిత్స చేయించేందుకు వెళ్తున్న వారిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. ప్రమాదంలో నిద్రలో ఉన్న వారికి ఏమిజరిగిందో తెలిసేలోపే కొందరు అనంతలోకాలకు చేరుకున్నారు. మృతుల్లో నాలుగేళ్ల పాప ఉండటం  సంఘటనా స్థలానికి చేరుకున్న వారిని కంటతడి పెట్టించింది. మృత్యుంజయుడైన మరో బాలుడు కళ్లముందే కుటుంబసభ్యులు రక్తపు మడుగులో పడి ఉండటం చూసి బోరుమన్నాడు.


చేవెళ్ల : మంచుతెరలు కొంపముంచాయి. ఓ కుటుంబంలో ఏడు గురిని మింగేశాయి. బోర్‌వెల్స్‌ లారీ రూపంలో వారిని మృత్యువు కబళించింది. హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయరహదారి బుధవారం తెల్ల వారుజామున రక్తమోడింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే దుర్మ రణం చెందగా, మరొకరి ప్రాణం ఆసుపత్రికి తరలించేలోపు గాల్లో కలిసిపోయింది. చేవెళ్ల మండలం మల్కాపూర్‌, కందవాడ రోడ్డు మలుపు వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ కలచివేసింది. 

హైదరాబాద్‌లోని ఓల్డ్‌సిటీ కాలాపత్తర్‌లోని మక్కా కాలనీకి చెందిన ఎండీ ఆసీఫ్‌ఖాన్‌ భార్య నజీయాబేగం పక్షవాతంతో బాధపడుతోంది. ఆమెను కర్ణాటకలోని గుర్మిట్‌కల్‌ ప్రాంతంలో లభించే చెట్లమందు ఇప్పించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఇన్నోవా కారులో బుధవారం తెల్లవారుజామున 11మందితో బయలుదేరారు. వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు ఓ వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేస్తుండగా మంచు విపరీతంగా ఉండటంతో ఎదురుగా వస్తున్న బోర్‌వెల్స్‌ లారీ కనిపించ లేదు. దీంతో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇన్నోవాలో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరోవ్యక్తి ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతదేహాలు కారులోనే పూర్తిగా ఇరుక్కు పోయాయి. ప్రాణాలతో ఉన్నవారి రోదనలు మిన్నంటాయి. గమనించిన స్థానికులు, వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న చేవెళ్ల సీఐ బాలకృష్ణ 10నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చేవెళ్లకు చెందిన గుత్తి మల్లేష్‌కు సంబంధించిన జేసీబీని రప్పించి కారులో ఇరుక్కున్న వారందరినీ బయటకు తీశారు. తీవ్రగాయాలు అయిన వారిని అంబులెన్స్‌లో ఉస్మానియాకు తరలించారు. మృతదేహాలను పోలీస్‌లు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో తరలించారు. పోస్టు మార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్ప గించారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. 


మృతులంతా ఒకే కుంబానికి చెందినవారే..

రోడ్డుప్రమాదంలో మృతిచెందిన వారంతా హైదరాబాద్‌ ఓల్డ్‌సిటీ తాడ్‌బండ్‌ ప్రాంతంలోని ఒకే కుటుం బానికి చెందిన వారున్నారు. ఇందులో ఎండి ఆసీఫ్‌ఖాన్‌ (46), అతని భార్య నజియాబేగం(40), కూతురు మెహక్‌ సానియా(18), అతని చెల్లెలు నజియా భాను (30), హర్షియా బేగం (28), ఈమె కూతురు ఆశాభాను (04) పాప అక్కడికక్కడే మృతి చెందారు. ఆసీఫ్‌ఖాన్‌ బావ ఎండీ ఖాలేద్‌ (43) ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఆసీఫ్‌ఖాన్‌ చిన్న తమ్ముడు అన్వర్‌ఖాన్‌ (36)తో నజియాభాను కొడుకు నషీర్‌బేగ్‌ (11) కారులో వెనుక సీటులో కూర్చో వడంతో ఎలాంటి గాయాలు కాకుండా ప్రాణాలతో బయటపడ్డారు. మృ తుల్లో 4 సంవత్సరాల చిన్నారి పాప ఉండటం చూపరులను కంటతడి పెట్టించింది. అయితే పక్షవాతంతో బాధపడుతున్న నజియాబేగం(40) సైతం రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అయితే ఈ విషయం తెలుసుకుని తాడ్‌బండ్‌ నుంచి మృతుల కుటుంబ సభ్యులు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బోరుమని రోధించారు. 


క్షతగాత్రులు ఇద్దరే..

రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన వారిలో ముగ్గురు కాగా ఇందులో ఒకరు ఖాలేద్‌ ఆసు పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మరో ఇద్దరు తయ్యబ్‌ అలీబేగం, అయాన్‌ ఖాన్‌కు కాళ్లు విరిగి తీవ్రరక్తస్రావం అవుతుండటంతో ఉస్మానియా ఆసు పత్రికి తరలించారు. 


మృత్యుంజయులు..

కారు వేగంతో ముందుకు దూసు కె ళ్తుంది. ఇంకా తెలవారకపోవడంతో కారులో కుటుంబసభ్యులంతా నిద్రలోకి జారుకున్నారు. ఇదే సమయంలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. కారు ముందు భాగమంతా నుజ్జునుజ్జు కావడంతో ఫ్రంట్‌లో కూర్చున్న వారంతా దుర్మరణం పాల య్యారు. వెనక కూర్చున్న ఇద్దరు (నషీర్‌బేగ్‌, అన్వర్‌ ఖాన్‌) బతికి బయటపడ్డారు. వీరికి ఎలాంటి గాయాలు కాలేదు. బోర్‌వెల్‌ లారీని ఢీకొన్న సమ యంలో భారీ శబ్ధం రావడంతో ఉలిక్కి పడి లేచి చూసే సరికి కుటుంబ సభ్యులంతా రక్తపు మడుగులో పడి ఉన్నారు. తల్లి మృతదేహం చూసి బాలుడు సంఘటన స్థలంలోనే బోరున విలపించాడు. 


మూలమలుపే ప్రమాదానికి కారణం

హైదరాబాద్‌ - బీజాపూర్‌ జాతీయ రహదారిపై ఉన్న మూల మలుపు ఉండటంతోనే రోడ్డు ప్రమా దం జరిగిందని పోలీసులు భావిస్తు న్నారు. అయితే తెల్లవారుజామున కురు స్తున్న మంచుతో ఎదురుగా వస్తున్న వాహ నాలు సరిగ్గా కనిపించకపోవడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని పోలీస్‌లు అనుమానిస్తున్నారు. ఇదే స్థలంలో గతంలో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. 


ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ

చేవెళ్ల మండలంలోని కందవాడ, మల్కాపూర్‌ స్టేజీల వద్ద  జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, సైబారాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌, చేవెళ్ల సీఐ బాలకృష్ణతో కలిసి సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను సీఐని అడిగి తెలుసుకున్నారు. రోడ్డు మూల మలుపులను సరిచేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులతో డీసీపీలు ఫోన్‌లో మాట్లాడారు. రోడ్డుపై రేడియమ్స్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అయితే మల్కాపూర్‌ గ్రామసర్పంచ్‌ శేరి శివారెడ్డి డీసీపీల సమక్షంలోనే రోడ్డు మూలమలుపు వద్ద ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. 


 ప్రమాదంపై కలెక్టర్‌ ఆరా..

చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుం బానికి చెందిన ఏడుగురు మృతి చెందడం బాధాకరమని జిల్లా కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం అతి వేగంగా డ్రైవ్‌ చేయడంతోనే జరిగిందని వాపో యారు. హైదరాబాద్‌ - బీజాపూర్‌ జాతీయ రహదారి రోడ్డు విస్తరణ కోసం ఆర్‌అండ్‌బీ అధికారుల నుంచి భూసేకరణ కోసం అలాట్‌మెంట్‌ రాగానే రోడ్డు విస్తరించేందుకు ప్రభుత్వానికి నివే దిక అందిస్తామని కలెక్టర్‌ తెలిపారు. 


మృతుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పరామర్శ

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పరామర్శించారు. బుధవారం మధ్యాహ్నం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని పోస్టుమార్టం గదిలో ఉన్న మృతదేహాలను పరిశీలించారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందని సీఐని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదం చాలా బాధాకరమ న్నారు. ఆయన వెంట ఎంపీపీ విజయలక్ష్మి, నాయకులు ఉన్నారు. 


పాపం పసివాడు..

పాపం పసివాడు.. నిద్ర నుంచి లేచేసరికి తల్లి నజియాభాను, చెల్లి ఆశాభాను చనిపోయి ఉంది. కారులో ఇరుక్కుపోయిన మృత దేహాలను కళ్లముందే బయటకు తీస్తుండటం... కుటుంబ సభ్యులంతా రక్తపు మడుగులో విగతజీవుల్లా పడి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు. తల్లి, చెల్లిని చూసి వెక్కివెక్కి ఏడ్చాడు. బాబు కన్నీటిని చూసిన వారంతా అయ్యో పాపం అంటూ కంట తడి పెట్టుకున్నారు. 


కిలోమీటర్‌ దూరంలో మరో ప్రమాదం..

ఆర్‌టీసీ బస్సు - బైక్‌ ఢీకొనడంతో ఓ యువకుడు అక్క డికక్కడే మృతిచెందిన సంఘటన బుధ వారం రాత్రి 7-30గంటలకు చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ముడి మ్యాల్‌ స్టేజీ సమిపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చేవెళ్ల మండల పరిధిలోని ఉరెళ్ల గ్రామానికి చెందిన గడ్డమీది సంజీవయ్య కొడుకు సునీల్‌కుమార్‌ (26) నగరం లోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో అంబులెన్స్‌ డ్రైవర్‌గా పని చేస్తు న్నాడు. అయితే నిత్యం బైక్‌పై అతను రాకపోకలు సాగిస్తున్నాడు. అయితే రోజు మాదిరిగానే బుధవారం సాయంత్రం విధులు ముగిం చుకుని ఇంటికి తిరిగి బైక్‌పై వస్తున్నాడు. మార్గమధ్యలో ముడిమ్యాల్‌ స్టేజీ సమీపంలో పరిగి డిపోకు చెందిన ఆర్‌టీసీ బస్సు హైదరాబాద్‌ వైపు వస్తూ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో సునీల్‌ కుమార్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చేవెళ్ల పోలీస్‌లు ఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే బుధవారం ఉదయం బోర్‌వెల్స్‌ లారీ, ఇన్నోవా కారు ఢీకొన్న ప్రమాద స్థలానికి కిలోమీటర్‌ దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఒక్కరోజే ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల ద్వారా ఎనిమిది మంది మృత్యువాత పడటం పట్ల మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-12-03T05:21:24+05:30 IST