కబళించిన మృత్యువు

ABN , First Publish Date - 2020-12-04T04:59:38+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌తో మానేసిన ఉద్యోగ పీఎఫ్‌ డబ్బుల కోసం దరఖాస్తు చేసుకుని వస్తున్న వ్యక్తిని ప్రమాదం కబళించింది.

కబళించిన మృత్యువు
ప్రమాదంలో మృతి చెందిన నాగేశ్వరరావు

చిలుకూరు/హుజూర్‌నగర్‌,  డిసెంబరు 3: కరోనా లాక్‌డౌన్‌తో మానేసిన ఉద్యోగ పీఎఫ్‌ డబ్బుల కోసం దరఖాస్తు చేసుకుని వస్తున్న వ్యక్తిని ప్రమాదం కబళించింది. చిలుకూరు  మండలం సీతారామపురం గ్రామశివారులో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు, శ్రీనివాసాపురం గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం హుజూర్‌నగర్‌ మండలం శ్రీనివాసాపురం గ్రామానికి చెందిన కుక్కడపు నాగేశ్వరరావు(35) హైదరాబాద్‌ ఉప్పల్‌లో హెరిటేజ్‌ సంస్థలో పనిచేశాడు. లాక్‌డౌన్‌ కారణంగా నాగేశ్వరరావు ఏడు నెలల కిందట ఉద్యోగం మానేసి కుటుంబంతో స్వగ్రామానికి వచ్చి వ్యవసాయం చేస్తున్నాడు. ఉద్యోగం చేసిన సంస్థ నుంచి రావాల్సిన పీఎఫ్‌ డబ్బుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు బుధవారం మఽధ్యాహ్నం బైక్‌పై కోదాడకు వెళ్లాడు. తిరిగి వస్తూ రోడ్డువిస్తరణలో భాగంగా చిలుకూరు మండలం సీతారామపురం శివారులో కల్వర్టు నిర్మాణం వద్ద ఏర్పాటుచేసిన డైవర్షన్‌ రోడ్డును గమనించకుండా వెళ్లి గోతిలో పడిపోయాడు. నాగేశ్వరరావును ఎవరూ గమనించలేదు. ఆ రాత్రి నాగేశ్వరరావు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు గ్రామస్థుల సహకారంతో వెతకడం ప్రారంభించారు. గోతిలో పడిఉన్న నాగేశ్వరరావును గురువారం వారు గుర్తించారు. అప్పటికే ఆయన మృతి చెంది ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నాగేశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నాగేశ్వరరావుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రోడ్డు డైవర్షన్‌ వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతోనే తన భర్త మృతి చెందాడని భార్య అజయ్‌శ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలుకూరు ఎస్‌ఐ నాగభూషణ్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

శ్రీనివాసాపురంలో విషాదఛాయలు
అందరితో కలివిడిగా ఉండే నాగేశ్వరరావు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో స్వగ్రామం శ్రీనివాసాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. నాగేశ్వరరావు మృతదేహానికి సర్పంచ్‌ రమ్య, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్‌ చావా వీరభద్రావు, పారేపల్లి శ్రీనివాసరావు నివాళులర్పించి మాట్లాడారు. నాగేశ్వరరావు పేదవాడని, ముగ్గురు ఆడపిల్లలు ఉన్న ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. 

Updated Date - 2020-12-04T04:59:38+05:30 IST