కూలీలు బుగ్గి

ABN , First Publish Date - 2022-07-01T07:57:02+05:30 IST

కూలీలు బుగ్గి

కూలీలు బుగ్గి

ఆటోపై తెగిపడిన ‘మృత్యు’ వైరు

ఐదుగురు మహిళల సజీవదహనం

ఆరుగురికి తీవ్ర గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

విద్యుదాఘాతానికి ఒక్కసారిగా రేగిన మంటలు

వేరుశనగ పొలంలో పనులకు వెళుతున్న కూలీలు

కాలిబుగ్గైన వారి చేతుల్లోనే భోజనం క్యారియర్లు

మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు 

శ్రీసత్యసాయి జిల్లా చిల్లకొండయ్యపల్లి వద్ద ఘోరం

సీఎం జగన్‌ దిగ్ర్భాంతి..10 లక్షల చొప్పున పరిహారం


ఒక ముద్ద గొంతులో కుక్కుకొని, మధ్యాహ్నానికి భోజనం క్యారియర్‌లో సర్దుకుని హడావుడిగా పొలం పనులకు బయలుదేరారు. ఎండ నెత్తిమీదకు వచ్చేసరికి చాలావరకు పని ముగించేయాలని పొద్దుపొడిచేవేళకే మొత్తం 11 మంది కూలీలు ఇళ్లు విడిచారు. ఆ తర్వాత అరగంట వ్యవధిలోనే మృత్యువు రూపంలో తెగిపడిన హైటెన్షన్‌ వైరు వారిలో ఐదుగురిని కబళించింది. గంటకుపైగానే భగభగమంటున్న మంటల్లో గుర్తుపట్టలేనివిధంగా మృతదేహాలు కాలిపోయాయి.


ధర్మవరం/తాడిమర్రి, జూన్‌ 30: కూలి పనులు చేసుకుని పొట్టపోసుకునే కుటుంబాలు వారివి. తెల్లవారుజామున అన్నం వండుకుని వేరుశనగ పొలంలో కలుపుతీత పనులకు వెళుతుండగా, వారి ఆటోపై కరెంటు వైరు ‘మృత్యువై’ తెగిపడింది. నిత్యం చెమటోడ్చే శరీరాలు ఆ విద్యుదాఘాతానికి భగభగ మండగా, ఐదుగురు మహిళలు సజీవ దహనమయ్యారు. ఆటో నుంచి దూకి ఆరుగురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద గురువారం ఉదయం 6.30 గంటల సమయంలో చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో తాడిమర్రిలోని పెద్దకోట్ల గ్రామానికి చెందిన రైతు కుమారి(30), గుడ్డంపల్లికి చెందిన కూలీలు కొంకా కాంతమ్మ(50), కొంకా లక్ష్మీదేవి(42), కొంకా రత్నమ్మ(50), కొంకా రామలక్ష్మీ(38) సజీవ దహనమయ్యారు. కుమారిని తప్పిస్తే, మిగిలిన నలుగురు మహిళలు ఒకే కుటుంబానికి చెందినవారు. కొంకా గాయత్రి, కొంకా శివరత్నమ్మ, కొంకా రమాదేవి, కొంకా నాగేశ్వరమ్మ, కొంకా రత్నమ్మ, కొంకా అరుణ, ఆర్వేటి ఈశ్వరమ్మ ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో గాయత్రి పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు తరలించారు. మిగిలినవారు అనంతపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఇక... కాలిబూడిదైన మృతదేహాలను ప్రత్యేక ట్రాక్టర్‌లో ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.  ఘటనా స్థలాన్ని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరామ్‌, మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ, జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌ కుమార్‌ పరిశీలించారు. ఈ ఘటన ఉడత మూలంగా జరిగిందని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ హెచ్‌ హరినాథరావు ప్రకటించారు. చిల్లకొండయ్యపల్లి ఘోర దుర్ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న సీఎంకు ఈ ఘటన వివరాలను అధికారులు తెలియచేశారు. కూలీల మృతిపట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యసేవలందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించారు. 


పొద్దు పొడిచేవేళ...

తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామానికి చెందిన కుమారి(30) కుటుంబం ఖరీఫ్‌ సీజన్‌లో బోరు నీటి కింద మూడు ఎకరాల్లో ముందస్తుగా వేరుశనగ సాగు చేసింది. ఈ పొలంలో కలుపు తీత పనులకోసం గుడ్డంపల్లిలోని కొంకా కుటుంబానికి చెందిన పది మందిని, ఆర్వేటి కుటుంబానికి చెందిన ఒకరిని కూలికి ఆమె మాట్లాడుకుంది. కునుకుంట్ల గ్రామానికి చెందిన పోతులయ్య ఆటోలో వీరందరినీ పిలుచుకువెళ్లేందుకు కుమారి ఉదయం ఆరుగంటల సమయంలో గుడ్డంపల్లికి వచ్చింది. వర్షాకాలంలో పొలంలో కాపలాదారులు తలదాచుకునేందుకు తయారుచేయించిన ఐరన్‌ గ్రిల్‌ ఆటోపై అమర్చిఉంది. మొత్తం 11 మంది కూలీలతో కలిసి పొలానికి ఆమె బయలుదేరింది. గుడ్డంపల్లికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో చిన్నకోట్ల వద్ద వేరుశనగ పొలం ఉంటుంది. మరో 300 మీటర్ల దూరం ప్రయాణిస్తే పొలంలో అందరూ దిగేవారు. అంతలోనే అనుకోని విపత్తు ఎదురైంది. బత్తలపల్లి-పులివెందుల రోడ్డులో చిల్లకొండయ్యపల్లి వద్దకు రాగానే వారి ఆటోపై 11/33 కేవీ హైటెన్షన్‌ విద్యుత్‌ వైరు తెగిపడింది. ఆటో వెనుక భాగాన కూర్చున్నవారు షాక్‌కు గురయ్యారు. క్షణాల్లోనే మంటలు చెలరేగాయి. ఆటో డ్రైవర్‌ పోతులయ్య కిందకు దూకేశాడు. తన వద్ద ఉన్న టవల్‌తో ముగ్గురు కూలీలను బయటకు లాగాడు. మరికొందరు ఆటో నుంచి దూకేశారు. ఈలోగా మం టలు భారీగా వ్యాపించాయి. వెనుక కూర్చున్న ఐదుగురు అప్పటికే మంటల్లో విలవిలలాడుతూ ప్రాణాలు విడిచారు. దాదాపు గంటపాటు ఆటో, ఐదుగురి శరీరాలు కాలుతూనే ఉన్నాయి.  


దగ్గరకు వెళ్లలేక..

ఆటో తగలబడటం చూసి సమీప తోటల్లో ఉన్న రైతులు పరుగు పరుగున అక్కడకి వెళ్లారు. ఆటోపై విద్యుత్‌ వైరు పడిఉండటం, మంటలు ఎగిసిపడుతుండటంతో దగ్గరికి వెళ్లేందుకు సాహసం చేయలేకపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పెట్రోల్‌ బంకు వద్ద నుంచి అగ్నిమాపక పరికరాన్ని తెచ్చి వినియోగించినా మంటలు అదుపులోకి రాలేదు. రైతులు పొలాలకు మందు స్ర్పే చేసే ట్రాక్టర్‌ను తెచ్చి నీరు కొట్టడంతో మంటలు ఆగాయి. 


కొక్కెం తగులుకుందా?

విద్యుత్‌ వైరు తెగిపడిపోవడానికి ఉడత కారణమని విద్యుత్‌ శాఖ అధికారులు అంటున్నారు. ప్రమాద స్థలానికి సుమారు 20 అడుగుల దూరంలో స్తంభం వద్ద ఉన్న ఉడత కళేబరాన్ని చూపించి, ప్రమాదానికి అదే కారణమని చెబుతున్నారు. కానీ దీనిపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మంటలు అదుపులోకి వచ్చిన అనంతరం చూస్తే ఆటోపై తెగిపడిన విద్యుత్‌ వైరు చివరి కొసలో కొక్కెం కనిపించింది. ఇది ఆటోపై ఉన్న గ్రిల్‌కు తగులుకుని ఉంది. ఆటో ప్రయాణించే సమయంలో విద్యుత్‌ వైర్లు పడినందున.. ఆటో ముందుకు వెళ్లే క్రమంలో తెగిపడిన విద్యుత్‌ వైరు జారిపోయేది. కానీ కొక్కెం తగులుకోవడంతో అలాగే ఉండిపోయింది. ఒకవేళ ఉడత కారణంగా విద్యుత్‌ వైరు తెగిపోతే, దాని చివరి కొసకు కొక్కీ ఉండే అవకాశం లేదు. కాగా, విద్యుత్‌ వైరుకు మొదట కనిపించిన కొక్కెం..తరువాత మాయం కావడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. .


కాలిన చేతిలోనే క్యారియరు

అగ్నికి ఆహుతైనవారి మృతదేహాలు గుర్తుపట్టడానికి వీలులేకుండా ఉన్నాయి. కొందరి శరీరాలు సగం మాత్రమే మిగిలి, బొగ్గును తలపించాయి. మండుతున్న మృతదేహాలపై నీరు కొట్టడంతో అవి ఒక్కసారిగా పేలిపోయి, పక్కనున్నవారిపైకి చిట్లాయి.. కుటుంబ సభ్యులు కూడా తమవారి మృతదేహాలను గుర్తించలేకపోయారు. కొన్ని మృతదేహాల చేతుల్లో భోజనం క్యారియర్లు అలాగే కనిపించాయి. ఓ మహిళ చెయ్యి క్యారియర్‌కు అతుక్కుని, తెగి పక్కన పడి అగ్నికి ఆహుతైంది. ఈ భీతావహ దృశ్యాలను చూడలేకి జనం దూరంగా వెళ్లి నిలబడ్డారు.


50 లక్షలు ఇవ్వాల్సిందే..

బాధితులను పరామర్శించిన అనంతరం తాడిమర్రిలోని విద్యుత్‌ శాఖ కార్యాలయం వద్దకు బాధిత కుటుంబ సభ్యులు, కమ్యూనిస్టు పార్టీ నాయకులతో కలిసివెళ్లి టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ ధర్నా చేశారు. మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం, కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాగా, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రటించిన పరిహారం చాలదని, రూ. 50 లక్షలు చొప్పున అందించాలని టీడీపీ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ మృతుల గ్రామం గుడ్డంపల్లికి వెళ్లి వారి కుటుంబాలకు రూ.20 వేలు చొప్పున సాయం అందించారు.


నా పిల్లలకు దిక్కెవరమ్మా..!

గుడ్డంపల్లికి చెందిన కిష్టయ్య గొర్రెల కాపరి. కూలి పనులకు వెళ్లిన ఆయన భార్య రత్నమ్మ సజీవదహనమైంది. ఆమె మృతదేహాన్ని చూసి సంఘటనా స్థలంలో కిష్టయ్య గుండెలు పగిలేలా ఏడ్చాడు. ‘‘అయ్యో ఎంత ఘోరం జరిగిపోయిందే..! నా కుటుంబానికి దేవుడు అన్యాయం చేశాడే.. ఇద్దరు కొడుకులున్నా.. ఒకడికి ఆరోగ్యం సరిగా లేదు. మరొకడు వికలాంగుడు. నేను గొర్రెలు కాయడానికి వెళితే, నా భార్య కూలిపనులకు వెళ్లి వచ్చి పిల్లల బాగోగులను చూసుకునేది. ఇంక నా పిల్లలకు దిక్కెవరమ్మా..’’ అని కన్నీటిపర్యంతమయ్యారు. 


దిక్కుతోచలేదు..

‘‘ఈ రోజు మేం ప్రాణాలతో ఉన్నామంటే దేవుడి దయవల్లె. ఆటోలో ఒక్కసారిగా షాక్‌ తగలడంతో ఏం జరుగుతున్నదో మాకు దిక్కుతోచలేదు. గట్టిగా అరుచుకుంటూ ఆటోలో నుంచి దుకేశాం’’ - శివరత్నమ్మ


అంతా క్షణాల్లోనే..

‘‘క్షణాల్లో అంతా జరిగిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఆటోలో వెనుక నుంచి మంటలు లేశాయి. భయంతో కిందకు దూకేశాను. కొద్దిసేపు నాకు స్పృహకూడా రాలేదు. తేరుకునేలోపు మా వాళ్లు మంటల్లో కాలిపోతున్నారు’’ - ఆర్వేటి ఈశ్వరమ్మ


ఏం జరుగుతోందో అర్థం కాలేదు

కొద్ది దూరం పోతే పొలంలోకి వెళ్లేవాళ్లం. కరెంటు తీగ ఆటోమీద పడినట్టు కూడా తెలియదు. షాక్‌ తగలడంతో అరుస్తూ, ఆటోలో నుంచి కిందకు దూకేశాం. - కొంకా రమాదేవి


కళ్లముందే కాలిపోయారు

‘‘ఈ రోజు మాకు చాలా చెడ్డరోజు. మావాళ్లు మాకళ్లముందే కాలిబూడిదయ్యారు.  ఎంత అన్యాయం జరిగిపోయిందో! మాలో కొంతమంది మాత్రం ధైర్యంతో ఆటోలో దుంకి ప్రాణాలు కాపాడుకున్నాం’’ - నాగేశ్వరమ్మ



Updated Date - 2022-07-01T07:57:02+05:30 IST