ఆగివున్న లారీని ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు

ABN , First Publish Date - 2022-08-19T05:18:52+05:30 IST

చిలమత్తూరు మండలంలోని కోడూరు చెరువు కాలువ సమీపాన 44వ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఆగివున్న లారీని ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టడంతో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఆగివున్న లారీని ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు

11 మందికి గాయాలు

చిలమత్తూరు/హిందూపురం అర్బన, ఆగస్టు 18: చిలమత్తూరు మండలంలోని కోడూరు చెరువు కాలువ సమీపాన 44వ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఆగివున్న లారీని ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టడంతో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటకలోని చిక్కబళాపురం నుంచి టమోటా లోడుతో బుధవారం రాత్రి ఓ లారీ హైదరాబాద్‌కు బయల్దేరింది. అర్ధరాత్రి సమయానికి కొడికొండ చెక్‌పోస్టు దాటుకుని, 44వ జాతీయ రహదారిపై కోడూరు చెరువు కాలువ సమీపంలోకి రాగానే ముందు టైర్‌ పంక్చరైంది. దీంతో డ్రైవర్‌.. రోడ్డుపైనే ఆపేశాడు. ఎక్సెల్‌ రైడర్స్‌ పేరుగల ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు 30 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బయల్దేరింది. ఆగివున్న లారీని డ్రైవర్‌ గుర్తించలేక వెనుక నుంచి ఢీకొట్టాడు. బస్సు ఎడమవైపు భాగం నుజ్జునుజ్జయింది. బస్సులో ఉన్న ప్రయాణికులు సీట్లలో నుంచి కిందపడ్డారు. ప్రమాదంలో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సులోని వారు 100 నెంబర్‌కి కాల్‌ చేయడంతో స్థానిక పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను మూడు 108 వాహనాల్లో హిందూపురం ఆస్పత్రికి తరలించారు. కేరళకు చెందిన రాకేష్‌ నడుము, కాళ్లు విరగడంతో మెరుగైన వైద్యం నిమిత్తం బెంగళూరుకు రెఫర్‌ చేశారు. బస్సు అదనపు డ్రైవర్‌ రామ్మోహనరావు, క్లీనర్‌ హుసేనపీరా, చిన్నారి సాయి కాళ్లు విరిగాయి. మరికొంతమందికి స్వల్పగాయాలయ్యాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.


రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

మనవరాలికి తీవ్రగాయాలు.. 

బాధితులు కర్ణాటకవాసులు

తనకల్లు, ఆగస్టు 18: మండలంలోని చీకటిమానుపల్లి సమీపాన గురువారం సాయంత్రం బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో కర్ణాటకకు చెందిన దంపతులు అంజప్ప (47), శంకరమ్మ (42) మృతిచెందారు. వారి మనవరాలు తేజశ్వినికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రంలోని మరసనపల్లికి చెందిన అంజప్ప పంపు ఆపరేటర్‌గా పనిచేస్తుండేవాడు. భార్య శంకరమ్మ, మనవరాలు తేజశ్వినితో కలిసి తన కుమార్తెను చూసేందుకు తనకల్లు మండలంలోని తొట్లిపల్లికి వచ్చారు. తిరిగి స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో బయల్దేరారు. నల్లచెరువు మండలంలోని తవళం మర్రి గ్రామానికి చెందిన రాఘవేంద్ర కారు మదనపల్లి నుంచి కదిరి వైపు వస్తూ దిచక్రవాహనాన్ని చీకటిమానుపల్లి సమీపాన ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన శంకరమ్మ, తేజశ్వినిని 108 వాహనంలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరో 108 వాహనంలో ఆంజప్పను తనకల్లు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం నిమిత్తం అతడిని కూడా కదిరికి తరలించారు. కదిరిలో చికిత్స పొందుతూ శంకరమ్మ మృతిచెందింది. అంజప్పను బెంగళూరు తరలిస్తుండగా.. మార్గమధ్యంలో చనిపోయాడు. చిన్నారి తేజశ్వినికి కాలు విరిగింది. కదిరి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఎస్‌ఐ రాంభూపాల్‌ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Updated Date - 2022-08-19T05:18:52+05:30 IST