విషాదం!

ABN , First Publish Date - 2022-05-26T06:38:59+05:30 IST

రెండు వేర్వేరు చోట్ల బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

విషాదం!

రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం

బాపట్ల జిల్లాలో ఇద్దరు, అంబారుపేట వైజంక్షన్‌లో ఇద్దరు మృతి

రెండు వేర్వేరు చోట్ల బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు గాయాలపాలయ్యారు. బాటప్ల జిల్లా మేదరమెట్ల వద్ద రెండు వాహనాలు ఢీకొని వీరులపాడు మండలం జుజ్జూరుకు చెందిన ఇద్దరు మృతిచెందారు. నందిగామ మండలం అంబారుపేట వైజంక్షన్‌ వద్ద ఆటో ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు దుర్మరణం చెందారు. డ్రైవర్ల నిద్రమత్తు, నిర్లక్ష్యమే ఈ ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది.  

వీరులపాడు, మే 25 : బాపట్ల జిల్లా మేదరమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరులపాడు మండలంలోని జుజ్జూరు గ్రామానికి చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మండలంలోని పెద్దాపురానికి చెందిన డీఎంఆర్‌ పౌలీ్ట్ర వాహనం కోళ్ల లోడుతో వస్తోంది. మేదరమెట్ల సమీపానికి రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి మరొక వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో జుజ్జూరు గ్రామానికి చెందిన డ్రైవర్‌ పత్తిపాటి రాజు (39) క్లీనర్‌ గుంజి శివ వీరయ్య (42) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెద్దాపురానికి చెందిన సూపర్‌వైజర్‌ ఇంజమూరి రాంబాబుకు స్వల్ప గాయాలయ్యాయి. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజుకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. తల్లి నాగరత్నమ్మ కూడా అతనిపైనే ఆధారపడి జీవిస్తోంది. శివవీరయ్యకు భార్య ఇద్దరు కుమార్తెలున్నారు. ఈయన తాపీ మేస్ర్తీగా పని చేసేవాడు. పనులు సరిగా లేకపోవటంతో కుటుంబ జీవనం సాగక పౌలీ్ట్ర వాహనం క్లీనర్‌గా వెళుతున్నాడు. మృతదేహాలను పంచనామా అనంతరం అద్దంకి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  

  నందిగామ రూరల్‌ : మండలంలోని అంబారుపేట వైజంక్షన్‌ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఒకరికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన వల్లిపర్ల అనిల్‌ (25), బండికళ్ల ప్రసన్నకుమార్‌ (18), పెనమలూరు మండలం యనమలకుదురుకు చెందిన డ్రైవర్‌ తుమ్మల అర్జునరావు  తెలంగాణాలోని కోదాడలో సువార్త కార్యక్రమానికి లైటింగ్‌ పనులు ముగించుకుని సామగ్రితో ట్రాలీఆటోలో తిరిగి స్వగ్రామం వెళుతున్నారు. అనిల్‌, ప్రసన్నకుమార్‌ ఆటో వెనుక సామగ్రిపై కూర్చున్నారు. ఆటోడ్రైవర్‌ నిద్రమత్తులో అంబాపురంపేట వైజంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టడంతో ఆటో పల్టీకొట్టింది. ఈ ఘటనలో అనిల్‌, ప్రసన్నకుమార్‌ తలలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అర్జునరావుకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సురేష్‌ ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనిల్‌కు భార్య, కుమారుడున్నారు. భార్య మౌనిక గర్భవతి. ప్రసన్నకుమార్‌కు వివాహం కాలేదు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కనకారావు తెలిపారు.  



Updated Date - 2022-05-26T06:38:59+05:30 IST