ప్రమాద హెచ్చరిక

ABN , First Publish Date - 2022-03-03T10:07:03+05:30 IST

సరిగ్గా యుద్ధకాలంలో విడుదలైన కీలకమైన పర్యావరణ నివేదిక ఒకటి ప్రపంచానికి ప్రమాదం తీవ్రస్థాయిలో పొంచి ఉన్నదనీ, కొన్ని అంశాల్లోనైతే పరిస్థితులు చేజారిపోయాయనీ...

ప్రమాద హెచ్చరిక

సరిగ్గా యుద్ధకాలంలో విడుదలైన కీలకమైన పర్యావరణ నివేదిక ఒకటి ప్రపంచానికి ప్రమాదం తీవ్రస్థాయిలో పొంచి ఉన్నదనీ, కొన్ని అంశాల్లోనైతే పరిస్థితులు చేజారిపోయాయనీ హెచ్చరిస్తోంది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో, 67 దేశాలకు చెందిన 270మంది శాస్త్రవేత్తలు తయారుచేసిన నివేదిక ఇది. వాతావరణమార్పులను అధ్యయనం చేసి, ఆచరణను సూచించే ‘ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్’ (ఐపీసీ‍సీ) ఈ నివేదికలో ప్రపంచంలో నలభైశాతం జనం డేంజర్‌లో ఉన్నారని హెచ్చరించింది. ప్రకృతి బీభత్సాలనూ ఉత్పాతాలనూ సినిమాల్లో చూసి ఆనందించే మన కళ్ళముందుకు అటువంటి పరిస్థితులు రాబోతున్నాయని అర్థం. పర్యావరణ సంక్షోభాన్ని అధ్యయనం చేయడం ఆరంభించిన ముప్పయ్యేళ్ళకాలంలో ఐపీసీసీ నుంచి ఇంతటి తీవ్రమైన హెచ్చరికలు వెలువడటం ఇదే మొదటిసారి. 


వాతావరణ మార్పువల్ల సమస్త జీవరాశికీ ముప్పుముంచుకొస్తున్నదనీ, వరదలూ వడగాలులూ కరువుకాటకాలతో సహా పలు ప్రమాదాలు తప్పవని నివేదిక చెబుతోంది. రాబోయే రెండుదశాబ్దాల కాలంలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఒకటిన్నర డిగ్రీలకంటే పెరగకుండా అదుపుచేయాలని ప్యారిస్ ఒప్పందంలో అనుకొన్న విషయం తెలిసిందే. పర్యావరణ పరిరక్షణకు ఇలా ఎంతో చేస్తున్నామని సంబరపడుతున్న తరుణంలో ఈ నివేదిక మరో నగ్నసత్యాన్ని చెప్పింది. యావత్ మానవాళి చేయీచేయీ కలిపి సదరు లక్ష్యాన్ని నెరవేర్చగలిగినా, జరగాల్సిన నష్టం జరిగిపోక తప్పదట. ఒకటిన్నర డిగ్రీల లక్ష్యాన్ని సాధించినా జీవజాతుల్లో 14శాతం కోల్పోవలసిందేననీ, అది కూడా లేకుంటే విధ్వంసం రెట్టింపు ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు తాత్కాలికంగా హెచ్చినా పర్యావరణంమీద దిద్దుకోలేనంత ప్రభావం ఉంటుంది. వరదలు, కరువులు, వడగాడ్పులు లేని ప్రదేశమంటూ ఇక ఈ భూమండలంమీద చూడబోమని నివేదిక తేల్చేసింది.


మనదేశానికి సంబంధించిన ప్రస్తావనలు, అంశాలు కూడా ఏమాత్రం ఆశావహంగా లేవు. సముద్రమట్టం పెరిగి ముంబై వంటివి మునగడమే కాక, పలు నగరాలు తీవ్ర ఉక్కపోతకు గురవుతాయని నివేదిక హెచ్చరిస్తున్నది. గ్లోబల్ వార్మింగ్ మన దేశ తీరప్రాంతాలను, అడవులను, నదులను, భూగర్భజలాలను, పర్వతాలను తీవ్రంగా ప్రభావితం చేయడం వల్ల వాటితో ముడిపడిన జీవితాలన్నీ ప్రమాదంలో పడకతప్పదు. వ్యవసాయం, మత్స్యాభివృద్ధి, పట్టణాభివృద్ధి, ఇంధనం, ఆరోగ్యం ఇత్యాది రంగాల్లో పర్యావరణ హితమైన విధానాలను ఈ నివేదిక ఆశిస్తోంది. మరో పాతికేళ్ళలో దేశంలోని నలభైశాతం జనాభా తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటారనీ, గంగ, బ్రహ్మపుత్ర ఇత్యాది నదీపరివాహక ప్రాంతాల్లో వరదలు హెచ్చుతాయనీ, కరువుకాటకాలవల్ల పంట ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుందని నివేదిక హెచ్చరిస్తున్నది. ఈ నేపథ్యంలో, ఆహారభద్రతకు ముప్పువాటిల్లకుండా ఏం చేయాలన్నది పాలకులు ఆలోచించాలి.


గతకాలపు ఈ తరహా హెచ్చరికలను లెక్కపెట్టకపోవడం, గ్రీన్‌హౌస్ వాయువుల వంటి విషాలను నియంత్రించకపోవడం పరిస్థితి తీవ్రస్థాయికి చేరుకోవడానికి కారణం. పర్యావరణ పరిరక్షణ అంటేనే అభివృద్ధి నిరోధకంగా భావించే పాలకులు చాలాదేశాల్లో ఉన్నందున లక్ష్యాల సాధన కష్టమైపోతున్నది. అభివృద్ధి యావలో దశాబ్దాల పాటు పర్యావరణాన్ని నాశనం చేసి, ప్రపంచాన్ని ప్రమాదం అంచుల్లోకి నెట్టేసిన అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికైనా తమ బాధ్యత గుర్తించాలని భారత్ సహా చాలా దేశాలు అడుగుతున్నాయి. పాపంలో మీ వాటా ఎక్కువ కనుక ప్రాయశ్చిత్తం కోసమూ మీరే బాధ్యతపడాలనీ, నిధులు కేటాయించాలనీ చిన్నదేశాలు డిమాండ్ చేస్తున్నాయి. గత ఏడాది గ్లాస్గోలో జరిగిన కాప్ సదస్సులో అగ్రదేశాలు ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాయో చూశాం. స్థానికప్రభుత్వాల నుంచి జాతీయస్థాయి వరకూ పర్యావరణానుకూల అభివృద్ధి విధానాలను రూపొందించుకోవడంతో పాటు, చేసిన పాపాల ఫలితంగా ముంచుకొస్తున్న ముప్పునుంచి ఏ విధంగా కాపాడుకోవాలో అన్ని దేశాలూ సంఘటితంగా ఆలోచించడం అవసరం.

Updated Date - 2022-03-03T10:07:03+05:30 IST