ఉద్యోగులకే ‘తోడు’

ABN , First Publish Date - 2020-11-29T05:04:10+05:30 IST

గ్రామ సచివాలయం ఎదుట ధర్నా చేస్తున్న వీరంతా చిరు వ్యాపారులు. పెట్టుబడికూడా లేని పరిస్థితుల్లో వడ్డీలకు అప్పులు తెచ్చి చిన్నచిన్న వ్యాపారాలు చేసుకొంటూ పొట్ట నింపుకుంటున్నారు. విశేషమేమంటే... వీరిలో ఏ ఒక్కరినీ జగనన్న తోడు పథకానికి గుర్తించలేదు.

ఉద్యోగులకే ‘తోడు’
సచివాలయం ముందు ఆందోళన చేపడుతున్నా చిరు వ్యాపారులు

‘జగనన్న తోడు’ లబ్ధిదారుల ఎంపికలో ఇష్టారాజ్యం

జాబితాల్లో ప్రభుత్వ ఉద్యోగులు

భగ్గుమన్న బాధితులు

సచివాలయం ఎదుట ఆందోళన

పరిశీలించి చర్యలు: ఎంపీడీవో        

మెంటాడ, నవంబరు 28: గ్రామ సచివాలయం ఎదుట ధర్నా చేస్తున్న వీరంతా చిరు వ్యాపారులు. పెట్టుబడికూడా లేని పరిస్థితుల్లో వడ్డీలకు అప్పులు తెచ్చి చిన్నచిన్న వ్యాపారాలు చేసుకొంటూ పొట్ట నింపుకుంటున్నారు. విశేషమేమంటే... వీరిలో ఏ  ఒక్కరినీ జగనన్న తోడు పథకానికి గుర్తించలేదు. ఇదేమి న్యాయమని అడిగితే ఒక మహిళా వలంటీరు ‘నువ్వు జగన్‌ పార్టీకి ఓటెయ్యనప్పుడు ఎలా శాంక్షన చేస్తామనుకున్నావ్‌’ అని వైసీపీ కార్యకర్తలా సమాధానమివ్వడం వారిని ఆశ్చర్యపరిచింది. మండలంలోని లోతుగెడ్డ గ్రామంలో చోటుచేసుకున్న ఈ వ్యవహారంలో మరో గమ్మత్తు కూడా బట్టబయలైంది. ఈ ఊర్లో మొత్తం 12 మందికి ఈ పథకం మంజూరుకాగా... వారిలో ముగ్గురు అంగన్వాడీ సిబ్బంది, ఇద్దరు అసలు వ్యాపారం వాసనే తెలియనివారు, మరో ఐదుగురు బడా వ్యాపారులు ఉన్నారు. ఇది తెలిసి కడుపుమండిన చిరు వ్యాపారులు తమకు జరిగిన అన్యాయంపై ఆందోళన చేశారు. సచివాలయం ముందు శనివారం తమ ఆవేదనను వెళ్లగక్కారు. సచివాలయ సిబ్బంది పక్షపాత ధోరణిని ఎండగట్టారు. జగనన్న తోడు పథకం చిరు వ్యాపారుల పాలిట వరమని, పార్టీలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టామని, ఇటు అధికారులు, అటు వైసీపీ నేతలు గొప్పగా ప్రకటించుకుంటున్న సంగతి చూస్తున్నాం. ఈ పథకం కింద జిల్లాలో 30,445 మందిని ఎంపిక చేశామని, వీరికి మొత్తం రూ. 29 కోట్ల 77 లక్షల రూపాయల సాయం అందుతుందని కూడా చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక నిష్పక్షపాతంగా జరిగి ఉంటే అందరూ సంతోషించేవారు. కానీ దీనిని ప్రభుత్వ పథకంలా కాకుండా వైసీపీ నేతలు సొంత పథకంలా మార్చేసి లబ్ధిదారుల ఎంపికలో తమ మార్కు చూపారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లబ్ధిదారుల ఎంపికలో వలంటీర్లు స్వామిభక్తి ప్రదర్శించారు. ఊర్లో వైసీపీ అభిమానులెవరో, కాని వారెవరో కొంతవరకు అవగాహన ఉన్నందున వారు కొందరికి మాత్రమే సమాచారమిచ్చి ఆగమేఘాలపై వారినుంచి సమాచారం సేకరించి ఆన్‌లైన్‌ చేశారు. ఇతర మార్గాల ద్వారా ఈ పథకం గురించి తెలుసుకున్న వారు వలంటీర్లను సంప్రదిస్తే ఇంకా చాలా సమయముందని చెప్పి గడువు ముగిసేవరకు కాలయాపన చేసి చివరకు టైమ్‌ అయిపోయిందని తప్పించుకున్నారు. 

ఇదంతా స్థానిక వైసీపీ నేతల డైరెక్షన్లోనే జరిగింది. వారు ఎలా చెబితే వలంటీర్లు అలా నడుచుకున్నారు. అధికార పార్టీ నేతలు చివరకు అధికారులను సైతం బెదిరింపులతో ప్రభావితం చేసి తాము ఇచ్చిన జాబితాకే మంజూరయ్యేలా పావులు కదిపారని తెలుస్తోంది. కొన్ని చోట్ల వలంటీర్లు అందరి దరఖాస్తులు ఆన్‌లైన్‌ చేయడానికి సిద్ధపడిన సమయంలో అధికార పార్టీ నేతలు అడ్డుపడి తమవారిని మాత్రమే ఆన్‌లైన్‌ చేయించి మిగిలిన వారిని మూలన పడేయించారని చెప్పుకొంటున్నారు. లబ్ధిదారుల్లో చిరు ఉద్యోగులు, వ్యాపారమే ఎరుగని వారు, లక్షల్లో టర్నోవర్‌ చేసే బడా వ్యాపారుల పేర్లు దర్శనమివ్వడం స్థానికుల్లో చర్చనీయాంశమవుతోంది. ఈ విషయాన్ని అధికార వర్గాల వద్ద ప్రస్తావించగా, జాబితాల్లో పేరులేని వారు మళ్లీ నమోదు చేసుకునే అవకాశముందిగా అని చెబుతున్నారు. అనర్హుల సంగతేంటని అడిగితే.. ఆ ఒక్కటీ అడగొద్దు అని జారుకుంటున్నారు. వైసీపీ వారికి పథకం మంజూరు చేస్తామని వలంటీరు అన్నారని.... షేక్‌ మీరబ్‌ అనే బాధితురాలు చెప్పిన విషయాన్ని ఆ వలంటీరు వద్ద ప్రస్తావించగా, ‘అబ్బే నేనలా అనలేదే’ అని వివరణ ఇచ్చారు. అర్హులకు మొండిచెయ్యి, అనర్హులకు సాయంపై సచివాలయ కార్యదర్శిని వివరణ కోరగా, లబ్ధిదారుల ఎంపిక సమయంలో మెటర్నరీ లీవ్‌లో ఉన్నట్టు చెప్పారు.

పరిశీలిస్తా:  భానుమూర్తి, ఎంపీడీవో

జగనన్న తోడులో లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగినట్టు తన దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ జరిపి అర్హులకు న్యాయం జరిగేలా చూస్తానని ఎంపీడీవో భానుమూర్తి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 


Updated Date - 2020-11-29T05:04:10+05:30 IST