ఖాతాలు ఖాళీ

ABN , First Publish Date - 2021-11-24T05:52:28+05:30 IST

గ్రామపంచాయతీల్లో సర్పంచుల ఖాతాలు ఖాళీ కావడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఖాతాలు ఖాళీ

సర్పంచు నిధులు తీసేసుకోవడంపై ఆగ్రహం
వైసీపీ సర్పంచులూ ప్రభుత్వంపై మండిపాటు


కర్నూలు-ఆంధ్రజ్యోతి: గ్రామపంచాయతీల్లో సర్పంచుల ఖాతాలు ఖాళీ కావడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అనుమతి లేకుండానే ప్రభుత్వం తీసేసుకోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైసీసీ మద్దతుదారులైన సర్పంచులు కూడా ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. కేంద్రం కేటాయించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం వాడుసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎలా అయితే గ్రామాల్లో పనులు ఎలా చేపడుతామని నిలదీస్తున్నారు.

గ్రామ పంచాయతీలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఆర్థిక సంఘం నిధుల పేరిట వీటిని రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తుంది. ప్రస్తుత సంవత్సరానికి జిల్లాకు రూ.50 కోట్లపైనే కేటాయించింది. అయితే ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకున్నట్లు సమాచారం. ఉన్నట్లుండి ఖాతాలు ఖాళీ కావడంతో సర్పంచులు అయోమయంలో పడిపోయారు. పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణ, కార్మికుల జీతాలు, పక్కా డ్రెయిన్లు, సిమెంటు రోడ్లు, వీధి లైట్లు తదితర పనులకు కేంద్రం అందించే ఆర్థిక నిధులను వినియోగిస్తారు. వీటికి అయ్యే ఖర్చును సర్పంచులు ముందే పెట్టుకుని వాటి బిల్లులను ఆ తర్వాత డ్రా చేసుకుంటారు. వాటిని ఖజానాశాఖ అప్‌లోడ్‌ చేసిన తర్వాత సర్పంచ్‌, గ్రామ కార్యదర్శి సంయుక్తంగా బయోమెట్రిక్‌ వేసి నిధులను తీసుకోవాలి. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సర్పంచులు పారిశుధ్య నిర్వహణ ముమ్మరంగా చేపట్టారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రాగానే ఆ సొమ్మును తీసుకోవచ్చన్న ఉద్దేశంతో ఉన్నారు. అయితే ఆర్థిక సంఘం నిధులు ఖాతా నుంచి మాయమయ్యాయని తెలుసుకుని సర్పంచులు లబోదిబోమంటున్నారు. ఇలా అయితే అభివృద్ధి పనులు కుంటుపడతాయంటున్నారు.

దాదాపు రూ.200 కోట్లు

జిల్లాలో 973 పంచాయతీలు ఉన్నాయి. జనాభాను బట్టి కేంద్రం నిధులను కేటాయిస్తుంది. 15వ ఆర్థిక సంఘం ద్వారా జిల్లాకు ఇప్పటికే దాదాపు రూ.200 కోట్లు కేటాయించింది. 2020-21వ సంవత్సరానికి మొదటి విడతలో 76.98 కోట్లు, రెండో విడతలో 75.99 కోట్లు, కేటాయించింది. దీనికి తోడు 2021-22 సంవత్సరానికి 56.24 కోట్లు మళ్లీ ఇచ్చింది. సర్పంచుల పాలన లేకపోవడంతో 2020-21 సంవత్సరం నిధులు చాలావరకు అలానే ఉండిపోయాయి. ప్రస్తుతం జిల్లాలోని అన్ని పంచాయతీల నుంచి దాదాపు రూ.100 కోట్లు ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లు సంబంధితశాఖ అధికారులు భావిస్తున్నారు. గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులను విద్యుత్తు బకాయిల పేరుతో వెనక్కి తీసుకుంది. అయితే 15వ ఆర్థిక సంఘానికి చెందిన నిధులను ఎందుకు వెనక్కి తీసుకుందో ఎవరికీ అర్థం కావడం లేదు. పల్లె ఖాతాల్లో జమ అయిన నిధులు తమకు తెలియకుండా తీసేసుకుంటే ఇక తామెందుకని పలువురు సర్పంచులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

చిన్న పనులకూ ఇబ్బందే..

ఇప్పటి వరకు పంచాయతీ ఖాతాలో నిధులు నిల్వ ఉన్నా వాటిపై ఖజానా ఆంక్షల కారణంగా గతంలో చేసిన పనులకు బిల్లులు విడుదల కాలేదు. దీంతో పల్లెల్లో కనీసం వీధి బల్బులు వేయాలన్నా, కాలువల్లో పూడికతీత పనులు చేయాలన్నా స్థానిక నాయకులు ముందుకు రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏ చిన్నపాటి పనిచేయాలన్నా గ్రామ కార్యదర్శులకు ఇబ్బందికరంగా మారింది. తాజాగా ఖాతాలో ఉన్న నిధులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో ఇక నుంచి డబ్బుతో ముడిపడి ఉన్న అత్యవసర పనులు ఎలా చేయాలని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వ్యవస్థలను భ్రష్టుపట్టించిన ప్రభుత్వం

ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తోంది. సర్పంచ్‌గా నేను నాలుగు పర్యాయాలు పనిచేశాను. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు రూపాయి ఇవ్వకపోగా, కేంద్రం నిధులను కూడా సర్పంచ్‌లకు తెలియకుండా తమ ఖాతాలో వేసుకోవడం దురదృష్టకరం. సీఎస్‌ఎంఎస్‌ ద్వారా సర్పంచ్‌లకు 6 నెలలకు, సంవత్సరానికి ఒకసారి భిక్షమేసినట్లు వేస్తున్నారు. అవి వీధిలైట్లు, పారిశుధ్య పనులకే సరిపోవడం లేదు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక తలదించుకుని తిరుగుతున్నాం. ఎన్నో ఆశలు పెట్టుకున్న జగన్‌ సర్కారు ఇలాంటి చర్యలు చేపట్టడం ఎంతవరకు సమంజసం?

- వైసీపీ మద్దతుదారు సర్పంచ్‌ టి.శివరామిరెడ్డి, నెహ్రూనగర్‌, గోస్పాడు మండలం

సొంతంగా రూ.3 లక్షలు ఖర్చు చేశా

ప్రభుత్వం ఇష్టారాజ్యంగా సర్పంచుల నిధులు వాడేస్తోంది. ఖజానా ఖాళీ అవడంతో సర్పంచుల పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే కమలాపురంలో సొంత  డబ్బులు రూ.3లక్షలు ఖర్చు చేశాను. పైపులైన్‌ మరమ్మతులకు, మోటారు మరమ్మతులకు, వీధి లైట్ల ఏర్పాటు, వాటి మరమ్మతులు, పారిశుధ్య సిబ్బంది జీతభత్యాలు తదితర వాటికి ఇంతవరకు బిల్లులు రాలేదు. వీటన్నింటికీ సొంత డబ్బు పెట్టాను. కమలాపురం పంచాయితీకి రూ.10 లక్షలు వచ్చాయి. ఆ నిధులను ప్రభుత్వం దారి మళ్లించడం చాలా అన్యాయం. పంచాయతీలకు వచ్చిన నిధులను తిరిగి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయాలి.

- కమలాపురం సర్పంచ్‌ రేగటి అర్జున్‌రెడ్డి

అభివృద్ధి కుంటు పడింది

కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకోవడం తగదు. నేను గ్రామాభివృద్ధికి దాదాపు రూ.10 లక్షలు వెచ్చించాను. మూడు రోజుల క్రితం కేంద్రం మంజూరు చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు ఖాతాలో కనిపించలేదు. ఇప్పుడు నేను ఖర్చు పెట్టిన డబ్బులు ఎలా? ప్రభుత్వ తీరు వల్ల గ్రామాభివృద్ధి కుంటు పడుతుంది.                      
 
-మోహన్‌ రెడ్డి, సర్పంచ్‌, గుట్టపాడు, ఓర్వకల్లు మండలం

Updated Date - 2021-11-24T05:52:28+05:30 IST