ఓట్ల లెక్కింపునకు పక్కాగా ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-03-01T06:01:15+05:30 IST

జీవీఎంసీ ఎన్నికల సందర్భంగా ఓట్ల లెక్కింపు జరిగే ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీలో జరుగుతున్న ఏర్పాట్లను జీవీఎంసీ కమిషనర్‌ ఎస్‌.నాగలక్ష్మి ఆదివారం పరిశీలించారు.

ఓట్ల లెక్కింపునకు పక్కాగా ఏర్పాట్లు
ఏయూలోని ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న జీవీఎంసీ కమిషనర్‌ ఎస్‌.నాగలక్ష్మి, ఇతర అధికారులు

అధికారులకు జీవీఎంసీ కమిషనర్‌ ఆదేశం

ఏయూలో ఏర్పాట్లను పరిశీలించిన నాగలక్ష్మి


విశాఖపట్నం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ ఎన్నికల సందర్భంగా ఓట్ల లెక్కింపు జరిగే ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీలో జరుగుతున్న ఏర్పాట్లను జీవీఎంసీ కమిషనర్‌ ఎస్‌.నాగలక్ష్మి ఆదివారం పరిశీలించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలతోపాటు బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్‌ రూమ్‌లకు అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలని ఆధికారులను ఆదేశించారు. వాహనాల పార్కింగ్‌, బారికేడ్లు, రిసెప్షన్‌ వంటిచోట్ల ఏం చేయాలో కొన్ని సూచనలు చేశారు. లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి ఆటంకం తలెత్తకుండా అవసరమైన ఏర్పాటన్నీ చేయాలని సూచించారు. ఆమె వెంట పాటు చీఫ్‌ ఇంజనీర్‌ కె.వెంకటేశ్వరరావు, ఏడీసీ పి.ఆశాజ్యోతి, ఎస్‌ఈ ఎస్‌.వేణుగోపాల్‌ తదితరులు వున్నారు.



మరణించిన అభ్యర్థుల స్థానంలో కొత్తగా మూడు నామినేషన్లు

విశాఖపట్నం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్‌ అభ్యర్థులుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల తరపున నామినేషన్లు దాఖలుచేసి, అనంతరం వివిధ కారణాలతో మృతిచెందిన అభ్యర్థుల స్థానంలో ఆయా పార్టీల నుంచి  ముగ్గురు నామినేషన్లు దాఖలుచేసినట్టు జీవీఎంసీ కమిషనర్‌ ఎస్‌.నాగలక్ష్మి తెలిపారు. జోన్‌-1 పరిధిలో నాలుగో వార్డు టీడీపీ అభ్యర్థిగా పాసి నరసింగరావు, మూడో జోన్‌ పరిధిలోని 19 వార్డులో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా నాగ సునందా దేవి, జోన్‌-6 పరిధిలోని 77 వార్డులో వైసీపీ తరపున బట్టు సూర్యకుమారి నామినేషన్లు వేశారని చెప్పారు. వీటిని సోమవారం పరిశీలించి, అన్నీ సక్రమంగా వుంటే ఆమోదిస్తామని స్పష్టం చేశారు. కాగా నామినేషన్ల ఉపసంహరణకు మూడో తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు వుందని, అనంతరం పోటీలో వున్న అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తామని జీవీఎంసీ కమిషనర్‌ చెప్పారు.

Updated Date - 2021-03-01T06:01:15+05:30 IST