పోలీసుల అదుపులో నిందితులు!

ABN , First Publish Date - 2020-12-02T05:24:30+05:30 IST

కొమురవెల్లి మల్లన్న ఆలయ సమీపంలోని ఎల్లమ్మగుట్టకు వెళ్లేదారిలో ఇటీవల జరిగిన గుర్తుతెలియని వ్యక్తి హత్య మిస్టరీ వీడింది.

పోలీసుల అదుపులో నిందితులు!

 ఎట్టకేలకు వీడిన కొమురవెల్లిలో జరిగిన హత్య మిస్టరీ


చేర్యాల, డి సెంబరు 1: కొమురవెల్లి మల్లన్న ఆలయ సమీపంలోని ఎల్లమ్మగుట్టకు వెళ్లేదారిలో ఇటీవల జరిగిన గుర్తుతెలియని వ్యక్తి హత్య మిస్టరీ వీడింది. హత్యకు పాల్పడిన ఇద్దరిని కొమురవెల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. హత్యకు గురైంది రాయపోల్‌ మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన కొంపల్లి కనకయ్యగా గుర్తించినట్లు కొమురవెల్లి ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. నవంబరు 24న హనుమాన్‌ ఆలయ వెనకభాగంలోని రాతిగుళ్ల మధ్య వ్యక్తి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. మృతుడి వెంట ఆలయ పరిసరాల్లో కలిసి తిరిగిన మహిళ అతడి భార్యగా గుర్తించినట్లు తెలిసింది. కనకయ్య గజ్వేల్‌లో హమాలీగా పనిచేస్తుండగా, అనిత కూరగాయలు విక్రయిస్తున్నది. ఇరువురి మధ్య కలహాలు నెలకొనడంతో సుమారు నాలుగేళ్లుగా వేరుగా ఉంటున్నారు. కనకయ్య ఆరేపల్లిలో ఉంటూ రోజూ గజ్వేల్‌కు వెళ్తుండగా, అనిత గజ్వేల్‌లోని తన తల్లి వద్ద ఉంటున్నది. ఇద్దరు వేర్వేరుగానే ఉంటున్నా అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి నవంబరు 21న సాయంత్రం కొమురవెల్లికి చేరుకున్నారు. అదేరోజు రాత్రి జగదేవ్‌పూర్‌ మండలం తిమ్మాపూర్‌కు చెందిన మరో వ్యక్తి సహకారంతో కనకయ్య గొంతు నులిమి హత్యచేసి ఎల్లమ్మగుట్టకు వెళ్లే దారిలో రాతిగుండ్ల మధ్య పడేసినట్లు తెలిసింది. నిందితుల ఆచూకీ కోసం సీసీ కెమెరాల్లో నమోదైన చిత్రాలతో పోలీసులు వాల్‌పోస్టర్లను ఏర్పాటు చేయించారు. వారిని గుర్తించిన గజ్వేల్‌వాసులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో సోమవారం రాత్రి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్య చేయడానికి గల కారణాలపై విచారణ చేస్తున్నట్లు తెలిసింది. 


Updated Date - 2020-12-02T05:24:30+05:30 IST