కొలిక్కి వచ్చిన మరో దేవాలయం కేసు

ABN , First Publish Date - 2021-01-22T06:51:17+05:30 IST

కనకదుర్గమ్మ రథానికి ఉండాల్సిన మూడు వెండి సింహాల ప్రతిమల కేసును ఛేదించిన పోలీసులు తాజాగా మరో దేవాలయంలో జరిగిన దాడి కేసును కూడా ఛేదించారు.

కొలిక్కి వచ్చిన మరో దేవాలయం కేసు

పోలీసుల అదుపులో మక్కపేట శివాలయంలో దాడి నిందితులు

నేడు అధికారికంగా వివరాలు వెల్లడి

మంగళగిరిలో మూడు సింహాల నిందితులు

ఓ కార్యాలయంలో రహస్య విచారణ


ఆంధ్రజ్యోతి - విజయవాడ : కనకదుర్గమ్మ రథానికి ఉండాల్సిన మూడు వెండి సింహాల ప్రతిమల కేసును ఛేదించిన పోలీసులు తాజాగా మరో దేవాలయంలో జరిగిన దాడి కేసును కూడా ఛేదించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పోలీసుల సహకారంతో వెండి సింహాల ప్రతిమల కేసును విజయవాడ పోలీసులు ఛేదించగా, వత్సవాయి మండలం మక్కపేటలోని శివాలయంలో నంది విగ్రహం ధ్వంసం కేసులో నిందితులను జిల్లా పోలీసులు పట్టుకున్నారు. మక్కపేటలో ఉన్న పురాతన శివాలయంలో మూడు నెలల క్రితం నంది విగ్రహం చెవులను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహనరావు ఈ వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ శివాలయంలో గుప్త నిధులున్నాయన్న ప్రచారం కొంతకాలంగా నడుస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం వాటి కోసం ప్రహరీని పగలగొట్టారు. తాజాగా నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. నిందితులు ఆలయంలో ఆభరణాలు ఉంటే కాజేద్దామని వచ్చి ఈ పని చేశారా? మద్యం మత్తులో వచ్చి, చేశారా? అన్నది తెలియలేదు. దాడి కేసులో మతాల మధ్య విద్వేషాలకు సంబంధించిన కోణాలేమీ కనిపించలేదని చెబుతున్నారు. 


మంగళగిరిలో మూడు సింహాల కేసు విచారణ

 మూడు వెండి సింహాల ప్రతిమల కేసులో నిందితులను పోలీసులు బుధవారం అర్ధరాత్రి పశ్చిమగోదావరి జిల్లా నుంచి గుంటూరు జిల్లా మంగళగిరికి తరలించినట్టు తెలిసింది. కనకదుర్గ ఆలయానికి చెందిన వాహనంలోనే నిందితులను ఇక్కడికి తీసుకొచ్చారు.  పోలీసు వాహనాల్లో తీసుకొస్తే మీడియా హడావిడి ఉంటుందనే ఉద్దేశంతో ఇలా తీసుకొచ్చారని తెలుస్తోంది. వెండి ప్రతిమలను అపహరించిన నిందితుడు భీమవరం మండలం గొల్లవానిరేవు గ్రామానికి చెందిన జక్కంశెట్టి సాయిగా గుర్తించారు. ఆలయల్లో దాడులు, చోరీలు జరిగిన తర్వాత ఆ ఘటనల్లో పాత నేరస్థులను పోలీసులు తీసుకొచ్చి విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే మూడు సింహాల మాయం కోణం బయటకు వచ్చిందని సమాచారం. సాయి ఇంతకుముందు వివిధ దేవాలయాల్లో చోరీలు చేశాడు. మూడు సింహాల ప్రతిమలతోపాటు ఇంకా ఎక్కడ చోరీలు చేశాడనే వివరాలను పోలీసులు రాబడుతున్నారు. మంగళగిరిలో ఈ నిందితులను విచారిస్తున్నారు. కేసు కొలిక్కి వచ్చేసిందని, రెండు రోజుల్లో వివరాలను వెల్లడిస్తారని తెలుస్తోంది.

Updated Date - 2021-01-22T06:51:17+05:30 IST