Gupta Brothers Arrest: చెప్పుల వ్యాపారంతో మొదలైన ఈ ఇండియన్ బ్రదర్స్ జర్నీ.. దక్షిణాఫ్రికా సర్కార్‌ను శాసించే స్థాయికి చేరింది.. చివరికి

ABN , First Publish Date - 2022-06-08T17:31:31+05:30 IST

అజయ్, అతుల్, రాజేశ్‌ అనే ముగ్గురు భారత సంతతి గుప్తా బ్రదర్స్ 2018లో దక్షిణాఫ్రికాలోని జాకబ్ జుమా ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన విషయం తెలిసిందే.

Gupta Brothers Arrest: చెప్పుల వ్యాపారంతో మొదలైన ఈ ఇండియన్ బ్రదర్స్ జర్నీ.. దక్షిణాఫ్రికా సర్కార్‌ను శాసించే స్థాయికి చేరింది.. చివరికి

దుబాయ్: అజయ్, అతుల్, రాజేశ్‌ అనే ముగ్గురు భారత సంతతి గుప్తా బ్రదర్స్ 2018లో దక్షిణాఫ్రికాలోని జాకబ్ జుమా ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన విషయం తెలిసిందే. ఆ దేశంలో వేలకోట్ల స్కాములకు పాల్పడి అక్కడి నుంచి కుటుంబంతో సహా దుబాయ్‌కు చెక్కేశారు. అయితే, దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఫిర్యాదు మేరకు ఇంటర్‌పోల్ చొరవతో సోమవారం దుబాయ్ పోలీసులు రాజేష్, అతుల్ గుప్తాలను యూఏఈలో అదుపులోకి తీసుకున్నారు. అసలు ఈ ముగ్గురు సోదరులు దక్షిణాప్రికాలో చేసిన నేరం ఏంటి? అక్కడ ఈ బద్రర్స్ జర్నీ ఎలా మొదలైంది? ఆ దేశంలో చాలా తక్కువ సమయంలోనే వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పిన వీరు చివరకు ఎందుకు అక్కడి నుంచి పారిపోయి దుబాయ్‌లో తలదాచుకున్నారు? జుమా ప్రభుత్వం కూలిపోవడానికి ఈ సోదరులు ఎలా కారణమమ్యారు? అనే విషయాలను పరిశీలిస్తే...


యూపీలోని సహరన్‌పూర్‌కు చెందిన అజయ్, అతుల్, రాజేశ్‌ అనే ముగ్గురు గుప్తా బ్రదర్స్ 90వ దశకంలో దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ ఓ చిన్న చెప్పుల దుకాణంతో వారి జర్నీ మొదలైంది. ఆ తర్వాత ఐటీ, మీడియా, మైనింగ్‌ అంటూ వివిధ రంగాలకు వ్యాపారాన్ని విస్తరించారు. దాంతో అనతీకాలంలోనే దక్షిణాఫ్రికాలో కుబేరులుగా మారారు. అంతే.. వారికి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అదే క్రమంలో అప్పటి ఆ దేశ అధ్యక్షుడు జాకబ్ జుమాతో ఈ సోదరులకు సాన్నిహిత్యం బాగా పెరిగింది. ఇంకేముంది వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా సాగిపోవడంతో 2009 నుంచి 2018 వరకు తొమ్మిదేళ్ల పాటు గుప్తా బ్రదర్స్‌ సంపాదన ఊహించనంతగా పెరిగిపోయింది. 


దాంతో అటు రాజకీయాల్లోనూ తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నించిన వీరు 2016లో ఆ దేశ ఆర్థిక మంత్రి పదవి కోసం ఏకంగా 44 మిలియన్ల డాలర్ల లంచం ఆఫర్‌ చేశారు. దాంతో ఓ ప్రభుత్వాధికారి ద్వారా వీరి అవినీతి బాగోతం బయటపడింది. ఈ క్రమంలోనే 2018లో ఆ దేశంలో ప్రజా నిరసనలు తీవ్రస్థాయికి చేరాయి. ఫలితంగా జాకబ్ జుమా తన పదవి నుంచి తప్పుకున్నాడు. ఇక జుమా హయాంలో ప్రభుత్వ సంస్థలను వేలకోట్ల రూపాయలు ముంచేశారనే ఆరోపణలపై విచారణ కొనసాగుతుండగానే వారు కుటుంబాలతో సహా దుబాయ్ పారిపోయారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా అధికారులు ఇంటర్‌పోల్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో ఇంటర్‌పోల్ దుబాయ్‌లో ఉంటున్న గుప్తా బ్రదర్స్ కోసం రెడ్ నోటీసులు జారీ చేసింది. ఇంటర్‌పోల్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన దుబాయ్ పోలీసులు సోమవారం రాజేష్, అతుల్ గుప్తాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు సోదరులను దక్షిణాఫ్రికా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇంటర్‌పోల్ అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2022-06-08T17:31:31+05:30 IST