Allopathy: డాక్టర్లేమైనా హంతకులా?.. రాందేవ్ యాడ్స్‌పై సుప్రీం అక్షింతలు

ABN , First Publish Date - 2022-08-24T01:36:50+05:30 IST

కోవిడ్ పరిస్థితి తీవ్రంగా ఉన్న సమయంలో అలోపతి, అలోపతి ప్రాక్టీసింగ్ డాక్టర్ల ప్రతిష్టను దిగజార్చే విధంగా...

Allopathy: డాక్టర్లేమైనా హంతకులా?.. రాందేవ్ యాడ్స్‌పై సుప్రీం అక్షింతలు

న్యూఢిల్లీ: కోవిడ్ పరిస్థితి తీవ్రంగా ఉన్న సమయంలో అలోపతి (Allopathy), అలోపతి ప్రాక్టీసింగ్ డాక్టర్ల (practicing doctors) ప్రతిష్టను దిగజార్చే విధంగా అడ్వర్‌టైజ్‌మెంట్లు (Advertisements) ఇవ్వడంపై యోగా గురువు బాబా రాందేవ్‌‌ (Baba Ramdev)ను సుప్రీంకోర్టు మంగళవారంనాడు మందలించింది. ఆయనను కట్టడి (Restrain) చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ''అలోపతి వైద్యులపై బాబా రాందేవ్ ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? యోగాను ఆయన బాగా ప్రచారంలోకి తెచ్చారు. అది మంచిదే. కానీ, ఇతర వ్యవస్థలను ఆయన విమర్శించకూడదు. డాక్టర్లేదో హంతకులన్నట్టు ఆరోపించడం తగదు'' అని ప్రధాన న్యాయమూర్తి సీజే రమణ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులు హిమా కోహ్లి,  సీటీ రవికుమార్ ఈ ధర్మాసనంలో ఉన్నారు.


ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) తరఫున అడ్వకేట్ ప్రభాస్ బజాజ్ తన వాదన వినిపిస్తూ, అడ్వర్‌టైజ్‌మెంట్‌లలో అలోపతిని అవమానపరచేలా రామ్‌దేవ్ వ్యాఖ్యలున్నాయని, సంబంధిత అధికారులకు పలు రిప్రజెంటేషన్లు ఇచ్చినా ఎలాంటి సమాధానం రాలేదని అన్నారు. డాక్టర్లు కూడా అలోపతి తీసుకుంటున్నారని, అంతమాత్రాన కోవిడ్‌తో చనిపోవడం లేదా అని వాళ్లు అంటున్నారని, ఇదే ప్రచారం కొనసాగిస్తూ పోతే... అలోపతికి తీవ్రమైన హాని కలుగుతుందని ఆయన వాదించారు.  దీనిపై  కేంద్ర తరఫు ప్రతినిధి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించి సీజేఐ మాట్లాడుతూ.. "అలోపతి వైద్యులు కిల్లర్లనే విధంగా అడ్వర్‌టైజ్‌మెంట్ల ద్వారా రామ్‌దేవ్, పతంజలి ఎలా విమర్శిస్తారు? ఇదంతా ఏమిటి? కేంద్రం ఆయనను (రామ్‌దేవ్) కట్టడి చేయడం మంచిది" అని అన్నారు. కోవిడ్ వ్యాక్సినేష్ డ్రైవ్, మోడ్రన్ మెడిసన్లపై బురదజల్లే ప్రచారం జరుగుతోందంటూ ఐఎంఏ చేసిన ఆరోపణలపై కేంద్రం తన స్పందనను తెలియజేయాలని కూడా ధర్మాసనం ఆదేశించింది.

Updated Date - 2022-08-24T01:36:50+05:30 IST