‘ఏసీడీ’ కొత్త పంచాయితీ

ABN , First Publish Date - 2022-06-23T08:26:35+05:30 IST

‘ఏసీడీ’ కొత్త పంచాయితీ

‘ఏసీడీ’ కొత్త పంచాయితీ

ధరావతుతో అద్దె ఇళ్లలో మంటలు

ఎవరు కట్టాలనేదానిపై ఘర్షణలు

(అమరావతి, ఆంధ్రజ్యోతి)

వార్షిక విద్యుత్తు వినియోగంలో అధికంగా వాడిన కరెంటు ఆధారంగా వసూలుచేసే అదనపు విద్యుత్తు వాడక ధరావతు(ఏసీడీ) వ్యవహారం కొత్త పంచాయితీని తెచ్చిపెట్టింది. గతఏడాది మార్చినుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ మధ్యలో వాడిన కరెంటును సగటుగా తీసుకుంటున్నామని డిస్కమ్‌లు చెబుతున్నాయి. యేటా ఏసీడీ మొత్తానికి ఆరు శాతం వడ్డీని మార్చి లేదా ఏప్రిల్‌ నెల బిల్లులో చెల్లిస్తాని అంటున్నాయి. అయితే.. పట్టణాలు, నగరాల్లో అద్దె ఇళ్లలో ఉండేవారే ఎక్కువ. వారు తరచూ వివిధ కారణాలతో ఇళ్లు మారుతూ ఉంటారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో ఒక కుటుంబం అద్దెకు దిగింది అనుకుందాం. అప్పటివరకు ఆ  ఇంటిలో నివాసం ఉన్నవారు అత్యధిక విద్యుత్తును వినియోగిస్తే.. వాటికి సంబంధించి అదనపు విద్యుత్తు ధరావతుకు కొత్తగా అద్దెకు దిగినవారే బాధ్యత వహించాలి. ఈ ధరావతును అద్దెదారులే చెల్లించాలని ఇంటి యజమానులు చెబుతుంటే.. రెండు నెలల కిందట అద్దెకు దిగిన తాము ఎందుకు చెల్లించాలని అద్దెదారులు నిలదీస్తున్నారు. దీంతో .. చాలాచోట్ల యజమానులకు..అద్దెదారులకు మధ్య పంచాయితీ మొదలైంది. ఏప్రిల్‌లో కొత్తగా అద్దెకు దిగేవారు..ఎందుకు అంతకుముందు ఉన్నవారు కాల్చిన అధిక కరెంటుకు బాధ్యత పడాలనేది ఒక అంశమైతే... డిస్కమ్‌ చెబుతున్న ఆరు శాతం వడ్డీ లబ్ధి ఎవరికి చెందుతుందనేది మరో ముఖ్యమైన ప్రశ్నే 


ఆంధ్రజ్యోతి కథనంపై డిస్కమ్‌ల ప్రతిస్పందన

ఏసీడీని ప్రస్తుత ప్రభుత్వం సృష్టించలేదని విద్యుత్తు పంపిణీ సంస్థలు తెలిపాయి. ‘‘ఏసీడీ విధానాన్ని 2002లో ఏపీఈఆర్‌సీ ఆమోదించింది. వార్షిక విద్యుత్తు సగటుపైనే ఏసీడీ ఆధారపడి ఉంటుంది. యేటా ఏసీడీ మొత్తానికి ఆరు శాతం వడ్డీని మార్చి లేదా ఏప్రిల్‌ నెల బిల్లులో చెల్లిస్తాం. నెలవారీ 500 యూనిట్లు పైబడి కరెంటు వాడేవారికే ధరావతు వర్తిస్తుంది. వినియోగదారులు బిల్లులు చెల్లించలేక కనెక్షన్‌ను నిలుపుదల చేస్తే.. డిస్కమ్‌లకు చెల్లించాల్సిన మొత్తాలను మినహాయించుకుని .. ధరావతులో మిగిలిన మొత్తాన్ని వెనక్కు ఇచ్చేస్తాం. ఏసీడీపై ఈఆర్‌సీ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది’’ అని వివరించాయి. అయితే.. డిస్కమ్‌ల ప్రతిస్పందనపై ఇంధన రంగ నిపుణుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకూ పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులకు మాత్రమే వర్తించే ఏసీడీ విధానం గృహ విద్యుత్తు వినియోగదారులకు వర్తింపజేయడంపై డిస్కమ్‌లు వివరణ ఇవ్వాలంటున్నారు. ఈ విధానం ఎప్పటినుంచి ఉన్నదో డిస్కమ్‌లు చెప్పాలంటున్నారు. 


బెంచ్‌ మార్క్‌లోపూ బాదుడేనా?

విద్యుత్‌ వినియోగం 500 యూనిట్లు దాటితే ఏసీడీ వర్తిస్తుందని డిస్కమ్‌లు చెబుతున్నాయి. కానీ, ఆ బెంచ్‌ మార్క్‌ దాటకముందే విజయవాడలో ఓ కుటుంబాన్ని బాదేశారు. ఆ కుటుంబం ఏప్రిల్‌ నెలలో కొత్త ఇంట్లో  అద్దెకు దిగింది. ఆ కుటుంబానికి 5512308004832 సర్వీసు నంబరుతో కూడిన విద్యుత్తు కనెక్షన్‌కు ఈ ఏడాది మే నెలలో విద్యుత్తు వినియోగం కింద 5,623గా డిస్కమ్‌ పేర్కొంది. దీనిలోంచి అడ్జస్ట్‌మెంట్‌ పోగా 3070గా బిల్లు పంపింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌వరకూ సగటున 417 యూనిట్లు వినియోగించినట్లుగా పేర్కొంది. ఈ సర్వీసు నంబరుకు రూ.13,000 ఏసీడీ కింద చెల్లించాలని డిస్కమ్‌లు పేర్కొన్నాయి. రెండు నెలల కిందట అద్దెకు దిగిన తామెందుకు ధరావత్తు కట్టాలని ఆద్దెదారు వాదిస్తుంటే.. తమకేమీ తెలియదని.. ఆ పోర్షన్‌కు సంబంధించిన విద్యుత్తును తాము వాడనందున ఆ ధరవత్తును అద్దెదారులే చెల్లించాలని యజమాని అంటున్నారు.

Updated Date - 2022-06-23T08:26:35+05:30 IST