సినిమా రివ్యూ : ‘ఆచార్య’

Published: Fri, 29 Apr 2022 12:59:21 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సినిమా రివ్యూ : ఆచార్య

చిత్రం : ఆచార్య

విడుదల తేదీ : ఏప్రిల్ 29, 2022

నటీనటులు : చిరంజీవి, రామ్‌చరణ్, పూజా హెగ్డే, తనికెళ్ళ భరణి, అజయ్, సోనూసూద్, జిషు సేన్ గుప్తా, సివీయల్ నరసింహారావు, సంగీత, రెజీనా, సత్యదేవ్ తదితరులు

సంగీతం : మణిశర్మ

ఛాయాగ్రహణం : తిరు

నిర్మాణం : కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ 

దర్శకత్వం : కొరటాల శివ

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తర్వాత నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషించాడు. తండ్రీ కొడుకులు తొలి సారిగా స్ర్కీన్ షేర్ చేసుకుంటూండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్స్, సింగిల్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాకి మరింత హైపు క్రియేట్ అయింది. ఈ రోజే (ఏప్రిల్ 29) థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం అభిమానుల అంచనాల్ని ఏ స్థాయిలో అందుకుంది? చిరంజీవి, చరణ్ ఆన్ స్ర్కీన్ ప్రెజెన్స్ ఏ రీతిలో ఆకట్టుకుంది? అనే విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే. 

కథ 

స్వయంగా అమ్మవారు వెలిసిన పుణ్యస్థలం ధర్మస్థలి. అక్కడ గురుకులంలో పెరిగి పెద్దవాడైన సిద్ధ (రామ్ చరణ్), అక్కడి ప్రజలకు అండగా నిలబడి అనుక్షణం ధర్మాన్ని రక్షిస్తుంటాడు. రాజకీయంగా ఎదగాలనుకున్న బసవ (సోనూసూద్) కన్ను ధర్మస్థలిపై పడుతుంది. దాన్ని చేజిక్కించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ ధర్మస్థలిని కాపాడుతున్న సిద్ధ అడ్డుతొలగిస్తేనే ధర్మస్థలి తన సొంతమవుతుందని భావించిన బసవ అతడి అనుచరులు సిద్ధ మీద అటాక్ చేస్తారు. ఆ క్రమంలో గాయపడిన అతడ్ని కొందరు కాపాడుతారు.  ఇంతలో బసవ కారణంగా.. అక్కడ ధర్మం మంటగలిసి అధర్మం పేట్రేగుతుండడంతో దాన్ని అడ్డుకోడానికి ఆ ప్రాంతంలోకి అడుగుపెడతాడు ఆచార్య (చిరంజీవి). బసవ అతడి గ్యాంగ్ చేసే అరాచకాల్ని ఒకొక్కటిగా ఎండగడుతూ ఉంటాడు. ఇంతకీ ఆచార్య ఎవరు? సిద్ధకి, అతడికి సంబంధం ఏంటి? చివరికి ఆచార్య ధర్మస్థలిని ఏ విధంగా కాపాడుతాడు? అనేదే మిగతాకథ.

విశ్లేషణ 

డివోషనల్ బేస్డ్ కథాంశం కాబట్టి.. కథాకథనాల్ని దానికి తగ్గ స్థాయిలోనే రాసుకున్నాడు దర్శకుడు కొరటాల శివ. ధర్మస్థలి అనే ఆధ్యాత్మిక ప్రాంతం.. దాన్ని నమ్ముకొని తమ అస్థిత్వాన్ని కాపాడుకోవాలి అనుకుంటున్న జనం..  అక్కడ ధర్మం నిలవాలని తపించే ఒక యువకుడు. ఇలాంటి కాన్సెప్ట్ ను రెగ్యులర్ యాక్షన్ చిత్రాల మాదిరిగా మరీ అంత భారీ బిల్డప్పులు, ఎలివేషన్ప్ లేకుండా క్లీన్ అండ్ నీట్ గా ప్రెజెంట్ చేయాలని దర్శకుడు భావించాడు. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి యాక్షన్ హీరోలు నటించడం వల్ల అభిమానులు ఆ ఇద్దరి ఇమేజ్ కు తగ్గ అంశాల్ని ఆశిస్తారు. సినిమాలో వారు కోరుకున్నవి తక్కువ స్థాయిలో కనిపిస్తాయి. అయినప్పటికీ కొరటాల కథాకథనాలకు మెగా తండ్రీ కొడుకులే ప్రాణం పోశారు. ఫస్టాఫ్ అంతా చిరంజీవి తన నటన, నృత్యం, యాక్షన్‌తో అభిమానులకు మంచి అనుభూతిని అందిస్తారు. కాకపోతే గత చిత్రాల మాదిరిగా ఆయన అరుపులు, కేకలతో కాకుండా ఒక స్టైల్లో తనదైన శైలిలో డైలాగ్స్ తో మెప్పిస్తారు. ఇక సెకండాఫ్ నుంచి సిద్ధ పాత్రధారి రామ్ చరణ్ ఎంటర్ అయినప్పటి నుంచి కథనం మరింత ఆసక్తిగా మారుతుంది. అలాగే నక్సల్స్ గా తండ్రీ కొడుకుల సన్నివేశాలు మెప్పిస్తాయి. కాకపోతే  ఇది వరకటిలా నక్సల్స్ ప్రభావం అంతగా లేదు కాబట్టి.. ఇప్పటి పరిస్థితులకు అది అంతగా సింకవలేదు అనిపిస్తుంది. ఇక ఇద్దరూ కలిసి చిందేసిన భలే బంజారా పాట అభిమానుల్ని బాగా అలరిస్తుంది. ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో యన్టీఆర్‌తో డ్యాన్స్ సింకయినట్టు .. తండ్రి చిరుతో కూడా చెర్రీ డ్యాన్స్ అద్భుతంగా కుదిరింది. అరవై ప్లస్ ఏజ్ లో కూడా  కొడుకుతో కలసి ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేయడం ఆయనకు మాత్రమే చెల్లింది.  అడవుల్లో నక్సల్స్ గా తండ్రీ కొడుకుల అభినయం, యాక్షన్ ఆకట్టుకుంటాయి. తెరమీద వీరిద్దరూ కనిపించిన మేరా అభిమానులకు మంచి అనుభూతిని అందించారు. అయితే మరింత బెటర్‌గా కథాకథనాల్ని తీర్చిదిద్ది ఉంటే ఇంకా బాగుండేది.


‘ఆచార్య’ గా చిరంజీవి నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కథాకథనాలకు తగ్గట్టుగా.. తన రెగ్యులర్ మాస్ చిత్రాలకు భిన్నంగా ఇందులో ఆయన అభినయం కనిపిస్తుంది. డైలాగ్స్‌లోనూ, డ్యా్న్స్‌లోనూ ఆయన మార్క్ కనిపిస్తుంది. అలాగే సిద్ధగా రామ చరణ్ స్ర్కీన్ ప్రెజెన్స్, అభినయం, డ్యాన్స్ అండ్ ఫైట్స్ ఆకట్టుకుంటాయి. కథానాయికగా పూజా హెగ్డే గ్లామర్, అభినయం ఆకట్టుకుంటాయి. అయితే ఆమెను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు. విలన్స్‌గా సోనూసూద్, జిషు సేన్ గుప్తా తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. కాకపోతే తులసివనంలో గంజాయి మొక్కలాంటి వాడ్నని సోనూసూద్ పలికే డైలాగ్ తో కొరటాల ఇంకా ఓల్డ్ స్కూల్ విలనిజాన్ని వదల్లేదు అనిపిస్తుంది. ఇంకా తనికెళ్ళ భరణి, నాజర్, అజయ్, నక్సల్స్ నాయకుడిగా నటించిన సత్యదేవ్ పాత్రలు ఆకట్టుకుంటాయి. మణిశర్మ సంగీతం, నేపథ్య సంగీతం తిరు చాయా గ్రహణం మెప్పిస్తాయి. ఇక రామ్ లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాకి హైలైట్ గా నిలిచిపోతుంది. మొత్తం మీద ‘ఆచార్య’గా చిరంజీవి, సిద్ధగా రామ్ చరణ్ తొలిసారి తెరపై కనిపించి అభిమానుల్ని కనువిందు చేశారు. మెగాస్టార్ వీరాభిమానులకు ఈ సినిమా విందు భోజనం లాంటి సినిమా. 

ట్యాగ్ లైన్ :  మెగా అభిమానులకు మాత్రమే 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International