పది ప్రశ్నాపత్రాల లీకేజీకి.. మంత్రి బొత్స రాజీనామా చేయాలి : అచ్చెన్న

ABN , First Publish Date - 2022-05-01T01:22:24+05:30 IST

పది ప్రశ్నాపత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి బొత్ససత్యనారాయణ రాజీనామా చేయాలని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

పది ప్రశ్నాపత్రాల లీకేజీకి.. మంత్రి బొత్స రాజీనామా చేయాలి : అచ్చెన్న

అమరావతి: పది ప్రశ్నాపత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి బొత్ససత్యనారాయణ రాజీనామా చేయాలని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరుసగా పది ప్రశ్నాపత్రాల లీకేజీ ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పారు. జగన్మోహన్‌రెడ్డి అన్ని వ్యవస్థలతో పాటు విద్యావ్యవస్థను కూడా భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న పదోతరగతి పరీక్షల ప్రశ్నాప్రత్రాలు వరుసగా లీకవుతుంటే జగన్మోహన్‌రెడ్డి చోద్యం చూస్తున్నారన్నారు. ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా, అసలు లీకే కాలేదని విద్యా శాఖ మంత్రి బొత్స సమర్ధించుకోవడం సిగ్గుచేటన్నారు.


ప్రశ్నాపత్రాలు వైసీపీ నేతల వాట్సాప్ గ్రూప్‌ల్లో మాత్రమే తిరిగాయని ఈ విషయంలో వాళ్లను అరెస్టు చేయకుండా.. ఉపాధ్యాయులను బాధ్యులను చేయడం దుర్మార్గమన్నారు. పదోతరగతి ప్రశ్నాపత్రాలు ఎత్తికెళ్లిపోయిన జగన్మోహన్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకుని.. నేడు రాష్ట్రంలో ఆయన ముఠా ప్రశ్నాపత్రాలు లీక్ చేస్తూ విద్యార్ధుల భవిష్యత్తును చీకటిమయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జీఎంసీ బాలయోగి మంత్రిగా ఉన్నప్పుడు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయనే ఆరోపణలు వస్తేనే తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. నేడు రోజూ పదోతరగతి ప్రశ్నాపత్రాలు మార్కెట్లో న్యూస్ పేపర్ల మాదిరిగా అమ్ముకుంటున్నా .. అందుకు సాక్ష్యాలు కనిపిస్తున్నా విద్యా శాఖా మంత్రి స్పందించడం లేదన్నారు.ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలపై సమగ్ర విచారణ జరిపించాలని వైసీపీ ప్రభుత్వాన్ని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-05-01T01:22:24+05:30 IST